Share News

అనుమతులు మీరి..

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:57 AM

పార్వతీపురం వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు నామినేషన్‌ కార్యక్రమం కారణంగా పట్టణంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో బుధవారం చేపట్టిన ర్యాలీ వల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో ఎక్కడి రాహదారులు అక్కడే నిలిచి పోయాయి. పాదచారులు, వాహనచోదకులు రాకపోకలు సాగించలేకపోయారు.

అనుమతులు మీరి..
వైసీపీ అభ్యర్థి ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకున్న 108 వాహనం

కొందరు మద్యం షాపులకు పరుగులు

ఇరువైపులా ప్రధాన రహదారిని బ్లాక్‌ చేసిన వైనం

స్తంభించిన ట్రాఫిక్‌

వాహన రాకపోకలకు అంతరాయం

పార్వతీపురం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి)/పార్వతీపురం టౌన్‌/ సీతానగరం, ఏప్రిల్‌ 24 : పార్వతీపురం వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు నామినేషన్‌ కార్యక్రమం కారణంగా పట్టణంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో బుధవారం చేపట్టిన ర్యాలీ వల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో ఎక్కడి రాహదారులు అక్కడే నిలిచి పోయాయి. పాదచారులు, వాహనచోదకులు రాకపోకలు సాగించలేకపోయారు. మండుటెండలో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 10.30 గంటలకు పాతబస్టాండ్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా ఆసుపత్రి కూడలి వరకు సాగింది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగగా.. పట్టణంలో నాలుగు రోడ్లు, మేదర వీధి, ఆర్టీసీ కాంప్లెక్‌ సమీపంలో, పోలీస్‌ బీట్‌ కూడళ్లు వద్ద వైసీపీ అభిమానులు, కార్యకర్తలు శృతిమించారు. అభిమానంతో నృత్యాలు చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. వాస్తవంగా ప్రధాన రహదారిలో ర్యాలీకి సంబంధించి ఒకవైపే పోలీసులు అనుమతులు ఇచ్చారు. అయితే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, ర్యాలీకి వచ్చిన వారు ఇరువైపులా రహదారిని బ్లాక్‌ చేయడంతో పాదచారులు, వాహనచోదకులకు కష్టాలు తప్పలేదు. ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరమవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా ర్యాలీ సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని పోలీస్‌ బీట్‌ కూడలి వద్ద ఓ 108 వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీంతో పోలీసు సిబ్బంది అప్రమత్తమై.. సుమారు పది నిమిషాల్లోనే ఆ వాహనం వెళ్లేలా చర్యలు చేపట్టారు.

మద్యం షాపులు కిటకిట

వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నామినేషన్‌కు వచ్చిన వారితో పాటు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అధికంగా పట్టణంలో మద్యం దుకాణాల వద్ద బారులుదీరారు. ర్యాలీ మధ్యలోనే మద్యం కోసం భారీగా క్యూ కట్టారు. అయితే తోపులాట జరగకుండా కానిస్టేబుల్‌ వారిని కంట్రోల్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు ర్యాలీలో పాల్గొనకుండానే వెనక్కి వెళ్లిపోయారు. కొంతమంది మద్యం సీసాలతో రోడ్డుపైనే సందడి చేశారు. ఇంకొందరు సమీప బడ్డీల వద్దకు వెళ్లి బహిరంగంగానే మద్యం తాగారు. ఇదిలా ఉండగా నామినేషన్‌కు వచ్చిన వారికి మద్యం, బిరియానీ ప్యాకెట్‌తో పాటు ఒక్కొక్కరికీ రూ.300 చొప్పున వైసీపీ నాయకులు ఇచ్చినట్లు కొందరు చెప్పుకోవడం కనిపించింది.

Updated Date - Apr 25 , 2024 | 12:57 AM