Share News

ఓటే వజ్రాయుధం

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:37 AM

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని.. అటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య పునాదిని బలోపేతం చేయాలని సిటిజన్‌ ఫర్‌ డెమెక్రసీ వ్యవస్థాపకుడు, రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కోరారు.

ఓటే వజ్రాయుధం
మాట్లాడుతున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌

ఓటే వజ్రాయుధం

ఓటర్లారా ఆలోచించండి

పారదర్శక పాలన అందించేవారినే ఎన్నుకోండి

సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, ఎల్‌వీ సుబ్రహ్మణ్యం

విజయనగరం రూరల్‌, ఫిబ్రవరి 26: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని.. అటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య పునాదిని బలోపేతం చేయాలని సిటిజన్‌ ఫర్‌ డెమెక్రసీ వ్యవస్థాపకుడు, రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కోరారు. రానున్న ఎన్నికల్లో శతశాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని, 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావాలని సూచించారు. ఓటుపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు చేపట్టిన జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం విజయనగరంలోని ఎంవీజీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు రాష్ట్ర మాజీ చీఫ్‌ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యంతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు పారదర్శక పాలన అందించేవారినే ఎన్నుకోవాలన్నారు. ఓటుండి వినియోగించుకోకపోవడం సరికాదని, మేధావులు, విద్యావంతులు, యువత, రిటైర్డు ఉద్యోగులు ఇలా చాలా మంది ఓటింగుకు దూరంగా ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల మంది ఓటర్లు ఓటు వేయలేదని, దీంతో వారి ఓట్లను చోరీ చేసి వేరే వారిని బస్సుల్లో తీసుకువచ్చి ఓట్లు వేయించారన్నారు. ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. రాష్ట్ర మాజీ ఛీఫ్‌ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఓటర్లు నిర్లక్ష్యభావాన్ని వీడాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యేంత వరకూ 18 ఏళ్లు దాటిన వారు ఓటు హక్కు పొందే అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అర్హులు ఓటు వేయకుంటే అంగబలం, అర్ధబలం వున్నవాడిదే పైచేయి అవుతుందని, ప్రజాస్వామ్యం.. ధనస్వామ్యంగా మారుతుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఎవరూ నచ్చకపోతే, నమ్మకం లేకపోతే ‘నోటా’ ఇచ్చారని, నోటాకు కూడా ఓటేసి ఓటరు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలపవచ్చునన్నారు. కార్యక్రమంలో సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి వి.లక్ష్మణరెడ్డి కూడా మాట్లాడారు.

- ఆట..పాట ద్వారా రంగం రాజేష్‌ బృందం ఆలపించిన జానపద గీతాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.. ఓటు ఆవశ్యకత.. ఓటు హక్కు వినియోగించుకోకపోతే కలిగే నష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. కార్యక్రమంలో ఎంవీజీఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టరు రమేష్‌తో పాటు, కళాశాల ఎన్‌ఎస్‌స్‌ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:37 AM