Share News

నిర్వహణ లేక.. నిప్పంటించి

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:46 PM

ss

నిర్వహణ లేక.. నిప్పంటించి
బొబ్బిలి చర్చి సెంటర్‌లో రోడ్డు మధ్యలో మట్టిదిబ్బలు

బొబ్బిలి: బొబ్బిలి మునిసిపాలిటీలోని డంపింగ్‌ యార్డులో చెత్త నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందన్న విమర్శలొస్తున్నాయి. చెత్తతో సంపద సృష్టించవచ్చని ప్రభుత్వ సూచన ఇక్కడ అమలుకు నోచుకోవడం లేదు. ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డును బొబ్బిలి మునిసిపాలిటీ సొంతం చేసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేక వీధుల్లో సేకరిస్తున్న చెత్తకుప్పలకు నిప్పంటిస్తుండడం విశేషం. పట్టణంలోని వ్యవసాయమార్కెట్‌ కమిటీ కార్యాలయం సమీపంలో గల కృష్ణాపురం రహదారిలో ఉన్న పాత డంపింగ్‌యార్డులో ప్రతిరోజూ చెత్తకు మంటలు పెడుతున్నారు. దీంతో పొగ, వాసనతో ఇబ్బందిపడుతు న్నామని స్థానికులు, వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ డంపింగ్‌ యార్డును పూర్తిగా మూసివేసి పర్యావరణపరంగా ఆ స్థలాన్ని వినియోగించుకోవాలని పలు సంఘాల ప్రతినిధులు అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన విషయం విదితమే. చెత్తకు మంట పెట్టకూడదన్న నిబంధన సైతం ఉల్లంఘించి తగలబెట్టడం సరైన పద్ధతికాదని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించాల్సిందిపోయి, ఇలా తగలబెట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు పట్టణవాసులు ప్రశిస్తున్నారు. కాగా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరుకు చెత్తకు మంటలు పెట్టవద్దని ఆదేశించామని మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు ఆంధ్రజ్యోతికి తెలిపారు.

Updated Date - Jan 14 , 2024 | 11:46 PM