మట్టి మాఫియా
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:22 PM
ఈ ఏడాది వర్షాలు ఆశించినంత లేకపోవడంతో చెరువుల్లో నీరు చేరలేదు. ఇదే అదునుగా స్థానిక అధికార పార్టీ నాయకులు, ట్రాక్టర్ల యజమానులు కుమ్మక్కై చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు.

- చెరువుల్లో అడ్డగోలు తవ్వకాలు
- వందలాది ట్రాక్టర్లతో తరలింపు
- అధికార పార్టీ నాయకులు, ట్రాక్టర్ల యజమానుల కుమ్మక్కు
- గొయ్యిలతో ధ్వంసమవుతున్న సాగునీటి వనరులు
- పట్టించుకోని అధికారులు
ఈ ఏడాది వర్షాలు ఆశించినంత లేకపోవడంతో చెరువుల్లో నీరు చేరలేదు. ఇదే అదునుగా స్థానిక అధికార పార్టీ నాయకులు, ట్రాక్టర్ల యజమానులు కుమ్మక్కై చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రిపగలూ తేడా లేకుండా యంత్రాలతో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపట్టి వంద లాది ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ట్రాక్టర్ లోడు రూ.వెయ్యికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి తవ్వకాలతో చెరువులు ధ్వంసమవుతున్నాయి. దీనివల్ల సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అటువైపుగా చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజాం, జనవరి 12: రాజాం నియోజకవర్గంలో మట్టి మాఫియా పెట్రేగిపోతోంది. సంతకవిటి, రాజాం, రేగిడి ఆమదాలవలస, వంగర మండలాల్లో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపట్టి దోచుకుంటుంది. ముఖ్యంగా రాజాం మండలంలోని ఆగూరు రాజయ్యపేట, కొత్తవలస, కొత్తకంచరాం, పెనుబాక, ఎంజేవలస, బొమ్మనాయుడువలస, గారాజు చీపురుపల్లి, వస్త్రపురికాలనీ, తదితర గ్రామాల్లోని చెరువుల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రామాల్లో చోటా నాయకులు, ట్రాక్టర్ యజమానులు సిండికేటుగా మారి మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో చెరువులు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ఇప్పటికే చెరువుల మదుములు, చప్టాలు దెబ్బతిన్నాయి. రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు మట్టి లోడ్లతో రాకపోకలు సాగిస్తుండడంతో గట్లు సైతం కోతకు గురై బలహీనంగా మారుతున్నాయి. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మట్టి తవ్వకాలను అడ్డుకునేందుకు మైనింగ్ అధికారులు కొంతమంది సిబ్బందిని నియమించారు. అయితే, వీరు ట్రాక్టర్ యజమానులు నుంచి మామ్మూళ్లకు కక్కుర్తిపడి మట్టి తవ్వకాలను అడ్డుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క మైనింగ్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. సమష్టిగా మట్టి తవ్వకాలను నియంత్రించాల్సింది పోయి తమ పనికాదన్నట్టు ఇరుశాఖల సిబ్బంది వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
నిబంధనలకు తూట్లు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి. క్యూబిక్ మీటర్ తవ్వకానికి రూ.150 నుంచి రూ.200 వరకు ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ తరువాతే తవ్వకాలు చేపట్టాలి. కానీ, ఇవేమీ రాజాం నియోజకవర్గంలో కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ప్రస్తుతం రాజాం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో గృహ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. వీటికి మట్టి అవసరం కావడంతో దానికి గిరాకీ పెరిగింది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో మట్టి, గ్రావెల్ తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలిస్తున్నారు. ఒక ట్రాక్టరు లోడు రూ.1000 పైమాటే. ఏకంగా యంత్రాలు పెట్టి తవ్వేస్తున్నారు. అడుగుల మేర లోతులో మట్టిని తీసి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఏ చెరువు చూసినా గోతులమయంగా మారిపోయింది. కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి పేరిట తవ్వకాలు చేపడుతున్నారు. లోడుకు రూ.50, రూ.100 రేటు కట్టి తరలిస్తున్నారు. బయట మాత్రం ట్రాక్టర్ మట్టి లోడును రూ.1000కి విక్రయిస్తున్నారు. అంత ధర ఎందుకంటే మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖకు డబ్బులు కడుతున్నామని అక్రమార్కులు చెబుతున్నారు. మట్టి తవ్వకాలపై తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కంచరాం సర్పంచ్ తెలిపారు. వారు పూర్తిస్థాయిలో స్పందించకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వీఆర్వోలకు ఆదేశాలు ఇచ్చాం
చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరగకుండా చూడాలని వీఆర్వోలకు ఆదేశాలు ఇచ్చాం. తవ్వకాలు చేపట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించాం. వినకపోతే వాహనాలను సీజ్ చేయాలని చెప్పాం. అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఎక్కడైనా తవ్వకాలు జరిగినట్లు ఫిర్యాదు అందిస్తే సంబంధిత వీఆర్వోలపై చర్యలు తీసుకుంటాం.
-కృష్ణంరాజు, తహసీల్దార్, రాజాం
చెరువులను ధ్వంసం చేస్తున్నారు
మా కళ్లెదుటే చెరువులను ధ్వంసం చేస్తున్నారు. యంత్రాలతో మట్టి తీసి ట్రాక్టర్లలో తరలించుకుపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. కనీసం గ్రామంలో ఉండే సచివాలయం సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులకు చెబితే మా పని కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
-రామినాయుడు, రైతు, వస్త్రపురికాలనీ
ఉన్నతాధికారులే పట్టించుకోవాలి
చెరువుల్లో మట్టి తవ్వకాలు అక్రమంగా చేపడుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. నాయకులు, ట్రాక్ల ర్ల యజమానులు కుమ్మక్కై మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. రాజాం పట్టణంలో గృహ నిర్మాణాలకు మట్టి అవసరం ఎక్కువగా ఉండడంతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువులను నాశనం చేస్తుండడంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులే స్పందించాలి.
-చంద్రినాయుడు, రైతు, కంచరాం