Share News

ఆదేశాలు సరే.. పైసలేవీ?

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:06 AM

జిల్లా పరిధిలోని పలు పంచాయతీల కార్యదర్శులకు కాసుల కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల నిబంధనల కారణంగా వారికి చేతి చమురు వదులుతోంది.

ఆదేశాలు సరే.. పైసలేవీ?

నిధులు మంజూరుపై స్పష్టత ఇవ్వని వైనం

కార్యదర్శులకు చేతి చమురు వదులుతున్న వైనం

( గరుగుబిల్లి )

జిల్లా పరిధిలోని పలు పంచాయతీల కార్యదర్శులకు కాసుల కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల నిబంధనల కారణంగా వారికి చేతి చమురు వదులుతోంది. కోడ్‌ నేపథ్యంలో గ్రామస్థాయిలో పలు నిర్మాణాలకు ఉన్న రాజకీయ పార్టీల రంగులు చెరపాలని, స్టిక్కర్లను తొలగించాలని రిటర్నింగ్‌ అధికా రులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా రైతుభరోసా కేంద్రాలు, రక్షిత పథకాలు, సచివాలయాలు, విద్యుత్‌ స్తంభాలకు ఉన్న వైసీపీ పోలిన రంగులు, ప్రతి ఇంటికి ఉన్న సీఎం జగన్‌ చిత్రాలతో ఉన్న స్టిక్కర్లు, ప్రధాన రహదారుపై ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని చెబుతున్నారు. అయితే తొలగింపునకు సంబంధించి ఎటువంటి మొత్తాలు పంచాయతీలకు కేటాయించడం లేదు. ప్రతి పంచాయతీలో స్టిక్కర్ల తొలగింపుతో పాటు రంగులు మార్చేందుకు గాను పంచాయతీ కార్యదర్శులకు సుమారు రూ. 5 వేలకు పైగానే ఖర్చు అవుతుంది. సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేయడం తప్ప నిధుల విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో కార్యదర్శులకు ఇబ్బందులు తప్పడం లేదు. జేబులో డబ్బులు తీసి ఆయా పనులు చేపట్టాల్సి వస్తోంది. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించలేక కొంతమంది తలలు పట్టుకుంటున్నారు. ఇంకొందరు అప్పులు చేసి మరీ తొలగింపు చర్యలు చేపడుతున్నారు. ఖర్చుల విషయంపై కొన్ని చోట్ల మండల అధికారులు, కార్యదర్శులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఏదేమైనా సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు పంచాయతీల్లో నిర్వహించిన పనులకు అవసరమైన మొత్తాలను విడుదల చేస్తేనే కార్యదర్శులకు కాస్త ఊరట కలగనుంది.

ప్రత్యేకంగా నిధులు మంజూరు లేదు

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పంచాయతీల్లో పలు కార్యక్రమాలు నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు మంజూరు లేదు. ప్రత్యేక బడ్జెట్‌ కూడా కేటాయించలేదు. ఆర్ధిక సమస్యలతో కార్యదర్శులు సతమత మవుతున్నారు. ఈ సమస్యను రిటర్నింగ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

- మండల అధికారి, గరుగుబిల్లి

Updated Date - Mar 28 , 2024 | 12:06 AM