Share News

ఏపీఈఏపీ సెట్‌లో మనోళ్లు..

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:26 PM

ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీ)లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.

ఏపీఈఏపీ సెట్‌లో మనోళ్లు..

ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీ)లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. గత నెల 16 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. 16, 17 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యార్థులు పరీక్షలు రాయగా.. 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంజనీరింగ్‌లో మరడాన శివ లోచన్‌కు 31 ర్యాంక్‌, మక్కువకు చెందిన పొడుగు రాహుల్‌ 79వ ర్యాంక్‌, పార్వతీపురానికి చెందిన మరడాన భాను ప్రకాష్‌కు 140వ ర్యాంక్‌, పార్వతీపురానికి చెందిన ఉత్తరావల్లి ఆర్య వర్ధన్‌ నాయుడుకు 215 ర్యాంక్‌, కొమరాడ గ్రామానికి చెందిన అగురు మేఘశ్యాం కు 372 ర్యాంక్‌ వచ్చాయి. అలాగే అగ్రికల్చర్‌, ఫార్మసీ అండ్‌ బీఎస్సీ (నర్సింగ్‌)లో చిలకలపల్లి గ్రామానికి చెందిన నాగు దాసరి రాధాకృష్ణ 10వ ర్యాంక్‌, సీతానగరం మండలం జగ్గునాయుడు పేట గ్రామానికి చెందిన దోస ల మహిమ శ్రీసాయి భార్గవి 162వ ర్యాంక్‌, బొబ్బిలికి చెందిన జెన్నేటి దీక్షిత సాయి 170వ ర్యాంక్‌, సీతానగరానికి చెందిన పోల చైతన్య కుమార్‌ 182వ ర్యాంక్‌, పార్వతీపురానికి చెందిన కోరాడ హర్షిణి 500వ ర్యాంక్‌ సాధించారు.
జ్యోతిరాదిత్యకు 39వ ర్యాంకు..
పాలకొండ:
ఏపీ ఈఏపీసెట్‌లో పాలకొండ మండలం యరకారాయపురం గ్రామానికి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య 39 ర్యాంకు (ఇంజనీరింగ్‌) సాధించాడు. తల్లిదండ్రులు మోహన్‌రావు, హైమా వతి. వీరు పిల్లల విద్యాభ్యాసం కోసం శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. మోహన్‌రావు సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. హైమావతి ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకాకుళం డిపో పరిధిలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జ్యోతిరాదిత్య ఇంటర్‌లో 953 మార్కులు ఇంటర్‌లో సాధించాడు. జేఈఈ మెయిన్స్‌లో ఆల్‌ ఇండియా ఓపెన్‌ కేటగిరీ 116వ ర్యాంకు సాధించాడు. తెలంగాణ ఈఏపీసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాడు. ముంబై లేదా ఢిల్లీలో ఐఐటీలో చదవడమే తన లక్ష్యమని జ్యోతిరాదిత్య చెబుతున్నారు.
సాలూరు విద్యార్థికి 31వ ర్యాంక్‌..
సాలూరు రూరల్‌:
ఏపీఈపీ సెట్‌ ఫలితాల్లో సాలూరు విద్యార్థి మరడాన శివసాయి లోచన్‌కు 31వ ర్యాంకు (ఇంజనీరింగ్‌) లభించింది. లోచన్‌ 140.57 మార్కులు సాధించాడు. ఇతనికి తెలంగాణ ఈఏపీ సెట్‌లో 72వ ర్యాంక్‌ లభించింది. జేఈఈ మెయిన్స్‌లో 93వ ర్యాంక్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 165 వ ర్యాంక్‌ సాధించాడు. విద్యార్థి పదో తరగతి వరకు గుడివాడ, ఇంటర్మీడియట్‌ విజయవాడలో చదివాడు. విద్యార్థి తల్లిదండ్రులు మోహనరావు, సునీత పాచిపెంటలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
అగ్రికల్చర్‌, ఫార్మసీలో పదో ర్యాంకు..
సీతానగరం, జూన్‌ 11:
బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ఎన్‌.రాధా కృష్ణకు అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 10వ ర్యాంకు సాధించాడు. దీంతో తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్‌కు 79వ ర్యాంకు..
మక్కువ:
స్థానిక రామిరెడ్డివీధికి చెందిన పొడు గు హరికృష్ణ, సరిత దంపతుల కుమారుడు పొడు గు రాహుల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 79వ ర్యాంకు, జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. విద్యార్థి సాధించిన విజయం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
పవన్‌ కుమార్‌కు 89వ ర్యాంకు..
వీరఘట్టం:
మండలంలోని నడుకూరు గ్రామానికి చెందిన గొర్లె పవన్‌కుమార్‌ 89వ ర్యాంకు (ఇంజనీరింగ్‌) సాధించాడు. తండ్రి గొర్లె ప్రసాద్‌ ఎచ్చెర్ల మండలం కేశరావుపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పవన్‌కుమార్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విశాఖపట్నంలోని పైవేటు విద్యా సంస్థల్లో చదివాడు.

Updated Date - Jun 11 , 2024 | 11:26 PM