మంత్రివర్యా.. ప్రజల అవస్థలు పట్టవా?
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:35 PM
ఆ నియోజకర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నది మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదే నియోజవర్గానికి చెందిన మరో నేత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్. ఈ నియోజవర్గం పరిధిలోని మెరకముడిదాం మండలానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు మరోనేత జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను.

- నత్తనడకన చీపురుపల్లి నూతన రైల్వే వంతెన పనులు
-పూర్తి చేయించడంలో జిల్లా ప్రజా ప్రతినిధులు విఫలం
-విద్యార్థులు, ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
ఆ నియోజకర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నది మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదే నియోజవర్గానికి చెందిన మరో నేత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్. ఈ నియోజవర్గం పరిధిలోని మెరకముడిదాం మండలానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు మరోనేత జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. ఇలాంటి కీలకనేతలు ఉన్నా ఎంతో ప్రాధాన్యమైన చీపురుపల్లి నూతన రైల్వే వంతెన పనులను (ఆర్‌ఓబీ) పూర్తి చేయించడంలో మాత్రం చొరవ చూపడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా నేతల వైఫల్యంతోనే రైల్వే వంతనె పూర్తి కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యమైనది చీపురుపల్లి రైల్వే వంతెన. విశాఖ, విజయనగరం, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి ప్రాంతాల ప్రజలు రాజాం, పాలకొండ తదితర ప్రాంతాలకు వెళ్లాలన్నా, పాలకొండ, రాజాం చుట్టుపక్కల వారంతా విజయనగరం, విశాఖ వెళ్లాలన్నా చీపురుపల్లి రైల్వే వంతెన దాటాల్సిందే. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు 2022 నుంచి భారీ వాహనాలను(హెవీ) అనుమతించడం లేదు. నూతన వంతెన నిర్మాణం కోసం రైల్వే శాఖ రూ.12.97 కోట్లు మంజూరు చేసింది. రెండేళ్ల నుంచి ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గుర్ల, గరివిడి, చీపురుపల్లి మండలాల నుంచి నిత్యం వందలాది మంది విద్యార్థులు ఈ వంతెన గుండానే రాజాం, పాలకొండ ప్రాంతాలకు చదువులకు వెళ్తుంటారు. అయితే, వంతెన పనులు పూర్తికాకపోవడంతో చీపురుపల్లి వరకు ఒక బస్సులో వచ్చి అక్కడ నుంచి ఆర్‌ఓబీ ఆవల నిలిచిన బస్సు వరకు చేరుకుని రాజాం, పాలకొండ వెళ్లాల్సి వస్తోంది. మిగతా ప్రయాణికులు కూడా ఇవే పాట్లు పడుతున్నారు. అలాగే పాలకొండ, రాజాం ప్రాంతాల నుంచి విశాఖ, విజయనగరానికి నేరుగా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో వెళ్లాల్సిన వారు మెరకముడిదాం మండలం మీదుగా చుట్టుతిరిగి వెళుతున్నారు. పాలకొండ బస్సులు చిలకపాలెం మీదుగా విశాఖ వెళుతున్నాయి. బస్సు దిగి వేరే బస్సుకు వెళితే చార్జీలు 5నుంచి పది రూపాయలు అదనంగా అవుతున్నాయి. అలాగే కాలం వృథా అవుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.
చాలా ఇబ్బంది పడుతున్నాం
చీపురుపల్లి కాంప్లెక్స్‌లో మేము బస్సు దిగి ఆర్‌ఓబీ వరకు నడిచి ఆవల ఉన్న బస్సుల కోసం వెళ్తున్నాం. పుస్తకాల బ్యాగులు, కేరీజీలు మోసుకుని అవతలకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పుడు కొత్త వంతెన అందుబాటులోకి వస్తుందా అన్న ఆశతో ఎదురు చూస్తున్నాం. రాకపోకలకు ఇబ్బందులు తొలగిలే చర్యలు తీసుకోవాలి.
-రామకృష్ణ, విద్యార్థి
ప్రయాణానికి అవస్థలు
నేను విజయనగరం నుంచి రాజాం వెళ్లేందుకు బస్సు ఎక్కాను. బస్సు బోర్డు అయితే రాజాం అని ఉంది. కానీ బస్సు మాత్రం చీపురుపల్లి వరకు మాత్రమే వెళ్లింది. ఇదేమని కండక్టర్‌ను అడిగితే చీపురుపల్లిలో దిగి రైలు బ్రిడ్జి దాటి వేరే బస్సులో రాజాం వెళ్లాలని కండక్టర్ చెప్పారు. ప్రయాణానికి తీవ్ర అవస్థలు పడుతున్నాం.
-వెంకటనాయుడు, ప్రయాణికుడు