రుణాలు సరే.. రికవరీ ఏదీ?
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:51 PM
మహిళా సంఘ సభ్యుల జీవనోపాధుల మెరుగుకు పెద్దఎత్తున రుణాలు మంజూరు చేసిన అధికారులు రికవరీ ఊసు మాత్రం మరిచారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఎనిమిదేళ్లవుతున్నా.. పూర్తిస్థాయిలో వసూలు చేయలేకపోయారు.
ఎస్‌హెచ్‌జీల నుంచి పూర్తిస్థాయిలో వసూలు చేయలేక పోవడంపై విమర్శలు
తలలు పట్టుకుంటున్న వెలుగు అధికారులు
సీతంపేట రూరల్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మహిళా సంఘ సభ్యుల జీవనోపాధుల మెరుగుకు పెద్దఎత్తున రుణాలు మంజూరు చేసిన అధికారులు రికవరీ ఊసు మాత్రం మరిచారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఎనిమిదేళ్లవుతున్నా.. పూర్తిస్థాయిలో వసూలు చేయలేకపోయారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సీతంపేట మండలంలో ఐకేపీ ఉన్నతస్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఇదీ పరిస్థితి..
సీతంపేట మండలంలో మహిళా సంఘాల సభ్యులకు ఉన్నతి రుణాల కింద 2013 నుంచి 2021 వరకు సున్నా వడ్డీతో రూ.4.49 కోట్లు అందజేశారు. అప్పట్లో ఆఫ్‌లైన్ విధానంలో మహిళా సంఘాల సభ్యులు తీర్మానం చేసుకుని.. ఎంఎంఎస్ ద్వారా బ్యాంక్‌ల నుంచి రుణాలను అందించారు. అయితే వాటిల్లో ఇంకా రూ.3.38 కోట్ల మేర రుణాలు రికవరీ కావాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యల్లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వాలు, ఐకేపీ అధికారులు మారుతున్నా.. పరిస్థితి మారడం లేదు. రుణాల రికవరీ నేటికీ రెండు శాతంగానే ఉండగా.. ఎటువంటి ప్రగతి కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టించుకునే వారేరీ?
- మండలంలోని 53 పంచాయతీల్లో ఉన్నతి పథకం కింద ఎస్‌హెచ్‌జీ సభ్యుల నుంచి కోట్లలో రికవరీ చేయాల్సి ఉన్నా.. పట్టించుకునే వారే లేరు. వాస్తవానికి మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చే రుణాలను.. వారు ఏ మేరకు వినియోగించుకుంటున్నారు, వాటి ద్వారా ఏ యూనిట్లను నెలకొల్పారు, సంఘాల పనితీరు వంటి అంశాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటి కప్పుడు సమీక్షించాల్సి ఉంది. కింది స్థాయిలో పనిచేస్తున్న ఐకేపీ సీసీలు, సీఎఫ్‌లతో చర్చించాల్సి ఉంది. అయితే గడిచిన కొంత కాలంగా ఆ పరిస్థితి లేదు. ఐకేపీలో రెగ్యులర్ ఏపీడీ లేకపోవడంతో నేటికీ అటువంటి సమీక్షలేమీ జరగడం లేదు. ఉన్న ఇన్‌చార్జి ఏపీడీ కూడా పశు సంవర్థక శాఖకు చెందిన వారు కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
- మండలంలో సుమారు 50 మంది సీసీలు, సీఎఫ్‌లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. అయితే ఉన్నతి, స్ర్తీనిధి రుణాలు రికవరీలో ప్రగతి కనిపించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మహిళా సంఘాల సభ్యులకు ఉన్నతి రుణాలు ఇచ్చి సుమారు ఎనిమిదేళ్లవుతున్నా.. వాటి రికవరీ అంకెల్లో చూపుతున్నారు తప్పా ఎందుకు వసూలు చేయలేకపోతున్నారో అర్థం కావడం లేదు. దీనిపై ఐకేపీ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సి ఉంది. లేకుంటే ఎన్నాళ్లయినా ఉన్నతి రుణాలు రికవరీపరిస్థితి ఇలానే ఉండనుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
రుణాలు మంజూరు ఇలా..
స్వయం శక్తి మహిళా సంఘాల సభ్యులకు గతంలో అంటే 2020 ఏడాది వరకు ఆఫ్‌లైన్ ద్వారా వడ్డీ లేని రుణాలను అందజేసేవారు. 2021 నుంచి సంఘం పేరు, సభ్యుల వివరాలన్నీ ఆన్‌లైన్ చేశారు. వ్యక్తిగత వేలిముద్ర(థంబ్) వేయించుకొని రుణాలను ఎస్‌హెచ్‌జీ ఖాతా నుంచి సంఘం సభ్యుల వ్యక్తిగత ఖాతాలోకి జమచేస్తున్నారు. దీంతో ప్రతి సంఘం సభ్యురాలు వ్యక్తిగత పూచీకత్తుపై రుణం తీసుకుంటున్నారు.
స్ర్తీ నిధి రుణాలు ఇలా..
మండలంలో ఉన్నతి రుణాలతో పోలిస్తే స్ర్తీనిధి రుణాల రికవరీ కొంత మెరుగ్గానే ఉంది. 2022లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాల సభ్యులకు 90 పైసలు వడ్డీతో రూ.2.12 కోట్ల వరకు స్ర్తీనిధి రుణాలు అందించారు. అయితే నేటికి ఇంకా రూ.31.41 లక్షల మేర రికవరీ కావాల్సి ఉంది. మొత్తంగా 50 పంచాయతీల్లో స్ర్తీనిధి, ఉన్నతి రుణాల రికవరీ చూస్తే.. కీసరజోడు, మండ, కడగండి, గొయిది, సీతంపేట కొంత వరకు మెరుగ్గా ఉన్నాయి.
నోటీసులు ఇచ్చాం..
సీతంపేట ఐటీడీఏ పరిధిలోని టీపీఎంయూ (ట్రైబల్ ప్రాజెక్టు మానటరింగ్ యూనిట్) మండ లాల్లో ఉన్నతి, స్ర్తీనిధి రుణాల రికవరీ తక్కువగా ఉండడంపై సీసీలను హెచ్చరించాం. పీవో ఆదేశాల మేరకు సీతంపేట, కొత్తూరు మండలాల్లో ఎనిమిది మంది సీసీలకు షోకాజ్ నోటీసులను ఇచ్చాం. రుణాల రికవరీకి చర్యలు తీసుకుంటున్నాం.
- సన్యాసిరావు, ఇన్‌చార్జి ఏపీడీ, వెలుగు,సీతంపేట