యువతకే ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:22 PM
మంత్రివర్గంలో ఈసారి యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. కొత్తవారిని ప్రోత్సహించడంతో పాటు యువత అయితే అభివృద్ధిని మరింత వేగంగా తీసుకువెళ్లగలరని చంద్రబాబు భావించినట్లుంది. ఈ విషయాన్ని ఊహించని సీనియర్లు తమకు పదవి వస్తుందని ఆశపడ్డారు.

యువతకే ప్రాధాన్యం
హేమాహేమీలకు దక్కని అవకాశం
2014 పునరావృతం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
మంత్రివర్గంలో ఈసారి యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. కొత్తవారిని ప్రోత్సహించడంతో పాటు యువత అయితే అభివృద్ధిని మరింత వేగంగా తీసుకువెళ్లగలరని చంద్రబాబు భావించినట్లుంది. ఈ విషయాన్ని ఊహించని సీనియర్లు తమకు పదవి వస్తుందని ఆశపడ్డారు. తర్వాత పేరు లేకపోవడంతో కాస్త నిరాశ పడ్డారు. అయితే అధినేత ఏం చేసినా ముందుచూపుతో చేస్తారన్న అభిప్రాయానికి వచ్చారు. యువతకు ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో గజపతినగరం ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికైన యువనాయకుడు కొండపల్లి శ్రీనివాస్‌కు రాష్ట్ర మంత్రివర్గంలో బెర్త్ లభించింది. ఇదే సమయంలో సీనియర్లపై చర్చ నడిచింది.
- మూడు పర్యాయాలు సునాయసంగా ఎస్.కోట నుంచి గెలుపొందిన కోళ్ల లళితకుమారి ఈసారి మంత్రి పదవి ఆశించారు. కిమిడి కళావెంకట్రావు ఎన్‌టీఆర్ మంత్రివర్గం నుంచి మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. అది కూడా హోం శాఖ వంటి కీలక శాఖలను సైతం చేపట్టారు. 2014లో మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కళావెంకట్రావుకు ఎనర్జీ(విద్యుత్) శాఖ మంత్రి పదవి దక్కింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కళాకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు, జిల్లా ప్రజలు చర్చించుకున్నారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కోండ్రు మురళీమోహన్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఎస్సీ కేటగిరిలో అయినా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. ఆశ నెరవేరలేదు. బొబ్బిలి ఎమ్మెల్యేగా మొదటి సారి గెలుపొందిన బేబీనాయనకు మంత్రి పదవి ఇస్తారని బొబ్బిలి ప్రాంత ప్రజలు ఆశించారు. సామాజిక మాధ్యమాల్లో బేబీనాయనకు మంత్రి పదవి అంటూ మంగళవారం చక్కర్లు కొట్టింది. అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలను అప్పగించినట్లు కూడా ఫేక్ న్యూస్ చక్కర్లు కొట్టింది.
ఉమ్మడి జిల్లాలో
2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనపుడు కూడా కళావెంకట్రావుకు మంత్రి పదవి దక్కలేదు. అప్పట్లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిమిడి మృణాళినికి మంత్రి పదవి దక్కింది. మూడేళ్ల తరువాత మంత్రి వర్గ విస్తరణలో భాగంగా మృణాళినిని తప్పించారు. కళావెంకట్రావుకు విద్యుత్ శాఖ మంత్రి పదవిని అందించారు. 2014లో జరిగిన మాదిరిగానే ఈ సారి కూడా కళాకు మంత్రి పదవి దక్కలేదు. ఇతర కీలక పదవి ఏదైనా దక్కవచ్చునేమో.
-----------------