Share News

సంక్రాంతి ఏదీ జగనన్నా?

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:27 PM

సంకాంత్రి అంటే పల్లెలే గుర్తుకొస్తాయి. పండగ మూడు రోజులూ గ్రామాల్లో ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది.

సంక్రాంతి ఏదీ జగనన్నా?
సాలూరులో నిర్మించిన టిడ్కో గృహాలు

- ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాలూ ఇబ్బందులు

- రైతులకు చెల్లించని ధాన్యం బిల్లులు

- పేదలకు అందించని టిడ్కో ఇళ్లు

- కాంట్రాక్టర్లకు నిలిచిన బిల్లుల చెల్లింపు

- కానుకలు ఇవ్వకపోవడంతో పిండి వంటలకు దూరమైన నిరుపేదలు

- అంగన్‌వాడీల జీతాల నిలిపివేత

పార్వతీపురం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): సంకాంత్రి అంటే పల్లెలే గుర్తుకొస్తాయి. పండగ మూడు రోజులూ గ్రామాల్లో ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా రైతులు తమ పంటలు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాలతో ఎంతో ఆనందంగా సంక్రాంతి జరుపుకుంటారు. కానీ, ఈ ఏడాది పల్లెల్లో సంక్రాంతి శోభ కానరావడం లేదు. ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో వారంతా పండగ చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు లేకపోవడంతో సాగునీటి కోసం జిల్లా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో రైతులు సాగునీటికి తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షాలపై ఆధారపడిన రైతులకు పూర్తిస్థాయిలో పంటలు చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ధాన్యం విక్ర యాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలతో సుదూర ప్రాంతాల్లోని రైస్‌ మిల్లులకు ధాన్యం తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ నెల 12 వరకు ధాన్యం విక్రయించిన రైతులకు బిల్లులు అందలేదు. ధాన్యం సొమ్ము బ్యాంకు ఖాతాల్లో పడకపోవడంతో సంక్రాంతి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక బస్తాకు 80 కేజీల ధాన్యం రైతుల నుంచి మిల్లర్లు తీసుకోవాలి. కానీ కొందరు మిల్లర్లు 84 కేజీలు తీసుకుంటుండడంతో రైతులు నష్టపోతున్నారు.

అందని టిడ్కో గృహాలు..

టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల కోసం టిడ్కో గృహాలను నిర్మించారు. అయితే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను పేదలకు అందించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. జిల్లా కేంద్రం పార్వతీపురంలో నిర్మించిన టిడ్కో గృహాల కోసం అప్పులు చేసి కొంతమంది రూ.25 వేలు, మరికొంతమంది రూ.50 వేల చొప్పున చెల్లించారు. కానీ ప్రభుత్వం వారికి ఇళ్లు పంపిణీ చేయడం లేదు. కట్టిన డబ్బులు కూడా తిరిగి చెల్లించడం లేదు. సాలూరు పట్టణంలో ఇళ్లు కొంతవరకు పూర్తయినా అవి ఎప్పుడు అందిస్తారో తెలియని పరిస్థితి.

బిల్లుల కోసం ఎదురుచూపు..

గ్రామాల్లో ప్రభుత్వ ప్రాధాన్య భవనాలను సొంత డబ్బులతో నిర్మించిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించడం లేదు. దీంతో వారు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఈ కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది వైసీపీ నాయకులే ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బిల్లుల చెల్లింపులు జరుగుతాయో లేదోనని మదనపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ మద్దతుదారులైన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా కక్ష సాధింపునకు పాల్పడుతోంది.

కానుకలు ఏవి..

ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని, గడపగడపకూ నాణ్యమైన సరుకు లు అందిస్తామని ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న పథ కాలను ఎత్తేశారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రతీ సం క్రాంతికి కానుకల పేరిట నిరుపేదలకు ఉచితంగా రేషన్‌ సరుకులను అందించేది. పిండి వంటలు చేసు కొని ఇంటిల్లాపాది ఆనందంగా పండగా జరుపు కోవాలని కందిపప్పు, శనగపప్పు, వంటనూనె, బెల్లం, గోధుమ పిండి, నెయ్యి ఉచితంగా ఇచ్చేది. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కానుకలకు మంగళం పాడింది. దీంతో నిత్యావసరాలు కొనలేక పండగ పూట పస్తులు ఉండాల్సి వస్తోందని నిరుపేదలు వాపోతున్నారు.

అంగన్‌వాడీల కష్టాలు

పండగ పూట అంగన్‌వాడీ ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. సుమారు 34 రోజులుగా సమ్మె చేస్తుండడంతో ప్రభుత్వం వారికి జీతాలు నిలిపేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పండగపూట కూడా రోడ్డెక్కి నిరసన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Jan 14 , 2024 | 11:27 PM