Share News

ఇక ఒక్కరోజే..!

ABN , Publish Date - May 12 , 2024 | 12:06 AM

పోలింగ్‌ సమయం సమీపిస్తోంది. మరో 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ఇక ఒక్కరోజే..!

ఇక ఒక్కరోజే..!

పోలింగ్‌కు అధికార యంత్రాంగం సన్నద్ధం

ముగిసిన ప్రచారం.. మద్యం షాపులకు సీళ్లు

మరో 24 గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్‌

రాజాం రూరల్‌, మే 11: పోలింగ్‌ సమయం సమీపిస్తోంది. మరో 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఏడు నియోజకవర్గాల్లో రిటర్నింగ్‌ అధికారులు పోలింగ్‌ కేంద్రాల్లో వసతి సౌకర్యాలు కల్పించారు. వృద్ధులు, మహిళలు, ప్రత్యేకావసరాలు కలిగిన వారు ఓటు వేసేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, పార్టీ శ్రేణుల ప్రచారానికి శనివారం తెరపడడంతో ప్రచార వాహనాలు మూలకు చేరాయి. శనివారం సాయంత్రం జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాలు, మాల్స్‌కు తాళాలు పడ్డాయి. ఎక్సైజ్‌, సెబ్‌ అధికారులు షాపులకు సీళ్లు వేశారు.

ష్‌.. గప్‌ చుప్‌..

శనివారం సాయంత్రంతో అధికారిక ప్రచార పర్వానికి తెరపడింది. పోటీలో ఉన్న అభ్యర్థుల విజయాన్ని కోరుతూ రెండు నెలలుగా ప్రచార రథాలతో పాటు ఆటోలు, ఇతరత్రా వాహనాలతో గూబ గుయ్‌మనిపించేలా ప్రచారం చేస్తూ వచ్చారు. అభ్యర్థుల గుణగణాలతో పాటు పార్టీల మేనిఫెస్టోలను ప్రచారం చేస్తూ ఊదరగొట్టారు. శనివారం సాయంత్రానికి అంతా గప్‌చూప్‌ అయింది.

ఆదివారం కీలకం

ఎన్నికల పర్వంలో ఆదివారం రాత్రి ఎంతో కీలకం. ఒక్కరాత్రే కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి. వందల కేసుల మద్యం ఏరులై పారనుంది. ఇందుకోసం నెలరోజులుగా ఏర్పాట్లు చేసుకున్న అధికార వైసీపీ నాయకులు మద్యం పంపిణీపైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇందులోభాగంగా శనివారం గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

హారతిపల్లెంలో నగదు..

మరికొద్ది గంటల్లో ప్రచార పర్వం ముగియనున్న పరిస్థితుల్లో రేగిడి మండలంలో ఓ కీలకనేత హారతిపల్లెంలో నగదు వేయడం సంచలనంగా మారింది. దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ, పలు పదవులు అనుభవించిన ఆ నాయకుడు ఇటీవలే వైసీపీకి మద్దతు పలికారు. శనివారం ప్రచారంలో పాల్గొన్న ఆయన పలుచోట్ల మహిళలు హారతులిచ్చే సమయంలో అందులో నగదు వేశారు. జేబులో నుంచి నగదు తీసి పల్లెంలో వేస్తూ కెమెరాకు చిక్కారు.

------------------------

Updated Date - May 12 , 2024 | 12:06 AM