టోల్‌గేట్‌పై ఉద్యమం
ABN , Publish Date - Jul 27 , 2024 | 11:30 PM
విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్లే రహదారిలో జొన్నాడ సమీపంలోని బోడమెట్టపాలెం వద్ద ఏర్పాటు చేసిన టోల్‌గేటు వివాదాస్పదమైంది. టోల్‌గేట్‌ని ఎత్తివేయాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
టోల్‌గేట్‌పై ఉద్యమం
ఇక్కడొద్దంటూ డిమాండ్
నిరసనలు తెలియజేస్తున్న ప్రజలు
ఏర్పాటుపై అనుమానాలు
గత పాలకులకు మామూళ్లు అందినట్లు విమర్శలు
30న మహాధర్నాకు సన్నద్ధమవుతున్న ప్రజలు
విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్లే రహదారిలో జొన్నాడ సమీపంలోని బోడమెట్టపాలెం వద్ద ఏర్పాటు చేసిన టోల్‌గేటు వివాదాస్పదమైంది. టోల్‌గేట్‌ని ఎత్తివేయాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎన్‌డీఏ కూటమి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైతం కేంద్ర ఉపతరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. అదే విధంగా జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు జిల్లా, పట్టణ పౌర సంక్షేమ సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు కూడా దీనిపై దశలవారీ ఆందోళన చేస్తున్నాయి. ఈ నెల 30న టోల్‌ప్లాజా వద్ద మహాఽధర్నాకు పిలుపునిచ్చాయి.
విజయనగరం (ఆంధ్రజ్యోతి):
జీవోలో పేర్కొన్న నిబంధనల ప్రకారం టోల్‌గేట్ చెల్లూరు- గొట్లాం బైపాస్ రోడ్డుపై ఏర్పాటు చేయాల్సి ఉంది. అక్కడ వాహనాల సంఖ్య ప్రస్తుతం చాలా తక్కువగా ఉండడం.. మరో రెండు, మూడేళ్లు అయితే గాని పెరిగే అవకాశం లేదని గుర్తించిన టోల్‌గేట్ నిర్వాహకులు గత పాలకులను ప్రసన్నం చేసుకుని టోల్‌గేట్ స్థలం మార్చి నట్లు సర్వత్రా అనుమానాలు ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి వారు ప్రయాణించే ఆర్టీసీ బస్సులపై కూడా ఈ టోల్‌గేట్ ప్రభావం పడుతోంది. టోల్ చార్జీని వసూలు చేస్తున్నారు. కాగా టోల్‌గేట్ ప్రారంభానికి ముందురోజు జూలై1న లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అయినా లెక్క చెయ్యని నిర్వాహకులు జూలై 2 నుంచి టోల్‌గేట్ ప్రారంభించి.. టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.
ఇవీ నిబంధనలు
జాతీయ రహదారుల్లో టోల్‌గేట్ ఏర్పాటు నిబంధనల ప్రకారం పార్కింగ్ స్థలం ఉండాలి. విస్తృతమైన లైటింగ్ వుండాలి. రోడ్లు విశాలంగా వుండాలి.. ఇవేమీ లేకుండా టోల్‌గేటు ఏర్పాటు చేసేశారు.. ఈ నిబంధనలు పక్కాగా వున్న ప్రాంతం చెల్లూరు-గొట్లాం బైపాస్‌ను వదిలేసి బోడిమెట్టపాలెం వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు.. దీనిని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా తీవ్రస్థాయిలో వ్యతిరే కిస్తున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. మరోవైపు దీనిపై ప్రజా సంఘాలు రోజురోజుకూ నిరసన స్వరాన్ని పెంచుతున్నాయి. ఈ నెల 30న జరగనున్న మహాధర్నాలో ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు.
- టోల్‌గేట్ మార్పు వెనుక పెద్ద తతంగమే నడిచిందని తెలుస్తోంది. జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనాయుకుడితో పాటు వారి కుటుంబ సభ్యులు, కొంతమంది ప్రజా ప్రతినిధులకు కూడా భారీగా ముడుపులు అందడంతో జీవోను తుంగలోకి తొక్కి విశాఖ-విజయనగరం మార్గం మధ్యలో ఏర్పాటు చేశారనే విమర్శలు బహాటంగానే వినిపిస్తున్నాయి.