Share News

వలంటీర్లపై ఒత్తిడి

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:17 AM

జిల్లాలో పలు మండలాలకు చెందిన వలంటీర్లపై ఎమ్మెల్వోలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సోమవారం నాటికి మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని.. వెనుకంజ వేయకుండా ప్రతిఒక్కరూ రెడీగా ఉండాలని వాట్సాప్‌ల్లో మెసేజ్‌లు పంపిస్తున్నారు.

వలంటీర్లపై ఒత్తిడి

సోమవారం నాటికి సిద్ధం కావాలని మెసేజ్‌లు

(గరుగుబిల్లి )

జిల్లాలో పలు మండలాలకు చెందిన వలంటీర్లపై ఎమ్మెల్వోలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సోమవారం నాటికి మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని.. వెనుకంజ వేయకుండా ప్రతిఒక్కరూ రెడీగా ఉండాలని వాట్సాప్‌ల్లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. దీనిపై కొందరు ఎమ్మెల్వోలు, అధికార పార్టీ ప్రతినిధులు లోపా యికారిగా ఆదేశాలిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వలంటీర్లు ముందుకు రాకున్నా.. వారిని వదలడం లేదు. బలవంతంగా ఫోన్లు చేసి రాజీనామాలకు సిద్ధం కావాలం టున్నారు. రానున్నది ‘మన ప్రభుత్వ మేనని, ప్రస్తుత ఎన్నికల తరుణంలో జగన్‌కు మనమే సైన్యంలా ఉండాలని, అధికారంలోకి వస్తే మంచి భవిష్యత్‌ ఉంటుంది’ అని హామీలు గుప్పిస్తున్నారు. ‘జగన్‌ ఐదేళ్లలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు ఓటు రూపంలో రుణం తీర్చుకొనే సమయం ఆసన్నమైంది’ అనే రీతిలో ఓటర్లను అభ్యర్థించి తిరిగి అధికారంలో తీసుకొచ్చే బాధ్యత మీపైనే ఉందని వలంటీర్లకు పైనుంచి ఆదేశాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కొంతమంది అయిష్టంగానే అంగీకారం తెలుపుతున్నారు. మరికొందరు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పది సర్వేలు నిర్వహించగా, అందులో 9 సర్వేలు తిరిగి జగనే అంటున్నాయన్న సమాచా రాన్ని పంపిస్తున్నారు. మొత్తంగా ఒకవైపు తాయిలాలు, మరోవైపు ఒత్తిడితో వలంటీర్లు సతమతమవుతున్నారు. ఇప్పటికే అనుకూలంగా ఉన్న వలంటీర్లను నియోజకవర్గ పెద్దలు రూ. 5 వేలు పైబడి ముందస్తుగా అందించారు. నోటిఫికేషన్‌ తర్వాత మరికొంత మొత్తం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వలంటీర్లతో రాజీనామాలు చేయించి.. వారిని పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించడంతో పాటు గతంలో కేటాయించిన 50 ఇళ్ల బాధ్యతను అప్పగిం చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

టీడీపీ వైపు.. వలంటీర్ల చూపు

పార్వతీపురం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు భరోసాతో జిల్లాలో అత్యధిక వలంటీర్లు రాజీనామాలకు వెనుకంజ వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారని.. రూ. పది వేల చొప్పున గౌరవ వేతనం కూడా అందించనున్నట్లు ప్రకటించారని.. ఈ నేపథ్యంలో తామెం దుకు రాజీనామాలు చేయాలని కొందరు వలంటీర్లు ప్రశ్నిస్తున్నారు. రాజీనామాలు చేసిన వారికి రానున్న ప్రభుత్వంలో భవిష్యత్‌ ఉండకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. దీంతో కొంతమంది వైసీపీ వేధింపులకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ వైపే చూస్తున్నారు. రాజీనామాలకు వారు ససేమిరా అనడంతో కొంతమంది వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వలంటీర్లపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. తక్షణమే రాజీనామాలు చేయాలని.. లేకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా హుకుం జారీ చేస్తున్నారు. అయినప్పటికీ జిల్లాలో మెజార్టీ వలంటీర్లు రాజీనామాలు చేయడానికి ఇష్టపడడం లేదు. వైసీపీ ప్రభుత్వ కాలంలో వలంటీర్లుగా నియమించినప్పటికీ.. తామేమీ ఖాళీగా కూర్చొని రూ.5 వేలు గౌరవ వేతనం తీసుకోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సంక్షే పథకాల పంపిణీతో పాటు అధికార పార్టీ నాయకు సమావేశాలకు ప్రజలు తరలింపు తదితర పనులు చేపట్టినా.. వైసీపీ సర్కారు తమను గుర్తించలేదన్నారు. గతంలో తమ గౌరవ వేతనం పెంచాలని కోరినా.. సీఎం జగన్‌ పట్టించు కోలేదని గుర్తు చేసుకుంటున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు రూ. పది వేలు గౌరవ వేతనంగా ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం హర్షణీయమని అత్యధిక వలంటీర్లు చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లా పరిధిలో సుమారు 5,200 మంది వలంటీర్లు ఉన్నారు. అయితే ఒత్తిళ్లు భరించలేక వీరఘట్టాం మండలంలో 61 మంది, భామినిలో 22, గరుగుబిల్లిలో 17 , పాచిపెంటలో 23 మంది చొప్పున మొత్తంగా 123 మంది తమ రాజీనామాలను ఎంపీడీవోలకు అందించారు. కొమరాడ, గుమ్మ లక్ష్మీపురం, జియ్యమ్మవలస, సీతానగరం, పాలకొండ, మక్కువ, సీతానగరం, సాలూరు, పార్వతీపురం మండలాల్లో రాజీనామాలు చేసేందుకు ముందుకు రాలేదు. అయితే గత రెండు రోజులుగా ప్రతి మండలంలోని ఎమ్మెల్వోలు రాజీనామా పత్రాల నమూనాలను సంబంధిత వలంటీర్లకు వాట్సాప్‌ మెసేజ్‌ రూపంలో పంపిస్తున్నారు. రాజకీ యాల్లోకి తమను బలవంతంగా లాగొద్దని కొంతమంది వలంటీర్లు ప్రాధేయపడుతున్నా కొన్ని గ్రామాల్లో ససేమిరా అంటున్న పరిస్థితి నెలకొంది. ‘మా ప్రభుత్వంలో నియమించిన మిమ్మల్ని తొలగించే హక్కు మాకే ఉంది. మేము చెప్పినట్లుగా వ్యవహరించకుంటే ఇబ్బందులకు గురికాక తప్పదు’ అని హెచ్చరిస్తున్నారు. దీంతో కొంతమంది వలంటార్లు నేరుగా తమ గోడును మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బందికి వెళ్లబుచ్చుకుంటున్నారు.

రాజకీయ లబ్ధికోసమే..

మేము రూ.5 వేల గౌరవ వేతనంతో రాత్రి, పగలు అని తేడా లేకుండా సేవలందించాం. ఐదేళ్లలో ఎంతో కోల్పోయాం. టీడీపీ అధికారంలోకి వస్తే.. ఉపాధి అవకాశాల ద్వారా భవిష్యత్తులో మా జీవితాలు బాగుపడతాయని ఆశిస్తున్నాం. అయితే వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం రాజీనామా చేయాలని మాపై ఒత్తిడి చేస్తోంది. భవిష్యత్తు కోసం ఆలోచించే నా లాంటి వారు రాజీనామా చేసే ప్రసక్తే లేదు.

- ఓ గ్రామ వలంటీర్‌, పార్వతీపురం మన్యం జిల్లా

===================================

ఎందుకు చేయాలి

ఉపాధి కోసమే..గ్రామ, వార్డు వలంటీర్లుగా పనిచేస్తున్నాం. కానీ ఎన్నికలు వచ్చేసరికి వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని మాపై ఒత్తిడి చేస్తున్నారు. రాజీనామా చేయాలని కొంతమంది వైసీపీ నాయకులు ఆదేశాలిస్తున్నారు. మేముందుకు రాజీనామా చేయాలి. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్య మంత్రి అయితే రూ.10 వేలు వేతనం వస్తుంది. మా జీవనం మెరుగు పడుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాం

- ఓ వార్డు వలంటీర్‌, పార్వతీపురం మన్యం జిల్లా

Updated Date - Apr 14 , 2024 | 12:17 AM