Share News

నెట్టినా.. కదల్లే!

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:00 AM

ఇది సాలూరులో శివాజీబొమ్మ జంక్షన్‌.. బుధవారం మధ్యాహ్నం ఇదిగో ఓ ఆర్టీసీ బస్సు ఇలా నిలిచింది. పార్వతీపురం, బొబ్బిలి మీదుగా సాలూరు వస్తున్న బస్సు సరిగ్గా ఈ జంక్షన్‌లో ఎత్తురోడ్డును ఎక్కుతున్న సమయంలో ఆగిపోయింది.

నెట్టినా.. కదల్లే!
ఆర్టీసీ బస్సు స్టార్ట్‌ కావటానికి వెనక్కి నెట్టుతున్న ప్రయాణికులు, ప్రజలు

అరగంటకు పైగా స్తంభించిన ట్రాఫిక్‌ జాం

వాహనదారులు, ప్రజలకు తప్పని ఇబ్బందులు

ఇది సాలూరులో శివాజీబొమ్మ జంక్షన్‌.. బుధవారం మధ్యాహ్నం ఇదిగో ఓ ఆర్టీసీ బస్సు ఇలా నిలిచింది. పార్వతీపురం, బొబ్బిలి మీదుగా సాలూరు వస్తున్న బస్సు సరిగ్గా ఈ జంక్షన్‌లో ఎత్తురోడ్డును ఎక్కుతున్న సమయంలో ఆగిపోయింది. కొంతమంది స్థానికులు దానిని వెనక్కి నెట్టినా.. స్టార్ట్‌ అవ్వలేదు. దాదాపు అరగంటకు పైగా బస్సు అక్కడే ఉండిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వెనుక నుంచి వచ్చే వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో బస్సు మొరాయించడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. వెనక్కి వెళ్లలేక.. ముందుకు సాగలేక నానా అవస్థలు పడ్డారు. ఇంతలో బస్సు డ్రైవర్‌ మురళీకృష్ణ, క్లీనర్‌ సన్యాసమ్మలు ఆర్టీసీ డీపోకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. హుటాహుటిన మెకానిక్‌ వచ్చి మరమ్మతులు చేయడంతో బండి కదిలింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత యథావిధిగా వాహన రాకపోకలు సాగాయి. కాగా పార్వతీపురం డిపోకు చెందిన ఆ బస్సు బయల్దేరిన మొదలు ఎక్కడ పడితే అక్కడే ఆగిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ వచ్చామని.. తీరా సాలూరు చేరిన తర్వాత వాహనం పూర్తిగా కదలలేదని ప్రయాణికులు వాపోయారు. ఈ విషయంపై సాలూరు ఆర్టీసీ డిపో మేనేజర్‌ భాస్కర్‌రెడ్డిని వివరణ కోరగా.. సెల్ఫ్‌ ఆగిపోవడంతో బస్సు నిలిచిపోయిన మాట వాస్తవమేనని అన్నారు. వివిధ కారణాలతో ప్రస్తుతం 13 అద్దె బస్సులు నిలిచిపోయాయని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో పార్వతీపురం డిపో నుంచి రెండు, పాలకొండ డిపో నుంచి రెండు చొప్పున బస్సులు అడిగి సాలూరు ఆర్టీసీ డిపోకు తీసుకొచ్చామన్నారు. అద్దె బస్సులకు సంబంధించిన వారితో మాట్లాడామని.. గురువారం నుంచి ఆయా బస్సులు యథావిధిగా తిరుగుతాయని తెలిపారు.

- సాలూరు

Updated Date - Feb 29 , 2024 | 12:00 AM