గంజాయి నియంత్రణకు చర్యలు
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:35 PM
గంజాయి సాగు, అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం పాచిపెంట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సాలూరు/పాచిపెంట, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): గంజాయి సాగు, అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం పాచిపెంట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గంజాయి సాగు స్థానికంగా లేదు. అయినప్పటికీ డ్రోన్ల సహాయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో సర్వే ప్రక్రియ ప్రారంభించాం. పోలీసుల తనిఖీల్లో కొందరు గంజాయి పట్టుబడుతున్నా.. మరికొందరు అడ్డ దారుల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు కాకుండా బస్సుల్లో కూడా మహిళలను ఉపయోగిస్తూ గంజాయి రవాణా చేస్తున్నారు. పలు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక డాగ్‌ల ద్వారా గంజాయి అక్రమ రవాణాను గుర్తిస్తున్నాం. గంజాయి పూర్తిస్థాయి నియంత్రణకు ఒడిశా టాస్క్‌ఫోర్స్ అధికారులతో చర్చలు జరిపాం. తమిళనాడు, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల నుంచి గంజాయి తరలించే అవకాశాలు ఉన్నాయి. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూసేందుకు ఆశ్రమ పాఠశాలలు, పాఠశాలల వద్ద అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు లేకపోయినప్పటికీ నిఘా కొనసాగుతూ ఉంటుంది. సిబ్బందిని కూడా ఈ విషయంలో అప్రమత్తం చేశాం.’ అని ఆయన తెలిపారు. ఈ వార్షిక తనిఖీల్లో ఏఎస్పీ అంకిత సురానా, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ వెంకటకృష్ణ ఉన్నారు.
- సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్న వారికి సంబంధించి ఇప్పటి వరకు జిల్లాలో 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. సాలూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎంఎస్‌పీలతో సమావేశమయ్యారు. త్వరలో పోలీస్ సిబ్బంది నియామకం జరుగుతుందని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లాలో నిఘా పెంచుతామని తెలిపారు. ఇప్పటి వరకు 320 కేజీల గంజాయిని సీజ్ చేశామన్నారు. పట్టణ సీఐ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.