Share News

ఇంక 5 రోజులే!

ABN , Publish Date - May 29 , 2024 | 11:51 PM

ఇంకా 5 రోజులు. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు వెల్లడి ఎప్పుడా అని అంతా ఒకటే టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులైతే గంటలను లెక్కపెడుతున్నారు. నేతలు, కార్యకర్తలు, వివిధ పార్టీల అభిమానులు, ప్రజల్లోనూ దాదాపు అదే ఉత్కంఠ.

ఇంక 5 రోజులే!

ఇంక 5 రోజులే!

మొదటి ఫలితం నెల్లిమర్లది

పోలింగ్‌ స్టేషన్ల బట్టి అంచనా వేస్తున్న అధికారులు

లెక్కింపునకు ఎన్నికల సిబ్బంది కసరత్తు

అందరిలో ఒకటే టెన్షన్‌

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఇంకా 5 రోజులు. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు వెల్లడి ఎప్పుడా అని అంతా ఒకటే టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులైతే గంటలను లెక్కపెడుతున్నారు. నేతలు, కార్యకర్తలు, వివిధ పార్టీల అభిమానులు, ప్రజల్లోనూ దాదాపు అదే ఉత్కంఠ. అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపైనే. ఈసారి మొదటి ఫలితం నెల్లిమర్ల నియోజకవర్గానిది కావొచ్చునని అంచనా వేస్తున్నారు. అక్కడ పోలింగ్‌ స్టేషన్లు తక్కువగా ఉండటమే అందుకు కారణం. వచ్చేనెల 4న ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30కి ఈవీఎమ్‌ ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ విధుల్లో ఉండే సిబ్బంది మాత్రం 6గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటారు. ప్రతి టేబుల్‌ వద్దా అభ్యర్థుల తరుపున ఒక్కో ఏజెంట్‌ ఉంటారు. అలాగే జనరల్‌ ఏజెంట్‌గా అభ్యర్థి లేదా వారు సూచించిన వారు ఉంటారు. ఇలా కౌంటింగ్‌ ప్రక్రియలో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. జిల్లా వ్యాప్తంగా 20వేలకు పైబడి పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి. ముందుగా ఆయా నియోజకవర్గాలకు చెందిన వాటిని 500 చొప్పున కట్టలుగా కట్టి వాటిని లెక్కిస్తారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎమ్‌ ఓట్ల లెక్కింపునకు ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేశారు.

కౌంటింగ్‌ ఇలా..

ఈవీఎమ్‌లను స్ట్రాంగ్‌ రూముల వద్ద వరుస సంఖ్యలో ఉంచారు. వీటిని మొదటిగా ఒకటో నెంబరు నుంచి 14వరకు ఉన్న ఈవీఎమ్‌లను అందిస్తారు. రెండో రౌండ్‌లో 15వ నెంబరు నుంచి 28వ నెంబరు ఈవీఎమ్‌వరకు అందిస్తారు. ఇలా ప్రతి రౌండ్‌కు 14 చొప్పున ఈవీఎమ్‌లను అందిస్తూ లెక్కింపును కొనసాగిస్తారు. ప్రతి రౌండ్‌లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినది ప్రకటిస్తారు. అయితే అధికారికంగా ప్రకటించే టప్పటికి జాప్యం జరుగుతూ ఉంటుంది. కౌంటింగ్‌ జరుగుతున్న ఏజెంట్లకు మాత్రం మూడు లేదా నాలుగో రౌండ్‌ ఫలితాలు తెలుస్తుంటాయి. అధికారిక ప్రకటన కాస్త ఆలస్యం అవుతుంటుంది. దీనికి తోడు అభ్యర్థుల మెజార్టీలు తక్కువ వ్యత్యాసం ఉంటే ఫలితం మారింత జాప్యం జరుగుతుంటుంది. దీనికి కారణం అభ్యర్థులు రీ కౌంటింగ్‌ డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. వేల సంఖ్యలో వ్యత్యాసం ఉంటే మాత్రం త్వరగానే లెక్కింపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

మొదటి ఫలితం నెల్లిమర్లదే

టేబుళ్లు.. ఈవీఎమ్‌ల ఆధారంగా ఓట్ల లెక్కింపు...రౌండ్లు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏ నియోజకవర్గంలో తక్కువ పోలింగ్‌ స్టేషన్లు/ఈవీఎమ్‌లు ఉంటాయో ఆ ఫలితం ముందుగా వెలువడే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తే నెల్లిమర్ల నియోజకవర్గంలో తక్కువ పోలింగ్‌ స్టేషన్లున్నాయి. ఇక్కడ 248 పోలింగ్‌ స్టేషన్లున్నాయి. 14 టేబుళ్లకు కలిపి 18రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. చివరి రౌండ్‌లో తక్కువ ఈవీఎంలు మాత్రమే మిగులుంటాయి. బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, విజయనగరం 19 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. నెల్లిమర్ల తరువాత చీపురుపల్లి ఫలితం వెలువడే అవకాశం ఉంది. రాజాం నియోజకవర్గంలో 284 ఈవీఎంలు ఉన్న కారణంగా 21 రౌండ్ల వరకు కౌంటింగ్‌ సాగనుంది. ఈ ఫలితం ఆలస్యం కానుందని భావిస్తున్నారు. అయితే కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలు, ఏజెంట్ల అభ్యంతరాల వల్ల కూడా సంబంధిత నియోజకవర్గాల ఫలితాలు జాప్యమయ్యే పరిస్థితి ఉండొచ్చు.

రెండు చోట్ల లెక్కింపు

జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎమ్‌లను రెండు చోట్ల భద్రపరిచారు. విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాలకు చెందిన ఈవీఎమ్‌లను జెఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉంచగా నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, గజపతిగనగరం, ఎస్‌.కోట నియోజకవర్గాల ఈవీఎమ్‌లను లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలో భద్రపరిచారు. ఆయా స్టాంగ్‌ రూమ్‌ల వద్దనే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన టేబుళ్లు, బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. సీఆర్‌పీఎఫ్‌, ఆర్మ్‌డ్‌, లోకల్‌ పోలీస్‌లతో గస్తీ కొనసాగుతుంది. లెక్కింపు తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా వచ్చేనెల 6 వరకు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

- జిల్లాలో 15,62,921 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఓటు హక్కు వినియోగించుకున్న వారు 12,71,173 మంది. 1847 పోలింగ్‌ కేంద్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. అతి తక్కువగా విజయనగరం నియోజకవర్గంలో 71.84 శాతం ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో 88.25 శాతం ఓటేశారు.

----------------------------------------------------------------------

నియోజకవర్గం కేంద్రాలు టేబుళ్లు రౌండ్లు

----------------------------------------------------------------------

నెల్లిమర్ల 248 14 18

చీపురుపల్లి 257 14 19

గజపతినగరం 264 14 19

బొబ్బిలి 264 14 19

విజయనగరం 260 14 19

ఎస్‌.కోట 270 14 20

రాజాం 284 14 21

-----------------------------------

Updated Date - May 29 , 2024 | 11:51 PM