Share News

హామీ ఇచ్చారు.. నెరవేర్చారు

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:24 PM

ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.

హామీ ఇచ్చారు.. నెరవేర్చారు
సంతకవిటి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న దృశ్యం

- ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ

- మంత్రి లోకేష్‌ ఆదేశాలతో అందిస్తున్న అధికారులు

- ఆనందం వ్యక్తంచేస్తున్న విద్యార్థులు

కలెక్టరేట్‌, జూలై 28: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఆయన గెలుపొంది రాష్ట్ర మానవ వనరులు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆ హామీని నెరవేరుస్తున్నారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని వివిధ కళాశాలలకు పుస్తకాలు చేరాయి. కొన్ని జూనియర్‌ కాలేజిల్లో విద్యార్థులకు అందజేశారు. జిల్లాలోని 18 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఐదు వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. సైన్సు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు ఆరు వైట్‌ పేపర్స్‌ బుక్స్‌, మరో ఆరు రూల్‌ పుస్తకాలు చొప్పున అందజేస్తున్నారు. అలాగే బ్యాగ్‌లు కూడా పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి సుమారు రూ.1500 నుంచి రూ.2వేలు విలువ చేసే కిట్లను అందజేస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మెరుగుపడనున్న ఫలితాలు

గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఇంటర్‌ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సాధారణంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేరేవారిలో ఎక్కువమంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. వారికి పుస్తకాలు పంపిణీ చేయకపోవడం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడేవారు. కళాశాలల వైపు పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. ఆర్థిక సమస్యలతో చాలామంది పుస్తకాలను కొనుగోలు చేయలేకపోయేవారు. అధ్యాపకులు చెప్పిన పాఠాలను అర్థం చేసుకుని చదువుకునేవారు. పాఠ్య పుస్తకాలు లేకపోవడంతో పరీక్షల సమయంలో ఇబ్బంది పడేవారు. అనుకున్న స్థాయిలో ఫలితాలు కూడా వచ్చేవి కావు. దీంతో తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ పిల్లలను ప్రైవేటు కాలేజీల్లో చేర్పించేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, మోడల్‌ కాలేజీలు, కేజీవీబీల్లో ఇంటర్‌ చదివే విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పాఠ్య, నోట్‌ పుస్తకాలతోపాటు బ్యాగ్‌లు కూడా అందజేయాలని ఆదేశించారు. ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల లోపలే కొత్త పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ విద్యార్థులు కార్పొరేట్‌ కళాశాలల విద్యార్థులతో పోటీపడి చదివే అవకాశం ఉంటుంది. దీనివల్ల మెరుగైన ఫలితాలు సాధించే వీలుంటుంది.

ఆనందంగా ఉంది

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తకాలను ప్రభుత్వం అందజేయడం చాలా ఆనందంగా ఉంది. సుమారు రూ.2వేల విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేయడం చాలా కష్టం. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఉచితంగా అందజేసిన పుస్తకాలను సద్వినియోగం చేసుకుని చక్కగా చదివి మంచి ఫలితాలు సాధిస్తాం.

-ఎన్‌.చంద్రకళ, ఎంపీసీ, సెకండియర్‌, గంట్యాడ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ

చదువుపై ఆసక్తి పెరుగుతుంది

ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు అందజేయడం వల్ల విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది నిరుపేద, మద్య తరగతి చెందిన వారు ఉంటారు. వీరికి పుస్తకాలను కొనుగోలు చేసుకునే ఆర్థిక స్థోమత ఉండదు. ఉచితంగా పుస్తకాలు ఇవ్వడంతో ఇక నుంచి మంచి ఫలితాలు వస్తాయి.

-ఎం.హరి బాబు, ఫిజిక్స్‌ లెక్చరర్‌, గంట్యాడ కళాశాల

చాలా ఉపయోగ పడతాయి

పాఠ్య, నోట్‌ పుస్తకాలు, బ్యాగ్‌ విద్యార్థులకు చాలా ఉపయోగ పడతాయి. గతంలో పుస్తకాలు ఇవ్వకపోవడంతో పాత పుస్తకాలను విద్యార్థులకు అందజేసి పాఠాలు బోధించేవాళ్లం. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు. కొత్త పుస్తకాలనే ప్రభుత్వం అందజేస్తుంది. దీనివల్ల మంచి ఫలితాలు రావడంతో పాటు ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది.

-ఎల్‌వీ జగన్నాథరావు, ప్రిన్సిపాల్‌, గంట్యాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

Updated Date - Jul 28 , 2024 | 11:24 PM