రక్షణ తాడే.. ఉరి తాడై
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:28 PM
పనిలో రక్షణ కోసం ఉపయోగించే తాడు (సేఫ్టీ రూప్) ఆ కార్మికుడి పాలిట ఉరి తాడు అయింది. ప్రమాదవశాత్తు క్వారీపై నుంచి జారిపడిన ఆ కార్మికుడి మెడకు తాడు బిగుసుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు.

- క్వారీపై నుంచి జారిపడిన కార్మికుడు
- చేతిలో ఉన్న తాడు మెడకు చిక్కుకున్న వైనం
- ఊపిరాడక మృతి.. ధర్మవరంలో విషాదం
శృంగవరపుకోట రూరల్, జూన్ 7: పనిలో రక్షణ కోసం ఉపయోగించే తాడు (సేఫ్టీ రూప్) ఆ కార్మికుడి పాలిట ఉరి తాడు అయింది. ప్రమాదవశాత్తు క్వారీపై నుంచి జారిపడిన ఆ కార్మికుడి మెడకు తాడు బిగుసుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ధర్మవరం గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లోతేటి అప్పారావు (45) క్వారీ కార్మికుడు. గ్రామ సమీపంలో ఉన్న మల్లేశ్వరమెట్ట (దెయ్యలమెట్ట)పై రాళ్లు కొట్టి వాటిని ఇళ్లనిర్మాణాలకు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. అప్పారావుతో పాటు మరో 21 మంది కలిసి పనిచేస్తారు. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు అప్పారావు రాయి కొట్టేందుకు వంద అడుగుల ఎత్తులో ఉన్న క్వారీపైకి వెళ్లాడు. రక్షణ కోసం నడుముకు పెద్ద తాడు కట్టుకున్నాడు. అలాగే, సురక్షితంగా కిందకు దిగేందుకు చేతితో మరో తాడు పట్టుకు న్నాడు. ఆరు గంటల సమయంలో రాయి కొడుతుండగా కాలు జారింది. అయితే, రక్షణ తాళ్లు ఉండడంతో పైనుంచి కిందకు పడకుండా మధ్యలో వేలాడుతూ ఉండిపోయాడు. ఈ క్రమంలో నడుము తాడును మరింతగా బిగించుకొని చేతిలో ఉన్న తాడుతో కిందకు దిగేందుకు ప్రయత్నం చేసే క్రమంలో ఆ తాడు మెడకు చిక్కుకుంది. దీంతో ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనునిత్యం కుటుంబం కోసమే తపన..
అప్పారావుకు తల్లి ముత్యాలమ్మ, భార్య పద్మ, కుమారుడు నాయుడు, కుమార్తె ఉన్నారు. అప్పారావు అనునిత్యం తన కుటుంబం కోసం తపన పడేవాడు. ప్రతిరోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్వారీ పనికి వెళ్లేవాడు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అద్దె ఆటో నడిపేవాడు. ఆటో లేని సమయంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళ్లేవాడు. అలా రూపాయి, రూపాయి దాచి ఇంటి అవసరాలను తీర్చడంతో పాటు గత ఏడాది కుమార్తె వివాహం చేశాడు. అలాగే, రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుమారుడికి పెద్ద ఆపరేషన్ చేయించాడు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న తల్లికి నెలనెలా మందులు కొనుగోలు చేస్తూ చక్కగా చూసుకుంటున్నాడు. ఇంతలా కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి చనిపోవడంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడనికి డబ్బులు లేక అల్లాలాడుతుంటే గ్రామ ఆటోయూనియన్ రూ.5వేలు ఆర్థిక సాయం చేసింది. సర్పంచ్ సన్యాసయ్య, గ్రామ పెద్దలు లగుడు తిరుపతి, అల్లు మహాలక్ష్మి నాయుడు, తదితరులు బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అప్పారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.