Share News

నిరసనాగ్రహం

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:21 PM

ఎస్మాపై అంగన్‌వాడీలు భగ్గుమంటున్నారు. సర్కారు తీరుపై మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని గత 27 రోజులుగా సమ్మె చేస్తుంటే.. జీవో నెంబరు 2 విడుదల చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

 నిరసనాగ్రహం
సాలూరులో జీవో కాపీలను దహనం చే స్తున్న అంగన్‌వాడీలు

జిల్లావ్యాప్తంగా జీవో కాపీల దహనం

సర్కారు తీరుపై మండిపాటు

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

వెనక్కి తగ్గేదే లేదని వెల్లడి

పార్వతీపురం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి)/బెలగాం/సాలూరు/గరుగుబిల్లి/సీతంపేట : ఎస్మాపై అంగన్‌వాడీలు భగ్గుమంటున్నారు. సర్కారు తీరుపై మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని గత 27 రోజులుగా సమ్మె చేస్తుంటే.. జీవో నెంబరు 2 విడుదల చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. తమ హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరును ఖండిస్తూ.. ఈ మేరకు ఆదివారం జిల్లావ్యాప్తంగా జీవో కాపీలను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్వతీపురం కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో అంగన్‌వాడీలు నిరసన దీక్ష కొన సాగించారు. ఈ 24 గంటల నిరవధిక దీక్షలో భద్రగిరి, బలిజపేట మండలాల సెక్టార్ల అంగన్‌వాడీలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎన్ని ఎస్మాలను ప్రయోగించినా వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్‌వాడీల సంఘం నాయకులు స్పష్టం చేశారు. తమ డిమాండ్లపై స్పందిం చకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. సాలూరు, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, పాలకొండ, సీతంపేట, సీతానగరం తదితర ప్రాంతాల్లో అంగన్‌వాడీలు జీవో నెంబరు 2 కాపీలను దహనం చేశారు. ప్రభుత్వ తీరును ఖండించారు. ఎస్మాను రద్దు చేయాలని నినదించారు. సర్కారు చర్యలకు తాము భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. సీఐటీయూ నాయకులు వారికి సంఘీభావం తెలిపారు.

Updated Date - Jan 07 , 2024 | 11:21 PM