Share News

ఫిర్యాదుల పరిష్కారంలో పక్షపాతం వద్దు

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:19 AM

ఎన్నికల సమయంలో వచ్చే ఫిర్యా దులను ఎటువంటి పక్షపాతం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు.

 ఫిర్యాదుల పరిష్కారంలో పక్షపాతం వద్దు
ఓటరు అవగాహన ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

- అధికారులు సమన్వయంతో పని చేయాలి

- కలెక్టర్‌ నాగలక్ష్మి

నియోజకవర్గం స్దాయిలో కంట్రోల్‌ రూం ఏర్పాటు

కలెక్టరేట్‌, మార్చి 15: ఎన్నికల సమయంలో వచ్చే ఫిర్యా దులను ఎటువంటి పక్షపాతం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కంట్రోల్‌ రూమ్‌కు కేటాయించిన అధికారుల విధులపై పీపీటీ ద్వారా కలెక్టర్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పని చేయడానికి, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్‌ రూమ్‌కు అందిన ఫిర్యాదులకు సంబంధించి ఒక్కోదానికి ఎన్నికల కమిషన్‌ ఒక్కో కాలపరిమితిని సూచించిందన్నారు. వాటిని ఆ సమయంలో పరిష్కరించాలని తెలిపారు. ప్రధానంగా మోడల్‌ కోడ్‌ ఉల్లంఘన, ఏర్పాట్లపై లోపాలు, ఓటర్ల సమస్యలు తదితర అంశాలపై వచ్చే ఫిర్యాదులను నమోదు చేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో వాస్తవాలను యథాతథంగా రాయాలని, ఎక్కడా పక్షపాతం లేకుండా పని చేయాలని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఆర్‌వో ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్‌ నడపాలని, నివేదికలను పంపాలని అన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ ఇంచార్జిగా సీపీవో, రిపోర్ట్‌ ఇన్‌చార్జిగా జడ్పీ సీఈవో వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఓటర్‌ హెల్ప్‌ లైన్‌, ఆన్‌లైన్‌లో పోర్టల్స్‌, సాక్ష్యం యాప్‌ సి.విజిల్‌, 1950 కాల్‌ సెంటర్‌కు అందే ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

ప్రతి నియోజకవర్గం, మండల స్థాయిలో ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులతో ఆమె మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో స్వీప్‌ కార్యక్రమాల కోసం ఇన్‌చార్జిలను నియమించినట్లు చెప్పారు. తహసీల్దార్లు వెంటనే స్వీప్‌ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ప్రతి నియోజవర్గం పరిధిలో వెంటనే డెమో పోలింగ్‌ స్టేషన్‌ను, సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆర్టీసీ బస్సులు, ఎండీయూ వాహనాలు, చెత్త సేకరణ వాహనాలపై ఓటరు అవగాహన కోసం బ్యానర్లు కట్టాలని, డిజిటిల్‌ యాడ్స్‌ కూడా ఇవ్వాలని తెలిపారు. గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్‌ అయిన చోట ప్రత్యేక దృష్టి పెట్టి పోలింగ్‌ శాతం పెరిగేలా చూడాలన్నారు. ఈనెల 25న మహిళా ఓటర్లతో ర్యాలీ నిర్వహించాలని, కళాజాతాల ద్వారా ప్రదర్శనలు ఇవ్వాలని చెప్పారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి

వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రాంభించారు. కలెక్టరేట్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా కోట జంక్షన్‌ వరకూ ఈ ర్యాలీ సాగింది. కార్యక్రమంలో జేసీ కార్తీక్‌, ట్రైనీ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:19 AM