నకిలీ ధ్రువపత్రంతో పింఛన్
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:52 PM
నకిలీ విద్యార్హతల ధ్రువపత్రంతో పింఛను పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన కరక సత్యనారాయణ జగనన్నకు చెబుదాంలో విన్నవించుకున్నారు.
-‘జగనన్నకు చెబుదాం’లో ఫిర్యాదు
- 192 వినతులు స్వీకరించిన అధికారులు
కలెక్టరేట్, జనవరి 29: నకిలీ విద్యార్హతల ధ్రువపత్రంతో పింఛను పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన కరక సత్యనారాయణ జగనన్నకు చెబుదాంలో విన్నవించుకున్నారు. కలెక్టరేట్ ఆడిటోరి యంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వివిధ సమస్యలపై 192 వినతులు వచ్చాయి. డీఆర్‌వో అనిత, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సుదర్శనదొర, సుమబాల తదితరులు వినతులు స్వీకరించారు. కొర్లాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జామి మండలం బాపు ట్యుటోరియల్‌లో 1970-71 నుంచి 1971-72లో ఐదు నుంచి ఆరో తరగతి చదివినట్లు తప్పుడు స్టడీ సర్టిఫికెట్ తీసుకున్నారని అదే గ్రామానికి చెందిన కరక సత్యనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవంగా ఆ వ్యక్తి గంట్యాడ జెడ్పీ పాఠశాలలో 1980 జూన్ 17న ఆరో తరగతిలో చేరినట్లు ప్రధానోపాధ్యాయురాలు స్టడీ సర్టిఫికెట్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్‌తో ఆధార్‌లో వయస్సు మార్పు చేసుకుని పింఛను పొందారని వివరించారు. ఇప్పటికే రెండుసార్లు మండల పరిషత్ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. వెంటనే దీనిపై విచారణ చేయాలని కోరారు. కాగా, రెవెన్యూ శాఖకు సంబంధించి 120, గ్రామ వార్డు సచివాలయ శాఖకు 13, పంచాయితీరాజ్ విభాగానికి 15, డీఆర్‌డీఏ 22, వైద్య ఆరోగ్య శాఖ 6, హౌసింగ్‌కు 5 వినతులు వచ్చాయి. సంబంధిత అధికారులతో డీఆర్‌ఓ మాట్లాడుతూ పోలింగ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ సిస్టంలో డేటాను అప్‌లోడ్ చేయాలని సూచించారు.
టోల్‌గేట్ ఎందుకో?
‘విజయనగరం నుంచి విశాఖపట్టణం వెళ్లే రహదారిలో జొన్నాడ గ్రామ సమీపంలో బోడమెట్టపాలెం వద్ద టోల్ గేట్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇది ఆరు వరుసల రహదారి కాదు. నిత్యం విజయనగరం నుంచి తగరపువలస, విశాఖపట్టణానికి వెళ్లే ప్రయాణికులు మాత్రమే ఆధికంగా ఉంటారు. విశాఖపట్టణంలో ఆసుపత్రులకు అధిక సంఖ్యలో రోగులు వెళ్తారు. టోల్‌గేట్ వల్ల ఆర్థిక భారం కూడా పడుతుంది. ఎందుకు ఈ టోల్ గేట్ నిర్మిస్తున్నారో తెలియడం లేదు. వెంటనే విరమించుకోవాలి’ అని విజయనగరం నియోజకవర్గం టీడీపీ నాయకులు ఐవీపీరాజు, ప్రసాద్, కనకల మురళీమోహన్ జగనన్నకు చెబుదాంలో విన్నవించుకున్నారు.
స్థలాన్ని ఆక్రమించి షెడ్డు వేసుకున్నారు
విజయనగరం పట్టణం 11వ వార్డులోని రాజీవ్‌నగర్ కాలనీలో తమ ఖాళీ స్థలాన్ని ఒక కార్పొరేటర్ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని జె.పార్వతి జగనన్నకు చెబుదాంలో విన్నవించుకున్నారు. ఆ స్థలంలో షెడ్డును నిర్మించుకున్నారని వివరించారు. దీనిపై ప్రశ్నిస్తే అనేక విధాలుగా బెదిరిస్తున్నారని, వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.