కొత్త వివాదాలు
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:25 AM
జిల్ల్లాలోని నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఇసుకను ఉత్పన్నం చేసే గెడ్డలు, వాగుల వద్ద కొత్త వివాదాలు నేతలకు తలనొప్పిగా తయారయ్యాయి. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన వారికి ఇసుక రూపంలో సవాళ్లు ఎదురవుతున్నాయి.
కొత్త వివాదాలు
నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలపై గొడవలు
సొంత అవసరాలకంటూ నాటుబళ్లతో యథేచ్ఛగా రవాణా
ప్రశ్నిస్తే ఉచిత విధానం అమలు పేరుతో బుకాయింపు
తలలు పట్టుకుంటున్న ప్రజాప్రతినిధులు
శృంగవరపుకోట, జూలై 14:
జిల్ల్లాలోని నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఇసుకను ఉత్పన్నం చేసే గెడ్డలు, వాగుల వద్ద కొత్త వివాదాలు నేతలకు తలనొప్పిగా తయారయ్యాయి. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన వారికి ఇసుక రూపంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. సొంత అవసరాలకు తవ్వుకుంటున్నామని బయటకు చెబుతున్న నాటుబళ్ల యజమానులు ఇసుకను అమ్ముకుంటున్నారని ప్రజాప్రతి నిధులకు తెలుసు. ఈ వివాదంలో తలదూర్చి అడ్డుకుంటే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. లేకుంటే దందా సాగిస్తారు. దీంతో ఏమీ చేయలేక ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు.
విభిజిత జిల్లాలో ప్రధానంగా గోస్తనీ, చంపావతి నదులు వున్నాయి. గోస్తనీ నది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి జిల్లాలోని శృంగవరపుకోట, జామి మండలాల పరిధిలో ప్రవహిస్తూ విశాఖ సమీపంలో సముద్రంలో కలుస్తుంది. గజపతినగరం, గుర్ల, నెల్లిమర్ల తదితర మండలాల పరిధిలో చంపావతి నది ప్రవాహిస్తోంది. ఈరెండు నదుల సమీప గ్రామాల ప్రజలంతా వీటిల్లో ఇసుకను తవ్వుకొని వ్యాపారం చేస్తున్నారు. ఈ నదులతో పాటు గెడ్డలు, వాగులు వున్న ప్రాంతాల్లోనూ ఇసుక వ్యాపారం సాగుతోంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన ఇసుక విధానం తీసుకొచ్చింది. నదీపరివాహక ప్రాంతాలతో పాటు గెడ్డలు, వాగుల్లోనూ ఇసుకను తవ్వకుండా కట్టడి చేసింది. ఇసుక డిపోలను ఏర్పాటు చేసి టన్నుల లెక్కన ధర నిర్ణయించింది. తద్వారా జిల్లాలో వున్న నదీ పరివాహక ప్రాంతాలు, గెడ్డలు, వాగుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకుండా నిషేధించింది. ట్రాక్టర్లను దిగకుండా అడ్డుకుంది. అంతవరకు బాగున్నప్పటికీ నదులు, గెడ్డలు, వాగుల్లోని ఇసుకపై కన్నేసిన వైసీపీ నేతలు సొంత అవసరాల పేరుతో నాటుబళ్లను రంగంలోకి దించారు. గతంలో ఇసుక డంపింగ్ యార్డుల వద్ద ఇసుకను జగనన్న కాలనీలకు తప్ప మిగిలిన నిర్మాణాలకు విక్రయించలేదు. దీంతో ఇసుకను శ్రీకాకుళం, రాజమండ్రి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొనేందుకు పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయి. చేసేదిలేక నాటుబళ్లతో ఇసుక రవాణా చేసేవారిని ఆశ్రయించారు. ఇదే అదనుగా నాటుబళ్ల యజమానులు సిండికేట్‌గా మారి బండి ఇసుకను రూ.1000 నుంచి రూ.1500 వరకు దూరం బట్టి అమ్ముతూ వచ్చారు. వీరంతా ఆయా గ్రామాల్లో వైసీపీకు సానుభూతిపరులు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఈ పార్టీ గ్రామ స్థాయి నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. వీరితోనూ ఇసుక వ్యాపారం కొనసాగించేందుకు చూస్తున్నారు.
- కూటమి ప్రభుత్వం ఉచిత విధానం ద్వారా ఇసుకను అందుబాటులోకి తెచ్చినప్పటికీ స్టాక్ పాయింట్‌లు దూరంగా ఉండడంతో నాటుబళ్లు తీసుకొస్తున్న ఇసుక కంటే రవాణా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఇళ్ల నిర్మాణదారులు నాటుబళ్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఇసుక తవ్వకాలను అడ్డుకుంటే ప్రస్తుతం నిర్మాణంలో వున్న ఇళ్లపై ఈ ప్రభావం పడుతుంది. ప్రభుత్వానికి చెడ్డపేరొచ్చేఅవకాశం వుంది. దీన్ని అసరాగా తీసుకుంటున్న నాటుబళ్ల యజమానులు సొంత అవసరాల పేరుతో ఇసుక వ్యాపారం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడబడితే అక్కడ తవ్వేస్తున్నారు. ఇసుక రవాణాతో జేబులు నింపుకుంటున్నారు.
- నిబంధనల ప్రకారం గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారు మాత్రమే ఇసుకను తవ్వుకొనేందుకు వేసులబాటు కల్పించారు. తవ్విన ఇసుకను గుట్టలుగా నిల్వచేయరాదు. రోడ్లు, వంతెనలు, రైల్వే లైన్లు, తాగునీటి ఊటబావులకు 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వాలి. కానీ ఈ నిబంధనను ఎవరూ పాటించడం లేదు. ఎవరైనా అడిగితే ఉచిత ఇసుక విధానం అంటూ బుకాయిస్తున్నారు.
--------