లింగేశ్వరా.. ఇక్కట్లు తప్పించు!
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:45 PM
పుణ్యగిరి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అన్ని శాఖల అధికారుల సమావేశం తప్పనిసరి. ఏ శాఖకు సంబంధించిన పనులు ఆ శాఖ వారు చేపట్టేందుకు కనీసం వారం, పది రోజులైన సమయం అవసరం.

లింగేశ్వరా.. ఇక్కట్లు తప్పించు!
ఎస్.కోట పుణ్యగిరి మహాశివరాత్రి జాతర రేపే
కేవలం రెండురోజుల ముందు మొక్కుబడి సమావేశం
కొండపై పాడైన మెట్లు.. దెబ్బతిన్న రెయిలింగ్
లక్ష మంది భక్తులు కొండపైకి వచ్చే అవకాశం
పుణ్యగిరి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అన్ని శాఖల అధికారుల సమావేశం తప్పనిసరి. ఏ శాఖకు సంబంధించిన పనులు ఆ శాఖ వారు చేపట్టేందుకు కనీసం వారం, పది రోజులైన సమయం అవసరం. గతంలో ఈ విధంగానే స్థానిక రెవెన్యూ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించేవారు. మొదటి సమావేశంలో ఆయా శాఖలు చేయాల్సిన పనుల వివరాలను సూచించి, జాతర రెండు రోజులు వుందనగా పనులు ఎంతవరకు వచ్చాయో ఆరా తీసేవారు. ఈ సమయంలో జిల్లా స్థాయి అధికారులు కూడా వచ్చి పనులను పరిశీలించేవారు. ఈ ఏడాది అలాంటి సాంప్రదాయమేదీ పాటించలేదు. కేవలం రెండురోజులు ముందు మంగళవారం వివిధ శాఖల అధికారులతో తూతూ మంత్రంగా సమావేశం ఏర్పాటు చేసి మమ అనిపించారు.
శృంగవరపుకోట, మార్చి 6:
శృంగవరపుకోట పుణ్యగిరి దక్షిణ కాశీగా పేరొందింది. మహా శివరాత్రి పర్వదినాన జిల్లాతో పాటు పక్కన వున్న విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు వస్తారు. శివరాత్రి జాగారం చేసే భక్తులు ఆ రోజు అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు లక్షమంది పైబడి కొండపైకి వెళ్తారు. శ్రీదారగంగమ్మలోయ జలపాతం, శ్రీఉమాకోటి లింగేశ్వరస్వామి పాదాలను తాకుతూ వచ్చే పాతాల గంగ పుట్టదార జలపాతం వద్ద స్నానాలు ఆచరిస్తారు. గుంపులు, గుంపులుగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వ అధికారులు చూసుకోవాలి. కానీ ఈ ఏడాది ఇటువంటి ప్రయత్నాలేవీ జరగడం లేదు.
ఇవీ సమస్యలు
- శృంగవరపుకోట దేవిబొమ్మ కూడలి నుంచి పుణ్యగిరి కొండకు రెండు కిలోమీటర్లుపైబడి ఉంటుంది. ఈ రోడ్డుంతా గతుకులమయమైంది. ఎదురుగా ఒక వాహనం వస్తే మరో వాహనం తప్పించుకోవడం కష్టం. రోడ్డును విస్తరిస్తామన్న ప్రజాప్రతినిధులు గాలికి వదిలేశారు. పంచాయతీ అధికారులు రోడ్డుకు ఇరుపక్కల పొదలను మాత్రమే తొలగించగలుగుతున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.
- భక్తులు ఉమాకోటిలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే కొండెక్కాలి. 314 మెట్లు దాటి రావాలి. అవన్నీ పాడయ్యాయి. రెయిలింగ్ దెబ్బతింది. దీనికి ఏటా రంగులు వేసే దేవదాయ శాఖ అధికారులు ఈ ఏడాది ఆపనీ చేయలేదు. మెట్ల దారితో పాటు ఆలయ పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి.
- శివరాత్రి, కార్తీకమాస సమయాల్లో ఏటా మెట్ల మార్గంలో తోపులాట జరుగుతుంటుంది. దీన్ని నివారించేందుకు దారగంగమ్మలోయ నుంచి కొండపైకి మరో పక్క రోడ్డును వేస్తున్నట్లు వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటించారు. నేటికీ నిర్మించలేదు. ఏటా శివరాత్రి సమయంలో మట్టిని చదును చేసి వదిలేస్తున్నారు.
- స్నానపు ఘట్టాలు పుట్టదార, శ్రీదార గంగమ్మ లోయ వద్ద ఏర్పాట్లు అంతంతమాత్రంగా వున్నాయి. తోపులాటను నివారించేందుకు క్యూ ఏర్పాట్లు చేయాలి. ఇంతవరకు ఇవేమీ చేయలేదు.
రూ.5 లక్షలతో భక్తులకు ఏర్పాట్లు
పుణ్యగిరి జాతరలో భక్తులకు సదుపాయాలు కల్పించేందుకు దేవదాయ శాఖ రూ.5లక్షలు కేటాయించింది. గోపురానికి రంగులు వేయించాం. పారిశుధ్య పనులు చేపడతాం. విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంటాయి. పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి భోజన సదుపాయం కల్పిస్తాం.
- నాగేంద్ర, కార్యనిర్వాహక అధికారి, పుణ్యగిరి దేవస్థానం
సమన్వయంతో పని చేయాలని సూచించాం
పుణ్యగిరి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా వుండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వివిద శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల సమావేశంలో శాఖల వారీగా సదుపాయాలు కల్పించాలని సూచించాను. దేవదాయ, పంచాయతీ, విద్యుత్, అగ్నిమాపక, వైద్యశాఖ అధికారులను భాగస్వామ్యం చేస్తున్నాం.
- కిరణ్‌కుమార్, తహసీల్దార్, ఎస్.కోట