Share News

పురపాలన అస్తవ్యస్తం

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:33 PM

సాలూరు మున్సిపాల్టీలో పాలన గాడి తప్పింది.. అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి అటకెక్కింది. మున్సిపల్‌ సర్వసభ్య సమావేశాలు సైతం మొక్కుబడిగా సాగుతున్నాయి. కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు స్వపక్షంలో విపక్షంగా మారగా.. అధికారులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

పురపాలన అస్తవ్యస్తం
సాలూరు మున్సిపల్‌ కార్యాలయం

మొక్కుబడిగా సర్వసభ్య సమావేశాలు

మంజూరైన నిధులు వెనక్కి..

పనులు పూర్తిచేయలేక పోయిన గత వైసీపీ ప్రభుత్వం

అభివృద్ధికి నోచని సాలూరు మున్సిపాల్టీ

సమస్యలతో ప్రజలు సతమతం

నూతన ప్రభుత్వంపైనే ఆశలు

సాలూరు,సెప్టెంబరు 10: సాలూరు మున్సిపాల్టీలో పాలన గాడి తప్పింది.. అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి అటకెక్కింది. మున్సిపల్‌ సర్వసభ్య సమావేశాలు సైతం మొక్కుబడిగా సాగుతున్నాయి. కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు స్వపక్షంలో విపక్షంగా మారగా.. అధికారులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాల్టీ ఏమైతే తమకేంటి? అనే ధోరణిలో ఉన్నారు. ఏదోలా ఉద్యోగం చేసేసి మమ అనిపిస్తున్నారు. మున్సిపాల్టీ ఆదాయంపై దృష్టి సారించడం లేదు. మరికొంత మంది అధికారులైతే ‘ఏదో వచ్చాం.. వెళ్తున్నాం’ అన్నట్లుగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. మున్సిపాల్టీలో ప్రధానంగా రెవెన్యూ, పట్టణ ప్రణాళికా విభాగం, ఇంజనీరింగ్‌, పారిశుధ్యం తదితర విభాగాలపై పర్యవేక్షణ కొరవడింది. నిధులున్నా పట్టణంలో ఎలాంటి పనులు జరగడం లేదు. దీంతో గత మూడేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని వారు అధికా రులు, పాలకవర్గాన్ని కోరుతున్నా.. ఎటువంటి ఫలితం ఉండడం లేదు. మొత్తంగా పురపాలన అస్తవ్యస్తంగా మారింది.

నిధులున్నా.. పూర్తవ్వని పనులు

సాలూరు మున్సిపాల్టీలో 29 వార్డులున్నాయి. అధికారికంగా సుమారు 50వేల వరకు జనాభా ఉన్నారు. అయితే వారంతా పారిశుధ్యం, తాగునీటి సమస్యలతో సతమతమవుతున్నారు. కాగా మున్సిపాల్టీలో నిధులు లేక పనులు జరగకపోవడం సర్వసాధారణం. కానీ పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు పూర్తవకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరకొర జరిగిన నిర్మాణాలకు కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. అంతేకాదు మున్సిపాల్టీలో పలు పనులకు ఐదు నుంచి పదిసార్లు టెండర్లు పిలిచినా వారు ముందుకు రావడం లేదు. ఇదిలా ఉండగా పురపాలక ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన డంపర్‌ బీన్లు పూర్తిగా పాడయ్యాయి. వాటి కోనుగోలుకు నిధులు కేటాయించి రెండేళ్లయినా నేటికీ కొత్తవి రాలేదు. మొత్తంగా గత వైసీపీ ప్రభుత్వ వైఖరి, అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా పట్టణం కనీస అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం మున్సిపాల్టీ వాసులు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.

రూ.4.31 కోట్లు వెనక్కి...

మున్సిపాల్టీకి 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చినా.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సక్రమంగా పనులు చేపట్టలేదు. దీంతో మంజూరైన నిధుల్లో రూ.6.50 కోట్లు మిగిలిపోయాయి. దానిలోరూ.2.20 కోట్లను వీధి దీపాల విద్యుత్‌ చార్జీల బకాయిలకు మళ్లించారు. గడువు పూర్తవడంతో మిగిలిన రూ.4.31 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో పట్టణంలో ప్రతిపాదించిన సుమారు 119 పనులు జరగలేదు.

15వ ఆర్థిక సంఘం నిధులు ఇలా..

మున్సిపాల్టీకి ఇప్పటివరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.9.58 కోట్లు వరకు మంజూరయ్యాయి. మొత్తంగా 94 పనులు ప్రతిపాదించారు. రూ.2.12 కోట్లతో 33 పనులు పూర్తి చేశారు. ఈ ఏడాది రెండో విడతగా రూ.160.98 లక్షలు మంజూరవగా.. గతంలో చేపట్టిన పనులకు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా రూ.29.22 లక్షలు చెల్లించారు. మిగిలిన నిధులతో వివిధ పనులకు ప్రతిపాదలు చేయాల్సి ఉంది. అయితే ఈ దశలో మున్సిపల్‌ కమిషనర్‌, మేనేజర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌తో పాటు కొంతమంది సిబ్బంది బదిలీపై వెళ్లిపోయారు. మరికొంతమంది రిలీవ్‌ ఆర్డర్‌ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు ఎప్పటికి పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

షాపుల పరిస్థితి ఇదీ..

ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ స్మాల్‌ అండ్‌ మీడియం టౌన్స్‌లో భాగంగా 2006, 2016లో మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోనే 30 షాపులు నిర్మించారు. ఈ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 19 దుకాణాలను అద్దెకు ఇచ్చారు. అయితే 2019 తర్వాత సీన్‌ మారింది. షాపుల నిర్వాహకులపై అద్దెలతో పాటు జీఎస్టీ, ఇతరత్రా అదనపు భారం వేశారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వచ్చినా కొంతమంది అధికారులు వెనక్కి తగ్గలేదు. అంతేకాదు జీఎస్టీ పేరిట వసూలు చేసిన మొత్తం ప్రభుత్వానికి చెల్లించలేదు. దీంతో షాపుల్లో అద్దెకుంటున్న చిరు వర్తకులు మళ్లీ జీఎస్టీని చెల్లించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా 2022 నుంచి షాపులకు సంబంధించి నిర్వాహకులతో ఎలాంటి అద్దెలు కట్టించుకోవడం లేదు. రెన్యూవల్‌ కూడా చేయకపోవడంపై వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అద్దె చెల్లించకపోయినా..

ఇదే షాషింగ్‌ కాంప్లెక్స్‌లో 20వ దుకాణం నుంచి ఎలాంటి అద్దె వసూలు చేయడం లేదు. వాస్తవంగా 2017లో ఓ ప్రైవేట్‌ వ్యక్తి ఆ షాపును అద్దెకు తీసుకుని రీ మోడల్‌ చేసుకున్నాడు. అయితే అప్పటి నుంచి ఆయన మున్సిపాల్టీకి ఒక్క పైసా కూడా అద్దె చెల్లించడం లేదు. అయినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అను మానాలు వ్యక్తమవుతున్నాయి. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మరో పది షాపులు నిరుపయోగంగా మారడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.

వారి నిర్లక్ష్యమే కారణం..

సాలూరు మున్సిపాల్టీలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల గత మూడేళ్లలో ఎలాంటి పనులు జరగలేదు. వారి బాధ్యతా రాహిత్యం కారణంగా 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో పట్టణం అభివృద్ధికి నోచుకోలేదు.

- గిరి రఘు, వైసీపీ కౌన్సిలర్‌, సాలూరు

======================================

పట్టించుకోలేదు..

సాలూరు మున్సిపాల్టీని గత మూడేళ్లలో అధికారులు, నాయకులు పట్టించుకోలేదు. వైసీపీ పాలనలో కొబ్బరికాయలు కొట్టడం తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసిన తాగునీటి పైలాన్‌ దిష్టిబొమ్మలా మారింది.

-వి.హర్షకుమార్‌, టీడీపీ కౌన్సిలర్‌, సాలూరు

======================================

పనుల పూర్తికి చర్యలు

మున్సిపాల్టీలో పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కొత్తగా మంజూరైన అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు పిలుస్తాం.

సూరినాయుడు, ఏఈ, సాలూరు

Updated Date - Sep 10 , 2024 | 11:33 PM