పింఛన్లపై దుష్ప్రచారం తగదు
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:09 AM
వలంటీర్ల జోక్యాన్ని ఎన్నికల సంఘం నిలువరించిందని, దీనిపై వైసీపీ నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత బేబీనాయన ఆరోపించారు.

బొబ్బిలి: వలంటీర్ల జోక్యాన్ని ఎన్నికల సంఘం నిలువరించిందని, దీనిపై వైసీపీ నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత బేబీనాయన ఆరోపించారు. మంగళవారం బొబ్బిలి కోటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేక పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. తమ సొంత కాంట్రాక్టర్లందరికీ రూ.13 వేల కోట్ల బిల్లులను చెల్లించారని అన్నారు. వలంటీర్ల వ్యవహారాన్ని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటోందని తెలిపారు. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నెలకు రూ.నాలుగు వేల చొప్పున పింఛను అందిస్తామని తెలిపారు. ఈ నెల 5 లోగా లబ్ధిదారులందరికీ పింఛన్లను పూర్తి స్థాయిలో పంపిణీ పూర్తి చేయని పక్షంలో ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురికాక తప్పదని బేబీనాయన అన్నారు.