లోకం మాధవి వర్సెస్ బంగార్రాజు
ABN , Publish Date - Oct 30 , 2024 | 11:59 PM
కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన వారి మధ్య విభేదాలు పొడచూశాయి. జిల్లాలో మొదటిసారిగా ఇద్దరు కీలక నాయకులు, అందులోనూ రెండు కూటమి పార్టీలకు చెందిన వారి మధ్య భేదాలు వెలుగుచూశాయి.
లోకం మాధవి వర్సెస్ బంగార్రాజు
ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం
మధ్యలో వెళ్లిపోయిన ఎమ్మెల్యే
నెల్లిమర్ల కౌన్సిల్ సమావేశంలో ఘటన
నెల్లిమర్ల, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన వారి మధ్య విభేదాలు పొడచూశాయి. జిల్లాలో మొదటిసారిగా ఇద్దరు కీలక నాయకులు, అందులోనూ రెండు కూటమి పార్టీలకు చెందిన వారి మధ్య భేదాలు వెలుగుచూశాయి. నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశం అందుకు వేదికైంది. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు రాష్ట్రస్థాయి పదవిలో ఉండడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయంలో బుధవారం జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు హాజరయ్యారు. విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లపై చర్చ సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ మొదలై ఒకానొక దశలో తీవ్రరూపం దాల్చింది. దీంతో సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. చైర్‌పర్సన్ బంగారు సరోజినితో పాటు ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, కౌన్సిలర్లు, కమిషనర్ అప్పలరాజు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో అజెండా ప్రకారం తొలి అంశం విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లపై చర్చ ప్రారంభమైంది. ఈ అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులతో పాటు ఎమ్మెల్యే నాగమాధవి సమాధానం చెబుతున్నారు. అదే సమయంలో వేదికపై ఉన్న మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు కలుగజేసుకుని మొత్తం వీధి స్తంభాలు ఎన్ని, ఎన్ని వీధి లైట్లు మరమ్మతులకు గురయ్యాయి.? వాటిని ఎప్పటిలోగా ఏర్పాటుచేస్తారు? అని ప్రశ్నిస్తూ అధికారులు స్పష్టంగా వివరణ ఇవ్వాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే లోకం నాగమాధవి కలుగ చేసుకుని నగర పంచాయతీకి ఆర్థిక సమస్యలు ఉన్నాయని, వాస్తవ పరిస్థితులు తాను చెబుతానని మీరు (బంగార్రాజును) కొంత సేపు ఆగాలని అనడంతో బంగార్రాజు ఆగ్రహించారు.
సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాఽధానం చెప్పాల్సి ఉండగా, మీరు (ఎంఎల్‌ఎ) సమాధానం చెబుతూ సమీక్ష చేస్తున్నారేంటని ప్రశ్నించారు. దీంతో కోపగించిన ఎమ్మెల్యే నాగమాధవి సమావేశానికి మీకు (బంగార్రాజు) అసలు ఆహ్వానమే లేదని, ఎలా వచ్చారని ఎద్దేవా చేశారు. దీనిపై బంగార్రాజు స్పందిస్తూ తాను ఆహ్వానం లేకుండా సమావేశానికి రాలేదని, తనకు కమిషనర్, చైర్‌పర్సన్ ఆహ్వాన నోటీసు పంపించారని ఆ నోటీసును చూపించారు. అసలు సభాధ్యక్ష స్థానాన్ని చైర్‌పర్సన్‌కు వదలకుండా మీరు (ఎమ్మెల్యే) ఎలా ఆక్రమించారని, సమీక్ష చైర్‌పర్సన్ నిర్వహించాల్సి ఉండగా, మీరు ఎలా చేస్తున్నారని బంగార్రాజు ప్రశ్నించారు. దీనికి మరింత ఆగ్రహించిన ఎమ్మెల్యే మాధవి వేదిక మీద రెండే కుర్చీలు ఉంటాయని, మీరెలా వేదిక పైకి వచ్చారని ప్రశ్నించారు. చైర్‌పర్సన్ అనుమతితోనే వేదికపై కూర్చున్నానని బంగార్రాజు సమాధానమిచ్చారు. దీంతో చిర్రెత్తు కొచ్చిన ఎమ్మెల్యే ఆగ్రహంతో లేచి నిలబడి సమావేశాన్ని రద్దు చేయాలని చైర్‌పర్సన్‌కు సూచిస్తూ సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. అయినప్పటికీ చైర్‌పర్సన్ బంగారు సరోజిని సమావేశం కొనసాగుతుందని ప్రకటించి సమావేశాన్ని తర్వాత కూడా నడిపించారు. ఈ గొడవ వైరల్ కావడంతో జిల్లా, రాష్ట్ర స్థాయి అధినాయకత్వాలకు చేరింది. తీవ్ర చర్చనీయాంశమైంది.
టీడీపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తా
కర్రోతు బంగార్రాజు
సమావేశం అనంతరం బంగార్రాజు విలేకర్లతో మాట్లాడుతూ తనకు అందిన ఆహ్వానం మేరకే సమావేశానికి హాజరయ్యానని, కనీసం కూటమి ప్రభుత్వంలో పొత్తు ధర్మాన్ని కూడా పాటించకుండా సమావేశానికి ఎందుకు వచ్చారంటూ ఎమ్మెల్యే లోకం నాగమాధవి తనను సమావేశంలో వేదికపైనే అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తమ పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. తనకు ప్రొటోకాల్ ఉందా... లేదా.. అని ఆమె ప్రశ్నించడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.