Share News

హడావుడిగా ఇసుక రీచ్‌ల పరిశీలన

ABN , Publish Date - May 21 , 2024 | 11:58 PM

ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులతో కమిటీ ఏర్పాటుచేసి నియంత్రణ చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.

హడావుడిగా ఇసుక రీచ్‌ల పరిశీలన

కొమరాడ: ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులతో కమిటీ ఏర్పాటుచేసి నియంత్రణ చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌తో పాటు పలువురు అధికారుల బృందం మంగళవారం మండలంలోని కేఆర్‌బీపురం గ్రామ సమీపంలో ఉన్న నాగావళి ఇసుక రీచ్‌ను పరిశీలించింది. ప్రస్తుతం ఇసుక తవ్వకాలు నిలిచిపోయినప్పటికీ ఎన్నికల కోడ్‌ ముందు వరకు జరిగిన ఇసుక తవ్వకాలు, ఇప్పుడు ఇసుక రీచ్‌లో ఉన్న నిల్వలపై భూగర్భ గనులశాఖ అధికారులను నివేదిక అందించాలని కలెక్టర్‌ ఆదేశించినట్టు తెలిసింది. ఈ పరిశీలనలో మైనింగ్‌శాఖ, ఎస్‌ఈబీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, డీపీఆర్‌వో, రెవెన్యూ, తదితర అధికారులు ఉన్నారు.

భామిని: వంశధార నదీతీర ప్రాంతంలోని పాత ఇసుక రీచులను అధికారుల బృందం మంగళవారం హడావుడిగా పరిశీలించింది. తాలాడ గ్రామంలో పాలకొండ ఆర్డీవో వీవీ రమణ సందర్శించి ర్యాంప్‌ స్థితిగతులను పరిశీలించి, రీచ్‌ విషయం అడిగి తెలుసుకున్నారు. అలాగే నేరడి, బిల్లుమడ గ్రామాల్లో మైనింగ్‌, పంచాయతీరాజ్‌ అధికారులు పర్యటించారు. గతంలో తాలాడ, నేరడి, బిల్లుమడలో ఇసుక ర్యాంప్‌లును పరిశీలించి జియోట్యాగింగ్‌ చేశారు. ఈ సందర్శనలో తహసీల్దార్‌ శ్రీనివాసరావు, శ్రీకాకుళం మైనింగ్‌ ఏడీ శ్రీనివాసరావు, డీఎల్‌పీవో రాంప్రసాద్‌తో పాటు సర్వేయర్‌ రజేష్‌, రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

బలిజిపేట: మండలంలోని అరపాడ, నారాయణపురం, వంతరాం ఇసుక రీచ్‌లను తహసీల్దార్‌ జీవీ జనార్ధన్‌, ఎస్‌ఐ వి.పాపారావు మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మండలంలో అనుమతిలేని ఇసుక రీచ్‌లను పరిశీలించామని చెప్పారు. అనుమతి లేని ఇసుక రీచ్‌లో ఇసుక తరలిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఏమైనా నిర్మాణాల కోసం పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్‌ అనుమతి పొంది, అనుమతి ఉన్న రీచ్‌ నుంచి ఇసుకను తీసుకుని వెళ్లవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సీతానగరం: మండలంలోని బూర్జ, సీతానగరం ఇసుక రీచ్‌లను తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రాజేష్‌ మంగళవారం తనిఖీ చేశారు. సువర్ణముఖి నదిలోకి వెళ్లి పరిశీలించారు, నదిలో ఇసుక లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. వారి వెంట ఆర్‌ఐ శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - May 21 , 2024 | 11:58 PM