Share News

పడిగాపులు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:55 AM

వైసీపీ సిద్ధం సభలకు పాలకొండ ఆర్టీసీ డిపో నుంచి రెండో రోజు కూడా బస్సులు తరలించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పడిగాపులు
పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు

ప్రయాణికులకు తప్పని అవస్థలు

పాలకొండ/భామిని/వీరఘట్టం: వైసీపీ సిద్ధం సభలకు పాలకొండ ఆర్టీసీ డిపో నుంచి రెండో రోజు కూడా బస్సులు తరలించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 23న విజయనగరం జిల్లాలో జరిగిన సభకు పాలకొండ డిపో నుంచి 50 బస్సులు కేటాయించిన ఆర్టీసీ అధికారులు బుధవారం కూడా 60 బస్సులను కేటాయించారు. డిపో పరిధిలో కేవలం 70 బస్సులు మాత్రమే ఉండగా 60 బస్సులను శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ సిద్ధం సభకు మళ్లించారు. కాగా వైసీపీ సభలకు జనాలను తరలించేందుకు జిల్లా నుంచి వరుసగా ఆర్టీసీ డిపోల బస్సులను వినియోగి స్తుండడంపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ సర్కారు తీరుపై పెదవి విరుస్తున్నారు. బస్సులు లేకుండా చేసి.. ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

వివిధ చోట్ల ఇలా..

- పాలకొండ కాంప్లెక్స్‌ వద్ద ఉదయం నుంచి ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక విలవిల్లాడారు. గంటలకొద్దీ నిరీక్షించినా బస్సులు రాకపోవడంతో కొందరు వెనుదిరిగారు. నామినేషన్ల కోసం ప్రైవేటు వాహనాలను వినియోగించడంతో ఈ ప్రభావం ప్రయాణికులపై పడింది. గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాలన్నా కుదరలేదు. వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు, విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు.

- టెక్కలిలో వైసీపీ సిద్ధం సభకు శ్రీకాకుళం నుంచి ఆర్టీసీ బస్సులను తరలించడంతో భామిని మండలం బత్తిలి వైపు బస్సులేవీ రాలేదు. దీంతో మండల వాసులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. కిక్కిరిసుకుని ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో వైసీపీ తీరుపై ప్రజలకు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- వీరఘట్టం బస్టాండ్‌లోనూ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలు ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వచ్చింది.

గంటల కొద్దీ నిరీక్షణ

నేను పాలకొండ నుంచి వీరఘట్టంకు వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే నాలుగైదు గంటల నుంచి బస్సు కోసం వేచిచూస్తున్నా. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎండ తీవ్రతకు బయటకు వెళ్లలేక బస్టాండ్‌లోనే పడిగాపులు కాస్తున్నా.

- లక్ష్మీనారాయణ, వీరఘట్టం

=====================================

ప్రయాణికుల పరిస్థితేమిటి?

నేను పాలకొండ నుంచి రాజాం వెళ్లాల్సి ఉంది. అయితే జగన్‌ సభకు బస్సులు వెళ్లిపోయాయని చెబుతున్నారు. ఇప్పటికే మూడు గంటల నుంచి బస్టాండ్‌లోనే ఉన్నాను. ఎండ తీవ్రతను తట్టుకోలేక బస్టాండ్‌లోనే బస్సు కోసం నిరీక్షిస్తున్నా. నాయకులు కోసం బస్సులను కేటాయిస్తే ప్రయాణికులు పరిస్థితి ఏమిటి.

- చిన్నమ్మి, లింగాలవలస, రేగిడి

================================

రెండు గంటల పాటు అవస్థలు

ఎక్కడో సభల కోసం ఆర్టీసీ బస్సులను తరలిస్తే ఎలా? ఉదయం 8 గంటలకు ప్రైవేట్‌ వాహనం ద్వారా స్వగ్రామం దిమ్మిడిజోల నుంచి బయల్దేరాను. 9 గంటలకు భామిని పీహెచ్‌సీకి చేరి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నా. అయితే తిరిగి గ్రామానికి వెళ్లాలంటే బస్సులు లేవు. ప్రైవేట్‌ వాహనాలు పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్నాయి. వాటిల్లో నేను వెళ్లలేను. దీంతో ఒక షాపు వరండాలో కూర్చోవల్సి వచ్చింది. చివరకు రెండు గంటల తర్వాత బస్సు రావడంతో ఇంటికి చేరగలిగా. ఆర్టీసీ అధికారులు దీనిపై స్పందించాలి. మారుమూల ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి.

-ఎస్‌.వరం, ప్రయాణికురాలు, దిమ్మిడిజోల

Updated Date - Apr 25 , 2024 | 12:55 AM