Share News

నా ఎస్టీ అన్నారు.. గాలికొదిలేశారు

ABN , Publish Date - May 03 , 2024 | 11:29 PM

‘గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారి అభ్యున్నతికి పెట్టపీట వేస్తాం.. విద్య, వైద్యకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.. మెరుగైన వసతులు కల్పిస్తాం’ అని గత ఎన్నికల సమయంలో జగన్‌ హామీలిచ్చారు. మాట్లాడిన ప్రతిచోటా నా ఎస్సీ.. ఎస్టీలు అంటూ ఓట్లు దండుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చాక అసలు రూపం చూపించారు. గిరిజనులకు మొండిచేయి చూపారు.

నా ఎస్టీ అన్నారు.. గాలికొదిలేశారు
గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరిలో గిరిజన గర్భిణుల వసతిగృహం

నిర్వహణ కోసం నిధులు కేటాయించని వైనం

సిబ్బందికి సక్రమంగా జీతాలూ చెల్లించని ప్రభుత్వం

అరకొరగానే పౌష్టికాహారం పంపిణీ

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభం

నాడు కేంద్ర బృందంతో ప్రశంసలు

వైసీపీ పాలనలో దయనీయ స్థితి

సర్కారు తీరుపై గిరిజన సంఘాల ఆగ్రహం

(గుమ్మలక్ష్మీపురం/సాలూరు/సీతంపేట)

‘గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారి అభ్యున్నతికి పెట్టపీట వేస్తాం.. విద్య, వైద్యకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.. మెరుగైన వసతులు కల్పిస్తాం’ అని గత ఎన్నికల సమయంలో జగన్‌ హామీలిచ్చారు. మాట్లాడిన ప్రతిచోటా నా ఎస్సీ.. ఎస్టీలు అంటూ ఓట్లు దండుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చాక అసలు రూపం చూపించారు. గిరిజనులకు మొండిచేయి చూపారు. ప్రధానంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఏర్పాటు చేసిన గిరిజన గర్భిణుల వసతిగృహాలను గాలికొదిలేశారు. ఐదేళ్ల పాలనలో వాటి నిర్వహణకు సక్రమంగా నిధులను కేటాయించకపోగా.. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కూడా సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. దీంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది. మొత్తంగా గిరిజన గర్భిణుల వసతిగృహాలను వైసీపీ సర్కారు పట్టించుకోకపోవడంపై జిల్లావాసులు, గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అండగా నిలవాల్సిన సర్కారు.. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగునా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని వందలాది గిరిజన గ్రామాలకు సరైన రహదారి సదుపాయం లేదు. కొండ శిఖర గ్రామాల్లో పరిస్థితి అయితే సరేసరి. దీంతో అత్యవసర వేళల్లో ఆయా ప్రాంతవాసులకు డోలీలే దిక్కవుతున్నాయి. కాగా ఒక్కోసారి గిరిజన గర్భిణులు మార్గమధ్యంలో ప్రసవం కావడం, మాతా, శిశు మరణాలు సంభవించడం వంటివి జరిగేవి. అయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని, గిరిజన గర్భిణులు ప్రసవ కష్టాలు పడరాదని గత టీడీపీ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఐటీడీఏల ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని గుమ్మ లక్ష్మీపురం మండలంలోని భద్రగిరి, సాలూరులో ఉన్న వైటీసీల్లో గిరిజన గర్భిణుల కోసం వసతిగృహాలను ప్రారంభించారు. అప్పట్లో వాటికి ప్రత్యేక అంబులెన్సులను కూడా ఏర్పాటు చేశారు. డెలివరీకి ముందువసతి గృహాల్లో చేరుకునే గర్భిణులకు సకాలంలో పౌష్టికాహారం అందించేవారు. ఫుడ్‌ బకేట్‌ పేరుతో పాలు, గుడ్లు, పండ్లు, మిఠాయి, ఖర్జూరం, శనగ చిక్కీలు, రాగిజావ ఇచ్చేవారు. రోజూ రక్తహీనత, బీపీ, షుగర్‌ పరీక్షలు చేసి కంటికి రెప్పలా చూసుకునేవారు. ఇందుకోసం మరోవైపు వైద్య సాయం కోసం ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ముగ్గురు వైద్య సహాయకులు, అంబులెన్స్‌ డ్రైవర్‌, హౌస్‌ కీపింగ్‌కు ఇద్దరు, ముగ్గురు అటెండర్లను నియమించారు. వారికి ఐటీడీల నుంచి జీతాలు చెల్లించేవారు. ప్రసవ సమయం దగ్గరపడిన వారికి సమీపంలో పీహెచ్‌సీ, సీహెచ్‌సీకి తరలించేవారు. ప్రసవం జరిగిన తరువాత తల్లీ బిడ్డను క్షేమంగా ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టేవారు. అప్పట్లో వాటి నిర్వహణ, సిబ్బంది జీతాలు, ఇతరత్రా ఖర్చుల కోసం ఏడాదికి సుమారు రూ.3కోట్లు వరకు కేటాయించేవారు. మొత్తంగా జిల్లాలో మాతాశిశు మరణాల సంఖ్యను బాగా తగ్గించారు.

వైసీపీ పాలనలో..

వైసీపీ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత సీన్‌ మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మాతా శిశు మరణాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఐటీడీఏల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన గర్భిణుల వసతి గృహాల పరిస్థితి దయనీయంగా మారింది. వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో లక్ష్యం నీరుగారింది. వాటి నిర్వహణను పట్టించుకునే వారే కరువయ్యారు. పూర్తిస్థాయిలో గర్భిణులకు సేవలు అందడం లేదు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు కూడా చెల్లించడం లేదు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్న ఏజెన్సీలకు నెలలు తరబడి బిల్లులు చెల్లించడం లేదు. ఒకప్పుడు గవర్నర్‌, కేంద్ర బృందంతో ప్రశంసలు అందుకున్న వసతిగృహాలు ఇలా మారడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భద్రగిరిలో ఇలా..

గుమ్మలక్ష్మీపురం మండలంలోని భద్రగిరిలో ఉన్న వసతిగృహంలో ప్రస్తుతం 26 మంది గిరిజన గర్భిణులే ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి 12 నెలలుగా జీతాలు అందడం లేదు. అంబులెన్స్‌ మరమ్మతు గురైన వెంటనే బాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిధుల కొరత కారణంగా వసతిగృహం నిర్వహణ గాడి తప్పింది. మరుగుదొడ్లు కూడా అధ్వానంగా మారాయి. వాటిపై అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. దీంతో ఇక్కడకు వచ్చేందుకు గిరిజన గర్భిణులు ఆసక్తి చూపడం లేదు. గతంలో 40 నుంచి 50 మంది వరకు ఇక్కడ గర్భిణలు ఉండగా.. ఇప్పుడా పరిస్థితి లేదు. దీనిపై ఐటీడీఏ ఏపీవోను వివరణ కోరగా వసతిగృహంలో పనిచేస్తున్న సిబ్బందికి 12 నెలల జీతాలు చెల్లించాల్సి ఉందన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు పెట్టామని, మంజూరవ్వగానే వారికి చెల్లిస్తామని వెల్లడించారు.

సాలూరులో ఇలా..

సాలూరులోని వసతి గృహంలో 15 మంది లోపే గిరిశిఖర గ్రామాలకు చెందిన గిరిజన గర్భిణులు ఉన్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించడం లేదు. సర్కారు నిధులు కేటాయించకపోవడంతో ఇక్కడ మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. అరకొరగానే గర్భిణులకు పౌష్టికాహారం అందుతుందనే విమర్శలున్నాయి. మరోవైపు ఇక్కడున్న గిరిజన గర్భిణులకు వేడి నీరు అందడం లేదు. దీంతో వారు ఆరుబయటే నీరు కాచుకుని తాగాల్సిన దుస్థితి ఏర్పడింది. 2018-2019లోనే ఈ వసతి గృహం నుంచి అత్యధికులు ప్రసవమయ్యారు. అయితే వైసీపీ వచ్చిన తర్వాత వాటి నిర్వహణ గాడి తప్పడంతో ఇక్కడకు వచ్చే గిరిజన గర్భిణుల సంఖ్య బాగా తగ్గింది.

ఎన్నికల ముందు హడావుడి..

హైరిస్క్‌ గిరిజన గర్భిణుల కోసం గత టీడీపీ హయాంలో సీతంపేట ఏరియా ఆసుపత్రికి సమీపంలో బెర్త్‌హోమ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. నలుగురు ఉండేవిధంగా అన్ని వసతులు సమకూర్చారు. అప్పట్లో ఇవి గిరిజన గర్భిణులకు ఎంతో ఉపయోగపడేవి. వారికి సమయానికి పౌష్టికాహారం, వైద్యపరీక్షలు అందేవి. ప్రసవానికి ఇబ్బందులు ఉండేవి కాదు. డోలీ కష్టాలు తప్పేవి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెర్త్‌హోమ్‌ కేంద్రానికి నిధులు కేటాయించడం మానేసింది. దీంతో ఐదేళ్లుగా అవి పూర్తిగా మూతపడ్డాయి. గర్భిణులకు సేవలు దూరమయాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బెర్త్‌హోమ్‌ కేంద్రం అందు బాటులోకి తేవాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హడావుడి చేశారు. దీంతో ఆ కేంద్రానికి మరమ్మతులు చేపడతామని లాంఛనంగా కొబ్బరికాయ చేతులు దులుపుకున్నారు. ఇప్పటివరకు ఎటువంటి పనులు చేయలేదు. కేంద్రం కూడా ప్రారంభించలేదు. దీనిపై గిరిజనులు, సంఘ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వసతిగృహాలను మెరుగుపర్చాలి

గిరిజన గర్భిణులకు ఎంతో ఉపయోగకరమైన వసతి గృహాలపై వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తక్షణవే వాటిని పూర్తిస్థాయిలో మెరుగుపర్చాలి. నిర్వహణ లోపాలు లేకుండా చూడాలి. సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

- కడ్రక మల్లేష్‌, గిరిజన సంఘం నాయకుడు, గుమ్మలక్ష్మీపురం

Updated Date - May 03 , 2024 | 11:29 PM