Share News

ఎన్టీఆర్‌ ఆశయాన్ని సాధించాలి

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:47 PM

భవిష్యత్‌ తరాల కోసం ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయాన్ని సాధించడానికి చంద్రబాబు నిరంతరం పనిచేస్తున్నారని, అదే దారిలో అందరం వెళ్లాలని టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్‌ ఆశయాన్ని సాధించాలి
ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న అశోక్‌గజపతిరాజు, అదితి, ఐవీపీ రాజు

ఎన్టీఆర్‌ ఆశయాన్ని సాధించాలి

భవిష్యత్‌ తరాల కోసం కృషిచేసిన మహనీయుడు

టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు

విజయనగరం రూరల్‌, జనవరి 18: భవిష్యత్‌ తరాల కోసం ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయాన్ని సాధించడానికి చంద్రబాబు నిరంతరం పనిచేస్తున్నారని, అదే దారిలో అందరం వెళ్లాలని టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ వర్థంతిని పురస్కరించుకుని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్‌ పాలన సాగిందన్నారు. రూ.2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మండల వ్యవస్థ తీసుకొచ్చి నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమాన్ని సంక్షోభంలోకి తీసుకువెళ్లిందన్నారు. విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు మాట్లాడుతూ, రాజకీయాల్లో సంస్కరణలకు ఆద్యుడిగా ఎన్టీఆర్‌ నిలిచారన్నారు. ఆయన కలగన్న ఆంధ్రప్రదేశ్‌ని చూడాలంటే తిరిగి రాష్ట్రంలో టీడీపీ-జనసేన పాలన రావాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రసాదుల కనకమహాలక్ష్మీ, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, కంది మురళీనాయుడు, అనురాధబేగం, షేక్‌ భాషా పాల్గొన్నారు.

----------------

Updated Date - Jan 18 , 2024 | 11:47 PM