Share News

తమ్ముళ్లలో నూతనోత్తేజం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:32 AM

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన రా కదిలిరా సభ టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. ఎన్నికల సంగ్రామంలోకి ధీమాగా దూసుకువెళ్లవచ్చునన్న భరోసా కలిగించింది. నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లాలని భావిస్తున్నారు.

తమ్ముళ్లలో నూతనోత్తేజం

తమ్ముళ్లలో నూతనోత్తేజం

చంద్రన్న రాకతో పెరిగిన భరోసా

రా కదిలిరా సభ విజయవంతం

ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని శ్రేణుల సంకల్పం

నాయకుల్లోనూ పెరిగిన ఆత్మవిశ్వాసం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన రా కదిలిరా సభ టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. ఎన్నికల సంగ్రామంలోకి ధీమాగా దూసుకువెళ్లవచ్చునన్న భరోసా కలిగించింది. నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లాలని భావిస్తున్నారు. ప్రజల మనసు గెలుచుకునే దారిలో పయనిస్తామంటున్నారు. రా కదిలిరా సభకు బొబ్బిలి గర్జనగా పెట్టుకున్న పేరు సార్థకమైందని భావిస్తున్నారు. సభకు యువత, మహిళలు, వృద్ధులు కూడా అధికంగా హాజరయ్యారు. చివరివరకు కదలకుండా అధినేత ప్రసంగం విన్నారు. మార్పు రావాలన్న ఆకాంక్ష అందరిలోనూ కనిపించినట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

భోగాపురంలో గత నెలలో జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు సదస్సు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అప్పుడు హాజరైన జన కెరటం కొద్దిరోజులు అధికార పక్షానికి నిద్ర దూరం చేసింది. ఆ సభ ముగిసిన వారం వరకు హాట్‌ టాపిక్‌ అయింది. వచ్చే ఎన్నికల్లో విజయానికి నాంది పలికిందని టీడీపీ నేతలు భావించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆ తర్వాత టీడీపీ, జనసేన నేతలు మరింత స్పష్టతతో ఐక్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ జోరుకు తాజాగా జరిగిన బొబ్బిలి గర్జన సభ మరింత బలాన్ని ఇచ్చింది. బొబ్బిలిలో జరిగిన రా కదిలిరా సభకు కూడా జనం తండోపతండాలుగా హాజరయ్యారు. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం, రాజాం నియోజకవర్గాల నుంచి అధికంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, జనసేన కార్యకర్తలు వచ్చారు.

బొబ్బిలి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ శ్రేణులు బలంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికలను దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్న పరిస్థితి కన్పిస్తోంది. ఇటీవల కాలంలో వైసీపీ నుంచి వలసలు పెరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా టీడీపీలోకి క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు సభ టీడీపీ శ్రేణులకు బలమైన జవసత్వాలు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను చంద్రబాబు ఎండగట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులు, యువత, మహిళా సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం వంటి హామీలిచ్చారు. పరిశ్రమలు, ఐటీ రంగం అభివృద్ధి ద్వారా స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు.

ఏదైనాగాని ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టీడీపీలో జోష్‌ పెరుగుతోంది. అదే సమయంలో వైసీపీ నుంచి చేరికలు ఊపందుకుంటున్నాయి. బొబ్బిలిలో జరిగిన రా కదిలిరా సభలో చంద్రబాబు సమక్షంలోనే సర్పంచి, ఎంపీటీసీ, 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నివురుగప్పిన నిప్పులా వైసీపీపై ఉన్న అసమ్మతి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బహిర్గతం కానుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదన్న పరిస్థితి కన్పిస్తోంది.

ఉక్కిరిబిక్కిరవుతున్న బొబ్బిలి వైసీపీ

రామభద్రపురం, జనవరి 11: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బొబ్బిలి నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరందుకోవడంతో అధికార వైసీపీ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటీవల కాలంలో రామభద్రపురంతోపాటు తెర్లాం, బాడంగి మండలాలకు చెందిన వైసీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆ పార్టీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రామభద్రపురం మండలంలో 22 గ్రామ పంచాయతీలకు గానూ 12 గ్రామపంచాయతీలు తెలుగుదేశంవైపే ఉండగా ఇటీవల కాలంలో వైసీపీకి చెందిన ముగ్గురు సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, అధికార పార్టీ నాయకులు తెలుగుదేశంలో చేరిపోయారు. తాజాగా కోటశిర్లాం వైసీపీ సర్పంచ్‌ తాడ్డి లక్ష్మితోపాటు 500 కుటుంబాలు బుధవారం బొబ్బిలిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా టీడీపీలో చేరకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్ళు, ఇబ్బందులు పెట్టినప్పటికీ సర్పంచ్‌లు, నాయకులు బేబీనాయన, తెంటు లక్ష్ముంనాయుడు సమక్షంలో చేరిపోతున్నారు. సంక్రాంతి తరువాత బొబ్బిలి నియోజకవర్గంలో మరింత మంది తెలుగుదేశంలో చేరాలని భావిస్తున్నారు.

--------------------------

Updated Date - Jan 12 , 2024 | 12:32 AM