టీడీపీకి కొత్త బలం
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:42 PM
చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీకి కొత్త జవసత్వాలు సమకూరుతున్నాయి. గతంలో పార్టీకి కంచుకోటగా నిలిచిన చీపురుపల్లిలో మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
టీడీపీకి కొత్త బలం
మాజీ ఎమ్మెల్యే తనయుడు సుగుణాకరరావు తెలుగుదేశంలో చేరిక
గద్దే బాబూరావు కూడా
ఆహ్వానం పలికిన పార్టీ అధినేత చంద్రబాబు
చీపురుపల్లి నియోజకవర్గ శ్రేణుల్లో జోష్
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/చీపురుపల్లి
చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీకి కొత్త జవసత్వాలు సమకూరుతున్నాయి. గతంలో పార్టీకి కంచుకోటగా నిలిచిన చీపురుపల్లిలో మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో అనేక మంది టీడీపీలోకి వస్తున్నారు. ఇదంతా ఎకెత్తు అయితే తాజా పరిణామాలు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని తీసుకొస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే దివంగత కోట్ల సన్యాసప్పలనాయుడు కుమారుడు కోట్ల సుగుణాకరరావు టీడీపీలో చేరారు. ఈయన వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు కూడా టీడీపీలోకి రావడంతో కొత్త బలం.. మరింత బలగం రావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు జోరుగా మారుతున్నాయి. వైసీపీ నుంచి ఇప్పటికే వలసలు పెరిగాయి. తాజాగా చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత కోట్ల సన్యాసప్పలనాయుడు కుమారుడు కోట్ల సుగుణాకరరావు టీడీపీలో చేరారు. అధినేత చంద్రబాబు సమక్షంలో అమరావతిలో గురువారం పార్టీ కండువా వేసుకున్నారు. ఈయన వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సుగుణాకరరావు రాక పార్టీకి బాగా కలిసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా రోజులు ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొంత మంది కుటుంబ సభ్యులు, తనను అభిమానించే వారితో విడతల వారీగా చర్చించారని తెలిసింది. ఈయనకు నలుగురు సోదరులున్నారు. వీరంతా ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. 1962 ప్రాంతంలో చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన సన్యాసప్పలనాయుడు అప్పట్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. ఈయనకు ఐదుగురు కుమారులు. నలుగురు జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా పనిచేశారు. సుగుణాకరరావు ఉద్యోగంలో కొనసాగారు. విరమణ చేశాక రాజకీయాల్లోకి వస్తున్నారు.
టీడీపీలోకి గద్దే బాబూరావు
చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు టీడీపీలో గురువారం చేరారు. అమరావతిలో చంద్రబాబు పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున సమక్షంలో పార్టీలోకి పునఃప్రవేశం చేశారు. ఒకప్పుడు యూత్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించిన గద్దే 1982లో ఆ పార్టీని విడిచిపెట్టి మొట్టమొదటి సారిగా ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ సభ్వత్యం తీసుకున్నారు. 1995లో పార్టీ అంతర్గత సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వైపు వెళ్లి ఎన్టీఆర్ టీడీపీలో చేరారు. ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. 1994, 1999లో తెలుగుదేశం పార్టీ తరపున చీపురుపల్లి అసెంబ్లీ స్థానానికి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2004లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత వైసీపీలోను, బీజేపీలోను కొద్దిరోజుల పాటు కొనసాగారు. 2023 డిసెంబరులో బీజేపీని విడిచి పెట్టారు. తాజాగా చంద్రబాబునాయుడు సమక్షంలో గురువారం తన మనుమడు అనురాగ్‌తో సహా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు.