Share News

వైసీపీలో ‘పోస్టల్‌’ కలవరం

ABN , Publish Date - May 09 , 2024 | 11:29 PM

పోస్టల్‌ బ్యాలెట్‌ పోల్‌ అయిన తీరు అధికార పార్టీ నేతలను కలవర పెడుతోంది. మొదటి రోజు నుంచి చివరి రోజు అయిన గురువారం వరకు ఆ పార్టీ నేతలు పోస్టల్‌ బ్యాలెట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు అనేక కుయుక్తులు పన్నారు.

వైసీపీలో ‘పోస్టల్‌’ కలవరం

వైసీపీలో ‘పోస్టల్‌’ కలవరం

వ్యూహం బెడిసికొట్టిందేమోనని టెన్షన్‌

ఉద్యోగుల నుంచి ప్రతికూల పవనాలేనా?

విజయనగరం, మే 9:

పోస్టల్‌ బ్యాలెట్‌ పోల్‌ అయిన తీరు అధికార పార్టీ నేతలను కలవర పెడుతోంది. మొదటి రోజు నుంచి చివరి రోజు అయిన గురువారం వరకు ఆ పార్టీ నేతలు పోస్టల్‌ బ్యాలెట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు అనేక కుయుక్తులు పన్నారు. ఉద్యోగుల ఓట్లలో వీలైనన్ని వైసీపీకి పడేలా ప్రలోభాలకు ప్రయత్నించారు. ఓటేయడానికి బయలుదేరిన ఉద్యోగిని అనుసరిస్తూ పదేపదే ఫ్యాన్‌ గుర్తును చూపుతూ ఇబ్బంది పెట్టారు. అడగకపోయినా మజ్జిక, పెరుగు ప్యాకెట్లు పంచారు. సీక్రెట్‌గా డబ్బులు ఇవ్వజూపారు. మందు సీసాలను కూడా వెంట పెట్టుకుని ఫెసిలిటేషన్‌ సెంటర్‌ సమీపంలో ఆటోలో తిష్ఠ వేశారు. ఈ విధంగా అనేక రకాలుగా ఉద్యోగులను దారి తప్పించడానికి ప్రయత్నించినా వారు మాత్రం తామనుకున్న మార్గాన్ని వీడలేదు. ఓటేసి వచ్చాక వారు స్పందించిన తీరే అందుకు నిదర్శనం. కొందరు ఉద్యోగులు ముందే వైపీపీ వారు ఏం చెప్పినా తల ఊపేయాలని, ఓటు మాత్రం అనుకున్న వ్యక్తికే వేయాలని నిర్ణయించుకున్నారు. అటువంటి వారు ఏ మిచ్చినా దర్జాగా తీసుకున్నారు. వైసీపీ శ్రేణులు మాత్రం ఉద్యోగులు తమవైపే ఉన్నారని చంకలు గుద్దుకుంటున్నారు.

ప్రజాప్రతినిధులు సైతం క్యూ..

ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు ఏకంగా వైసీపీ ప్రజాప్రతినిధులు క్యూ కట్టిన పరిస్థితి ఈ మూడు రోజుల్లో కనిపించింది. ఎంపీపీలు, జడ్పీటీసీలు ఏజెంట్ల రూపంలో అక్కడే తిష్ఠవేయగా మిగతా వారు ఓటర్లను పలకరించడం, దగ్గరగా వెళ్లి ఓటు అభ్యర్థించడం.. సహకరించాలని కోరడం.. ఏమైనా కావాలా అని అడగడం చేశారు. నాయకులు ఉద్యోగుల జాబితాను పట్టుకుని తిరగడం కూడా కనిపించింది. శృంగవరపుకోట ఫెసిలిటేషన్‌ సెంటర్‌ తొలిరోజు కోలాహలంగా మారిపోయింది. ఏకంగా ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోనే అధికార పార్టీ ఎంపీపీ, జడ్పీటీసీలు తిష్ఠవేసేశారు. పోలింగ్‌ బూత్‌ ఎదురుగా వున్న విశాఖ-అరకు రోడ్డులో కూడా ఎక్కడ చూసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలే కనిపించారు. ఇక విజయనగరంలోని జేఎన్‌టీయూ సమీపంలో అధికార పార్టీ ఎన్నికల ప్రచారమే చేసేసింది. ఫ్యాన్‌ గుర్తును చూపి వాటర్‌, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తూ ప్రలోభాలకు ప్రయత్నించింది.

ఆ నేతల్లో కలవరం

పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదైన శాతాన్ని చూసి అధికార పార్టీ నేతలకు ఇప్పటి నుంచే దిమ్మ తిరుగుతోంది. దాదాపు ఉద్యోగులంతా ఓటును ఉపయోగించుకున్నారు. స్థానికంగా లేకపోయినా జిల్లా కేంద్రంలో ఉన్న ప్రత్యేక ఫెసిలిటేషన్‌ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. వారంతా ముందు నుంచే ఖచ్చితమైన అభిప్రాయంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఉద్యోగులైతే పిల్లలతో క్యూలో నిరీక్షించారు. తద్వారా ఓటు ప్రాధాన్యాన్ని కూడా చెప్పకనే చెప్పారు. చివరి రోజు చాలా మంది ఉద్యోగులు నాయకులు పిలిచినా వారి వద్దకు వెళ్లలేదు. చిన్నగా నవ్వేసి ఓటు వేసి వెళ్లిపోయారు. మరి ఆ మౌనం దేనికి సంకేతమో చూడాలి.

ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు

పోస్టల్‌ బ్యాలెట్లకు గాలం వేసే పనిలో భాగంగా అధికార పార్టీ నేతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. కొందరు ఉద్యోగులను ఒత్తిడి చేసి మరి ప్రత్యేక వాహనాల్లో పోలింగ్‌ కేంద్రం వద్ద దించారు. ఆయా నాయకులు పరిచయం ఉన్న వ్యక్తులు కావడంతో ఉద్యోగులు మొహమాటంతో వాహనం ఎక్కారు. కాగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి వచ్చాక వారిని నాయకులు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఉద్యోగులు ముందే పసిగట్టారు. తాము అనుకున్నట్లు ఓటేసి వెళ్లారు.

జిల్లా వ్యాప్తంగా 16,102 పోస్టల్‌ బ్యాలెట్లు

కలెక్టరేట్‌: పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈనెల 5వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వేశారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ 16,102 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వేశారు. రాజాంలో 2116 మంది, బొబ్బిలిలో 2433, చీపురుపల్లిలో 1496, గజపతినగరంలో 2089, నెల్లిమర్లలో 1759,విజయనగరంలో 4204, ఎస్‌.కోటలో 2005 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వేశారు.

---------------

Updated Date - May 09 , 2024 | 11:29 PM