Share News

పరీక్ష సమయం మార్పుపై నిరసన

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:00 AM

పరీక్ష నిర్వహణ సమయం మార్పుపై అభ్యర్థులు మండిపడ్డారు. తమకు సమాచారం అందించకుండా ఎలా మార్చుతారని అధికారులను నిలదీశారు.

పరీక్ష సమయం మార్పుపై నిరసన
పరీక్ష కేంద్రం వద్ద నిరసన తెలుపుతున్న అభ్యర్థులు

పార్వతీపురం టౌన్‌, మార్చి 10 : పరీక్ష నిర్వహణ సమయం మార్పుపై అభ్యర్థులు మండిపడ్డారు. తమకు సమాచారం అందించకుండా ఎలా మార్చుతారని అధికారులను నిలదీశారు. గిరిజన విద్యార్థి సంఘాలతో కలిసి పరీక్ష కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, తదితర వివరాల సేకరణ, భద్రతకు జిల్లా కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల కోసం ఇటీవల అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అభ్యర్థుల అర్హత, ఎంపికకు సంబంధించి ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించారు. అయితే ఉదయం 9 గంటలకే పరీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సుదూర ప్రాంతాల నుంచి 9.30 గంటలకు చేరుకున్న వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అన్యాయం జరిగిదంటూ గిరిజన విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో పరీక్ష కేంద్రం వద్ద నిరసనకు దిగారు. ఉదయం 10 గంటలకు పరీక్ష అని చెప్పి.. 9 గంటలకే నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించడం సరికాదని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు రంజిత్‌కుమార్‌ ఇన్‌చార్జి డీఆర్‌వో కేశవ నాయుడును నిలదీశారు. సుమారు 100 మందికి పైగా అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తుండడంతో సీఐ కృష్ణారావుతో పాటు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరీక్ష వేళల్లో తేడాలను కలెక్టర్‌కు తెలియజేసి.. అందరికీ న్యాయం చేసే విధంగా చూస్తామని ఇన్‌చార్జి డీఆర్‌వో, సీఐ హామీ ఇవ్వడంతో అభ్యర్థులు శాంతించారు. అక్కడి నుంచి వెనుదిరిగారు.

Updated Date - Mar 11 , 2024 | 12:00 AM