Share News

ఐదేళ్లలో ఏమీ చేయలే!

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:57 PM

వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి అట్టడుగుకు చేరింది. ఏమీ చేయకపోవడమే అభివృద్ధి అన్న కొత్త నిర్వచనం ఇచ్చినట్టయింది. శిథిల భవనాలు.. నిలిచిన పనులే.. నత్తనడకన సాగుతున్న పనులే అంతటా కనిపిస్తున్నాయి.

ఐదేళ్లలో ఏమీ చేయలే!
పూర్తి కాని మానాపురం రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి

ఐదేళ్లలో ఏమీ చేయలే!

ఎక్కడికక్కడ నిలిచిన పనులు

ఇంకొన్ని నత్తనడకన సాగుతున్న వైనం

కొత్తగా రాని పరిశ్రమలు

వలసబాట పట్టిన నిరుద్యోగులు

జీతాల కోసం ఉద్యోగుల అవస్థలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి అట్టడుగుకు చేరింది. ఏమీ చేయకపోవడమే అభివృద్ధి అన్న కొత్త నిర్వచనం ఇచ్చినట్టయింది. శిథిల భవనాలు.. నిలిచిన పనులే.. నత్తనడకన సాగుతున్న పనులే అంతటా కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం స్వయంగా మంజూరు చేసిన పనులు సైతం ఆగిపోయాయి. బిల్లులు చెల్లించకపోవడమే ఈ దుస్థితికి కారణం. ఉచితాల పేరుతో ప్రజాధనంతో ఓట్ల రాజకీయానికి పెద్దపీట వేసి అభివృద్ధి లేని పాలన అందించారన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. చివరికి ఉద్యోగులకు నిర్దిష్ట తేదీకి జీతాలు చెల్లించలేని స్థితికి తీసుకువచ్చారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం నిత్యం జీతాల కోసం పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఇక జిల్లా యువత అంతా ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం వలసపోతోంది. ఇంకొందరు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్నారు. అభివృద్ధి పనుల విషయానికి వస్తే ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. జిల్లా నుంచి ఒడిశా రాష్ట్రానికి వెళ్లే బొబ్బిలి-రాయగడ మార్గంలో సీతానగరం వద్ద సువర్ణముఖీ నదిపై వంతెనను మంజూరు చేశారు. బ్రిటీష్‌ కాలం నాటి వంతెన కూలిపోయే పరిస్థితి రావటంతో వైసీపీ ప్రభుత్వం రూ.11కోట్ల అంచనా వ్యయంతో నిధులు మంజూరు చేసింది. కాని బిల్లులు సక్రమంగా చెల్లించని కారణంగా కాంట్రాక్టర్‌ పనులను అర్ధాంతరంగా విడిచి పెట్టాడు. అంటే స్వయంగా వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు సైతం కుంటుపడేలా చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక పనులు ఇలా మధ్యాంతరంగా నిలిచిన వాటిలో ఉన్నాయి.

- గత ప్రభుత్వ హయాం నుంచి కొనసాగుతున్న అభివృద్ధి పనుల పరిస్థితి అడగనవసరం లేదు. భోగాపురం విమానాశ్రయానికి, విజయనగర ప్రజల తాగునీటికి, నెల్లిమర్ల నియోజవర్గ రైతులకు సాగునీటిని అందించాల్సిన తారకరామతీర్థసాగర్‌ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. కనీసం భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలను సైతం కొలిక్కితేలేకపోయారు. బడ్జెట్లో ఏటా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం షరామామూలే. ఆ నిధులు విదల్చకుండా సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తికాకుండా చేశారు.

- విజయనగరం నుంచి బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, ఒడిశాలోని రాయగడ, సాలూరు మీదుగా రాయ్‌పూర్‌ వంటి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వెళ్లాలంటే దత్తిరాజేరు మండలం మానాపురం వద్దనున్న రైల్వే గేట్‌ దాటాలి. దీనికి పరిష్కారంగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి చేపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంజూరైన రైల్వే ఫ్లైఓవర్‌ పనులను సైతం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయింది. దీంతో నిత్యం గేటు వేసేటపుడు వేలాది వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అంబులెన్స్‌లు వచ్చినపుడు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది.

- జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది మంది యువతీయువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. వీరంతా ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. దీనికి కారణం జిల్లాలో పరిశ్రమలు లేకపోవడమే. ఉపాధి మార్గాలపై ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టలేదు. దీంతో చదువుకున్న యువత హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు ఐటీ ఉద్యోగాల కోసం వలస వెళ్లారు. ఏ తల్లిదండ్రులను కదిపి మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడిగినా ఇతర రాష్ట్రాల పేర్లే చెపుతున్నారు. అంత దారుణమైన పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది.

- లక్షలాదిమంది యువత ఉపాధి నమోదు కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిరుద్యోగాన్ని పెంచి పోషించింది. వివిధ కార్యాలయాల్లో ఉద్యోగ విరమణ చేస్తున్నా వారి స్థానంలో తిరిగి నియామకాలు చేపట్టడం లేదు. సచివాలయ ఉద్యోగాల గురించి తప్ప వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఏం చేసింది చెప్పలేకపోతోంది. ఇలా అనేక సమస్యలు ప్రజలను వెంటాడుతుంటే అంతా సిద్ధం అంటూ ప్రచారం చేస్తూ వైసీపీ ఎన్నికల ప్రచారం చేస్తోంది. పెండింగ్‌ పనులు, అభివృద్ధి లేకపోవటం, నిరుద్యోగం ఇదేనా అంతా సిద్ధం అంటూ ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి.

Updated Date - Apr 19 , 2024 | 11:57 PM