Share News

సర్కారు స్థలాలు కబ్జా

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:22 AM

సర్కారు స్థలాల ఆక్రమణ... కోట్ల రూపాయల సంపాదన.. చీపురుపల్లిలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ ఇదీ.. పట్టణంలోని విజయనగరం- పాలకొండ ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న సర్కారు స్థలాల్లో కొందరు కబ్జాదారులు పాగా వేశారు. ఆక్రమించి ఆపై దుకాణాల నిర్మాణాలకు పూనుకున్నారు.

సర్కారు స్థలాలు కబ్జా
గరివిడి- చీపురుపల్లి రోడ్డులో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దుకాణాలు

సర్కారు స్థలాలు కబ్జా

చీపురుపల్లిలో యథేచ్ఛగా దుకాణాల నిర్మాణం

విచారణ లేకుండా వాటికి విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు

ఒకరిని చూసి ఒకరు ఇదే పంథా

సర్కారు స్థలాల ఆక్రమణ... కోట్ల రూపాయల సంపాదన.. చీపురుపల్లిలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ ఇదీ.. పట్టణంలోని విజయనగరం- పాలకొండ ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న సర్కారు స్థలాల్లో కొందరు కబ్జాదారులు పాగా వేశారు. ఆక్రమించి ఆపై దుకాణాల నిర్మాణాలకు పూనుకున్నారు. తద్వారా ఆ స్థలాన్ని సులువుగా సొంత చేసుకోవచ్చునని ఎత్తు వేశారు. విద్యుత్‌ శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించకుండా కరెంటు కనెక్షన్‌ కూడా మంజూరు చేసేస్తున్నారు. ఈ భూ వ్యవహారాలకు కొందరు అధికార పార్టీ నాయకులు సహకరిస్తున్నట్లు సమాచారం. వారి అండ చూసుకునే ఆ వ్యక్తులు భూములపై పడుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని స్థానికులు వాపోతున్నారు.

(చీపురుపల్లి)

చీపురుపల్లిలో భూములు ధరలు కొంతకాలంగా అమాంతం పెరుగుతూ పోతున్నాయి. చీపురుపల్లి- గరివిడి పట్టణాల మధ్య కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలున్నాయి. వాటిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆక్రమిత స్థలాల్లో దుకాణాలు నిర్మిస్తున్నారు. రోడ్డు పక్కనున్న ఈ స్థలాలు వ్యాపారానికి అనువైనవి కావడంతో దుకాణాలు నిర్మించి, వేల రూపాయాలకు అద్దెకిస్తున్నారు. లేదంటే లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. భూ ఆక్రమణలపై ఇటీవల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందింది. ఆ మేరకు కోడూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నం.1/4లో గరివిడి తహసీల్దారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా కూడా అదే సర్వే నంబరులో వివిధ చోట్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, చీపురుపల్లి మండలం, ఆంజనేయపురంలో సర్వే నం.32/7లో జిరాయితీ స్థలానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించారు. ఆ స్థలాన్ని వ్యాపారాలకు అద్దెకిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదేమని అడిగిన స్థలం యజమానులపై ఆక్రమణదారులు ఇటీవల దాడికి కూడా తెగపడినట్టు తెలిసింది. ఈ విధంగా రోడ్డుకిరువైపులా ఉన్న విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురై, ఆక్రమణదారులకు రూ.లక్షలు, రూ.కోట్లు తెచ్చిపెడుతున్నాయి.

- ప్రధాన రహదారికిరువైపులా ప్రభుత్వం స్థలాలు ఈ విధంగా కబ్జా గురవ్వడం ఒక ఎత్తైతే, ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాలకు ఎటువంటి క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండానే సంబధిత అధికారులు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేసేస్తున్నారు. సొంత స్థలాల్లో నిర్మించుకున్న దుకాణాలకు గాని, ఇళ్లకు గాని విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయడంలో సవాలక్ష ప్రశ్నలు వేసే విద్యుత్‌ శాఖ అధికారులు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాలకు ఎటువంటి విచారణ లేకుండా కనెక్షన్లు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.

- నిబంధనల ప్రకారం విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు చేసే ముందు సచివాలయం నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. అయితే ప్రభుత్వం నుంచి ఆ స్థలంపై ఎటువంటి డాక్యుమెంట్లు లేని ఆక్రమణదారులు సచివాలయంలో ఏ విధంగా ఎన్‌ఓసీ పొందుతున్నారో ప్రశ్నార్థకంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారమంతా అధికార పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులకు తెలిసే జరుగుతోందని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతమున్న రెవెన్యూ అధికారులంతా పొరుగు జిల్లాలకు చెందిన వారు కావడం, వారందరికీ ఎన్నికల విధులే ప్రధాన ప్రాధాన్యతాంశంగా ఉండడంతో ఆక్రమణదారులు తమకేమీ జరగదన్న ధీమాలో ఉన్నట్టు తెలిసింది.

అక్రమ నిర్మాణాలపై చర్యలు

గరివిడి మండలంలోని కోడూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నం.1/4లో ఉన్న ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకుంటామని గరివిడి ఆర్‌ఐ కంది అచ్యుతరావు తెలిపారు. ప్రాథమికంగా గుర్తించిన స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని, సమగ్రంగా రికార్డులు పరిశీలించాక, అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్రమణదారులపైనా చర్యలుంటాయన్నారు.

రికార్డులు పరిశీలించి చర్యలు

చీపురుపల్లి ఆక్రమణలపై ఆర్‌ఐ రామ్‌కుమార్‌ మాట్లాడుతూ చీపురుపల్లి పరిధిలో మెయిన్‌ రోడ్డుకు ఆనుకొని ఆర్‌ అండ్‌ బీ స్థలాలున్నాయన్నారు. ఒకసారి రికార్డులు పరిశీలించి, రెవెన్యూ స్థలాల్లో ఆక్రమణలున్నట్టు నిర్ధారణ అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

భోగాపురంలో వాగులు.. చెరువులు హాంఫట్‌

భోగాపురం : భోగాపురంలో భూముల ధరలు ఊహాతీతంగా పెరుగుతుండడంతో ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. మండలంలో ఖాళీ స్థలం ఎక్కడ కనిపించినా, అవి వాగు, చెరువు, చెరువు గట్టు అయినా సరే ఆక్రమణకు ఒడిగడుతున్నారు. జిరాయితీ భూములకు పక్కనున్న ప్రభుత్వ భూములను కలిపేసుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు ఆక్రమించుకొన్నవారికి ఆక్రమించుకున్నంత అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు అక్కడికెళ్లి తూతూమంత్రంగా పరిశీలించి వచ్చేస్తున్నారేగాని ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీంతో కొద్దిరోజుల తరువాత మళ్లీ ఆక్రమణలకు ప్రయత్నిస్తున్నారు.

- భోగాపురం మండలంలోని దల్లిపేట వద్దనున్న ఆర్‌అండ్‌బీ రహదారిని ఆనుకొని చెరువుంది. దీనిని మట్టితో పూడ్చేసి ఆక్రమణకు తెరలేపారు. చదునుకూడా చేస్తున్నారు.

- రాళ్లపాలెం నుంచి దల్లిపేట మీదుగా ముంజేరు వరకు సర్వే నెంబరు 218లో సుమారు 1.78 ఎకరాల గెడ్డ వాగు ఉంది. ఈవాగును గతంలో కొంత వరకు పూడ్చేసి ఆక్రమించారు. తాజాగా మిగతా స్థలాన్ని పూర్తిగా మట్టితో పూడ్చేసి చదును చేసేశారు.

- భోగాపురం జాతీయ రహదారి పక్కనున్న గంగిరావి గట్టు చెరువును ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేసుకొంటున్నారు. ఆక్రమణదారులు బహిరంగంగానే కబ్జా చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై ఉప తహసీల్దార్‌ శ్రీనివాసరావును వివరణ కోరగా ఆక్రమణలు గుర్తించి ప్రభుత్వ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొంటామని చెప్పారు.

Updated Date - Apr 12 , 2024 | 12:22 AM