Share News

ముగిసిన నామినేషన్ల పర్వం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:17 PM

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో పార్లమెంట్‌, శాసన సభ నియోజకవర్గాలకు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు వెల్లడించారు.

ముగిసిన నామినేషన్ల పర్వం

పార్వతీపురం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో పార్లమెంట్‌, శాసన సభ నియోజకవర్గాలకు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు వెల్లడించారు. కాగా జిల్లాలో నాలుగు శాసన సభ స్థానాలకు 61, అరకు పార్లమెంట్‌కు 32 నామినేషన్లు పడ్డాయి. టీడీపీ, వైసీపీ, సీపీఎం, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులుగా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పాలకొండలో చివరి రోజు ఆరు నామినేషన్లు పడ్డాయి. దీంతో గడువు ముగిసిన నాటికి మొత్తంగా నామినేషన్ల సంఖ్య 12గా నమోదైంది. కురుపాంలో ఐదు నామినేషన్లు దాఖలవగా.. మొత్తంగా ఇక్కడ 17 మంది నామినేషన్లు వేశారు. పార్వతీపురంలో ఏడుగురు నామినేషన్ల పత్రాలు ఇవ్వగా.. వాటి సంఖ్య 17కు చేరింది. సాలూరులో ఏడు నామినేషన్లు దాఖలవగా.. మొత్తం నామినేషన్ల సంఖ్య 15గా నమోదైంది. కాగా గురువారం పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా బోనెల విజయచంద్ర, సాలూరులో టీడీపీ అభ్యర్థిగా గుమి్ముడి సంధ్యారాణి నామినేషన్లు వేశారు. వారు కాకుండా కురుపాం నుంచి టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి, పాలకొండ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఇంతకముందే నామినేషన్‌ పత్రాలు అందించారు. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి చివరి రోజు స్వతంత్ర అభ్యర్థులు పదిమంది నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఇంతకముందే నామినేషన్‌ పత్రాలు అందించారు. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలతో పాటు పలువరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాగా ఈనెల 26న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్‌ పరిశీలన ఉంటుంది.. 29న మూడు గంటల్లోపు నామినేషన్లు ఉపసంహరణ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

Updated Date - Apr 25 , 2024 | 11:17 PM