Share News

డిప్యూటీ సీఎంకు నిరసన సెగ

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:54 PM

వలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు గిరిజనుల నుంచి నిరసన సెగ తగిలింది.

డిప్యూటీ సీఎంకు నిరసన సెగ
రాజన్నదొరను నిలదీస్తున్న గిరిజనులు

- రాజన్నదొరకు వ్యతిరేకంగా గిరిజనుల నినాదాలు

- సాగుభూమి, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌

- వినతిపత్రం స్వీకరించని ఉప ముఖ్యమంత్రి

- మండిపడిన గిరిజన సంఘ నాయకులు

మెంటాడ ఫిబ్రవరి 28: వలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు గిరిజనుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆయన ఎదుటే గిరిజనులు రాజన్నదొర డౌన్‌ డౌన్‌ అంటూ నినదించారు. ‘గిరిజనుల ఓట్లతో గెలిచిన మీకు.. మేమంటే అంత చిన్న చూపా’ అంటూ వారు అనడంతో డిప్యూటీ సీఎం ఆగ్రహించారు. వెంటనే రాజన్నదొర కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. మెంటాడ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బుధవారం వలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు డిప్యూటీ సీఎం రాజన్నదొర వచ్చేసరికి.. 245 మంది వలంటీర్లకు గాను నాయకులతో కలిపి 200 మంది వరకు హాజరయ్యారు. ఈ లోగా అక్కడ వేసిన కుర్చీలను వైసీపీ నేతలు నింపేశారు. భోజనాల అనంతరం ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. అయితే కార్యకర్తలు, నాయకులు తాకిడి ఎక్కువ అవడంతో రద్దీగా మారింది. ఈ క్రమంలో రాజన్నదొర కొందరికి పట్టాలు ఇచ్చి వెనుదిరిగారు. కార్యాలయం నుంచి బయటకు వస్తున్న ఉప ముఖ్యమంత్రికి సీపీఎం నేత రాకోటి రాములుతో కలిసి గిరిజనులు ఇల్లు, పోడు పట్టాలు అండం లేదని విన్నవించారు. గుర్లగెడ్డ మినీ రిజర్వాయరు పూర్తిచేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని సీపీఎం నేత అనడంతో... ‘ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉంటే చూపించండి’ అని రాజన్నదొర అన్నారు. ‘ పోడు భూములు, ఇంటి పట్టాలు ఇస్తామని మీరు అన్నారు కదా...ఎంతమందికి ఇచ్చారు? మీరిచ్చిన హామీలైనా నెరవేర్చండి’ అని సీపీఎం నేతతో పాటు గిరిజనులు అనడంతో రాజన్నదొర ఆగ్రహం చెందారు. అదే సమయంలో సీపీఎం నాయకులతో పాటు గిరిజనులను పోలీసులు వెనక్కి నెట్టారు. డిప్యూటీ సీఎం తన కారు ఎక్కేందుకు వెళ్తుండగా.. గిరిజనులు ప్రభుత్వానికి, రాజన్నదొరకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విలేఖర్లతో సీపీఎం నేత రాములు మాట్లాడుతూ...గిరిజనుల ఓట్లతో గెలిచిన ఉపముఖ్యమంత్రి గిరిపుత్రులను అవమానించడం సరికాదన్నారు. రానున్న ఎన్నికల్లో గిరిజనుల సత్తా చూపిస్తామని తెలిపారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల నాలుగు నుంచి ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. ఐద్వా నాయకులు హరికృష్ణ వేణి మాట్లాడుతూ.. మహిళలను ఉపముఖ్యమంత్రి రాజన్నదొర అవమాన పరిచారని, గిరిజనుల సమస్యలు వినకుండా పోలీసులతో నెట్టివేయడం బాధాకరమని అన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:54 PM