Share News

ప్లీజ్‌.. ఒక్క క్షణం

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:55 PM

విద్యార్థులారా! ఒక్క క్షణం ఆలోచించండి. క్షణికావేశంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీ కుటుంబాలను అగాథంలోకి నెడుతున్నాయి.

ప్లీజ్‌.. ఒక్క క్షణం

-ఆలోచిస్తే భవిష్యత్‌ అంతా మీదే

-క్షణికావేశంతో విద్యార్థుల బలవన్మరణాలు

-ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్న వైనం

-మార్కులు ఒక్కటే జీవితం కాదు

-మానసిక వైద్యుల సూచనలు తీసుకుంటే మేలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

విద్యార్థులారా! ఒక్క క్షణం ఆలోచించండి. క్షణికావేశంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీ కుటుంబాలను అగాథంలోకి నెడుతున్నాయి. చదువులో వెనుకబడిపోయామని, మార్కులు రావడం లేదని, ర్యాంకులు కొట్టలేకపోతున్నామని, పరీక్షలు తప్పామని, ఉద్యోగాలు రాలేదని ఆత్మహత్యలు చేసుకోవద్దు. బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను అన్వేషించండి. మార్కులను కొలమానంగా తీసుకోవద్దు. ఒత్తిడిని అధిగమిస్తే ఉజ్వల భవిష్యత్‌ మీదే.

- ఉమ్మడి విజయనగరం జిల్లా డెంకాడ మండలం సమీపంలోని జొన్నాడ లేఅవుట్‌లో ఈ నెల 19న షేక్‌లాల్‌ మజాక్‌(21) అనే ఇంజనీరింగ్‌ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగాం గ్రామానికి చెందిన మజాక్‌ డెంకాడలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువును పూర్తి చేశాడు. అయితే, కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో మళ్లీ పరీక్షలు రాసేందుకు ఇక్కడకు వచ్చాడు. ఒత్తిడి తట్టుకోలేకపోయాడో, మరే కారణమో తెలియదు గానీ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

- పార్వతీపురం పట్టణంలోని కుసుంగిడ్డ వీధికి చెందిన విద్యార్థి కె.తారకేశ్వరరావు ఈనెల 19న ఆత్మహత్య చేసుకున్నాడు. తారకేశ్వరరావు ఇంటర్‌ పూర్తి చేసిన తరువాత విజయనగరం సమీపంలోని ఓ ప్రైవేట్‌ విశ్వ విద్యాలయంలో బీటెక్‌లో చేరాడు. అయితే మొదటి సంవత్సరంలో చదువులో వెనుకబడుతున్నానని భావించి బలవర్మణానికి పాల్పడ్డాడు.

- పార్వతీపురం పట్టణానికి చెందిన శ్రేయష్‌ (17) అనే విద్యార్థి ఈనెల 21న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న శ్రేయష్‌ తాను చదువులో బాగా వెనుకబడినట్లు తోటి విద్యార్థులతో తరచూ చెప్పేవాడు. ఇటీవల రాసిన పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో వత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.

.. ఇలా ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తుంది. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయాలు ఆ కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ప్రధానంగా 18-35 సంవత్సరాల మధ్య ఉన్న యుక్త వయస్సుల వారే క్షణికావేశానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఒత్తిడికి గురై పరీక్షలు బాగా రాయలేమనో.. పరీక్ష తప్పుతామనో.. తోటి స్నేహితులతో పోటీ పడలేకపోతున్నామనో భావిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి ఛీత్కారాలు ఎదురవుతాయన్న భయం కూడా వారిని వెంటాడుతుంటోంది. దీంతో క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం వారి జీవితాలను అగాథంలోకి నెడుతున్నాయి. బలవన్మరణాలకు దారి తీస్తున్నాయి.

ఒత్తిడే కారణం

ప్రస్తుతం ఎక్కడ చూసినా మానసిక ఒత్తిడి అనేది సహజ సమస్యగా మారింది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఉజ్వల భవిష్యత్‌కు దారితీయాల్సిన చదువులు చావుకు కారణమవుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు కూడా చదువు కోసం పిల్లలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. తోటివారితో పోలిక పెడుతున్నారు. ‘మీ స్నేహితులు బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు. వారితో పోటీ పడలేకపోతే నీవెందుకు. జీవితంలో బాగుపడే లక్షణాలు లేవా’ అంటూ తిడుతున్నారు. విద్యా సంస్థలు కూడా విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు అయితే కనీసం విద్యార్థులకు విశ్రాంతి లేకుండా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దీంతో భరించలేక విద్యార్థులు తనువు చాలిస్తున్నారు.

మార్కులు కొలమానం కాకూడదు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ద్వారా మేథోపరమైన సామర్థ్యాలకు ప్రాధాన్యం కల్పిస్తోంది. విద్యార్థులు ఏ రంగంపై, ఏ సబ్జెక్టుపై ప్రతిభ కనబరుస్తున్నారో గుర్తించాల్సి ఉంది. దీనికి అనుగుణంగా విద్యను అందించాలి. వృత్తి పరమైన, స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ వంటి అవకాశాలు ఉన్నాయని, మార్కులు ఒక్కటే జీవితానికి గీటురాయి కాదని, మార్కులు సాధించిన వారంతా మంచి స్థాయిలో ఉంటారు అనుకోవటం పొరపాటు అని, బతికేందుకు అనేక అవకాశాలున్నాయని ఇలా విద్యార్ధులకు జీవితంపై అవగాన కల్పించాల్సి ఉంది. కానీ, చాలా విద్యా సంస్థలు వీటిని పట్టించుకోవడం లేదు. ఎంతసేపూ మార్కులే కొలమానంగా బోధన సాగిస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

విద్యార్థులకు కౌన్సిలింగ్‌ అవసరం

డిప్రెషన్‌, ఒత్తిడి, జీవితంపై నిరాసక్తత, జీవితంలో ఏమీ సాధించలేమన్న ఆలోచన, భవిష్యత్‌ అంధకారంగా కన్పించడం, తమకు తోడుగా నిలిచేవారు ఎవరూ లేరనే భావన, తదితర అంశాలు విద్యార్థుల్లో ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. విద్యార్థుల్లో ఎక్కువ శాతం మందికి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. అందుచేత అన్ని విద్యా సంస్థల్లోనూ తరచుగా సైక్రియాటిస్టు నిపుణులతో కౌన్సిలింగ్‌ నిర్వహించడం అవసరం. ఆత్మహత్య సంకేతాలను గుర్తు పట్టడం తదితర అంశాలపై అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలి. విద్యార్థులకు మార్కులే కొలమానం కాకుండా మేథో పరమైన సామర్థ్యాలకు విలువ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.

- డాక్టర్‌ జె.రమేష్‌, సైక్రియాటిస్టు, విజయనగరం.

Updated Date - Mar 22 , 2024 | 11:56 PM