Share News

చిన్న పొరపాటు కూడా జరగకూడదు

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:24 PM

ఎన్నికల తంతులో చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని కలెక్టర్‌ నాగలక్ష్మి అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లు ఎంతో కీలకమని, వాటి తయారీ, జారీ, స్వీకరణలో లోపాలు తలెత్తకూడదని ఆదేశించారు.

చిన్న పొరపాటు కూడా జరగకూడదు
మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

చిన్న పొరపాటు కూడా జరగకూడదు

పోస్టల్‌ బ్యాలెట్లు చాలా కీలకం

శిక్షణలో కలెక్టర్‌ నాగలక్ష్మి

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6: ఎన్నికల తంతులో చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని కలెక్టర్‌ నాగలక్ష్మి అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లు ఎంతో కీలకమని, వాటి తయారీ, జారీ, స్వీకరణలో లోపాలు తలెత్తకూడదని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల శిక్షణలో భాగంగా పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించిన అంశాలపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం శిక్షణ ఇచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనీలుగా ఎంపికైన డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారి కె.సందీప్‌ కుమార్‌ శిక్షణ ఇచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గత ఎన్నికలతో పోలిస్తే ప్రసుత్త ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లు, ఓటింగ్‌, కౌటింగ్‌ విధానాల్లో పలు మార్పులు వచ్చాయని చెప్పారు. అవన్నీ ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టంగా ఉన్నాయని, వీటిని పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేసేవారని, ఇప్పుడు ఆబ్సెంట్‌ ఓటర్ల విధానం కూడా వచ్చిందని తెలిపారు. దీనిలో భాగంగా 80 సంవత్సరాల వయసు దాటిన వారు, 40 శాతం పైబడిన దివ్యాంగత్వం ఉన్న విభిన్న ప్రతిభావంతులు, కొవిడ్‌ వ్యాధిగ్రస్తులు, అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వినియోగించుకునే ఆవకాశాన్ని కల్పించారని వివరించారు. వీరంతా తాము ఇంటి వద్ద నుంచే ఓటు వేస్తామని కోరితే ఆ మేరకు ప్రత్యేక పోలింగ్‌ బృందాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించేందుకు అవసరమైతే ప్రత్యేక కౌటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సర్వీసు ఓటర్లకు మాత్రం ఆన్‌లైన్‌ ద్వారా బ్యాలెట్‌ పత్రం పంపబడుతుందన్నారు. వీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సి అవసరం లేదని చెప్పారు. వీరి బ్యాలెట్‌ పత్రాలపై అభ్యర్థుల పేర్లు, ఫొటోలు మాత్రమే ఉంటాయని, పార్టీ గుర్తులు ఉండవని వివరించారు. ప్రతి బ్యాలెట్‌ పత్రంపైనా ఆఖర్లో నోటా తప్పనిసరిగా ఉంటుందని చెప్పారు. బ్రెయిలీ లిపిలో నమూన బ్యాలెట్‌ పత్రాన్ని కూడా పోలింగ్‌ స్టేషన్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. టెండరు బ్యాలెట్‌ పేపరు ఈవీఎంలో ఉన్న బ్యాలెట్‌ పత్రంలాగే ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో జేసీ కార్తీక్‌, ట్రైనీ కలెక్టరు వెంకట్‌ త్రివినాగ్‌, డీఆర్‌వో అనిత తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:24 PM