Share News

గొల్లల ములగాంలో పోలీస్‌ పికెట్‌

ABN , Publish Date - May 17 , 2024 | 12:01 AM

మండలంలోని జి.ములగాంలో బుధవారం రాత్రి నుంచి పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలి ఓటు విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.

గొల్లల ములగాంలో పోలీస్‌ పికెట్‌
ములగాంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ పికెట్‌

- వృద్ధురాలి ఓటుపై తలెత్తిన వివాదం

- ఇరు వర్గాల మధ్య ఘర్షణ

చీపురుపల్లి, మే 16: మండలంలోని జి.ములగాంలో బుధవారం రాత్రి నుంచి పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలి ఓటు విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ వివాదం మరింత ముదరకుండా ఉండేందుకు గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 13న పోలింగ్‌ రోజు గ్రామానికి చెందిన వత్సవాయి వరహాలమ్మ అనే వృద్ధురాలితో అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గొర్లె బోగయ్య సహాయకుడిగా వచ్చి ఓటు వేయించడానికి ప్రయత్నించాడు. దీనికి అక్కడే ఉన్న వైసీపీ పోలింగ్‌ ఏజెంట్‌ అడ్డు చెప్పాడు. దీంతో బోగయ్య బయటికి వచ్చేశాడు. ఆ మరుసటి రోజు గ్రామంలోని రచ్చబండ వద్ద ఇదే అంశంపై ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మాటమాటా పెరిగి స్వల్ప కొట్లాటకు దారి తీసింది. ఇరు వర్గాలకు చెందిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ కె. కిరణ్‌కుమార్‌నాయుడు సిబ్బందితో గ్రామానికి చేరుకొని, ఇరు వర్గాలను శాంతింప జేశారు. ఇరు వర్గాల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ తెలిపారు. అవసరాన్ని బట్టి ఇరు వర్గాలకు చెందిన కొంతమందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో పోలీస్‌ పికెట్‌ను ఏర్పాటు చేశామని ఎస్‌ఐ నాయుడు తెలిపారు.

Updated Date - May 17 , 2024 | 12:01 AM