పాత వారికే పింఛన్లు
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:14 AM
దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనలకే పరిమితమవుతున్నారు. ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తున్నారు. దీంతో ప్రజలకు నిరాశ తప్పడం లేదు. నూతన పింఛన్ల మంజూరు విషయంలోనూ సర్కారు దరఖాస్తుదారులకు మొండిచేయి చూపింది.
అన్ని అర్హతలున్నా.. మంజూరు చేయని వైనం
ఎన్నికల కోడ్‌కు సమీపిస్తున్న సమయం
ఆందోళనలో జిల్లావాసులు
(గరుగుబిల్లి)
దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనలకే పరిమితమవుతున్నారు. ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తున్నారు. దీంతో ప్రజలకు నిరాశ తప్పడం లేదు. నూతన పింఛన్ల మంజూరు విషయంలోనూ సర్కారు దరఖాస్తుదారులకు మొండిచేయి చూపింది. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి సామాజిక తనిఖీలు పూర్తయ్యాయి. జిల్లాలోని అన్ని సచివాలయాల నుంచి మండల అభివృద్ధి కార్యాలయాలకు, అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని సెర్ప్ కార్యాలయానికి అర్హుల జాబితాలు వెళ్లాయి. అయితే నిబంధనల మేరకు అన్ని అర్హతలున్నా పింఛన్లు మంజూరు కాకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పింఛన్లు మంజూరవుతాయో.. లేదోనని మథనపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో ఎంతోమంది నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారుల ఆదేశాలతో విద్యుత్ బిల్లులు, ఆధార్, ఓటరు కార్డులతో సంబంధిత సచివాలయాల్లో నమోదు చేసుకున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు నిశితంగా పరిశీలించి పింఛన్ల మంజూరుకు నివేదికలు అందించారు. గత మూడు నెలల కిందట 15 మండలాలు, మూడు అర్బన్ మండలాల నుంచి సుమారు 10 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. ఇందులో అధికంగా దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు ఉన్నారు. అయితే జనవరిలో కొంతమందికి నూతన పింఛన్లుమంజూరు చేశారు. ఫిబ్రవరి, మార్చిలో మాత్రం మంజూరు చేయలేదు. సామాజిక తనిఖీలు నిర్వహించి నివేదికలు అందించినా మంజూరు కాకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల సమస్య కారణంగానే మంజూరులో జాప్యం నెలకొందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాగా ఫిబ్రవరి నెలకు సంబంధించి జిల్లాలోని 1,45,952 మంది పింఛన్‌దారుల కోసం సుమారు రూ. 43 కోట్లును బ్యాంకుల్లో జమ చేశారు. మొత్తంగా పాతవారికే పింఛన్లు అందించి..నూతన దరఖాస్తుదారుల ఆశలపై ప్రభుత్వం నీరు చల్లింది. ఇప్పటికైనా సర్కారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
జాబితాలను పంపించాం
జిల్లాలో అర్హులైన వారికి పింఛన్ల మంజూరు కోసం సెర్ప్ అధికారులకు జాబితాలు పంపించాం. ఫిబ్రవరి నెలకు సంబంధించి నూతన పింఛన్లు మంజూరు కాలేదు. సచివాలయాల పరిధిలో సంబంధిత వెల్ఫేర్ అసిస్టెంట్లు పరిశీలన చేసి నివేదికలు అందించారు. ఇంతరకు పింఛను పొందిన వారికి పలు కారణాలతో నిలిచినట్లయితే పరిశీలన చేసి అందించే చర్యలు చేపడతాం. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
- వై.సత్యంనాయుడు, ఇన్‌చార్జి పీడీ, డీఆర్‌డీఏ