Share News

వారింతే!

ABN , Publish Date - May 15 , 2024 | 11:22 PM

ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గురించి ఎవరు ఎంతలా మొత్తుకుంటున్నా ఇంకా అనేక మందిలో మార్పు రావడం లేదు. వందలు కాదు.. వేలు కాదు.. లక్షల మంది ఈ ఎన్నికల్లో ఓటుకు దూరంగా ఉండిపోయారు

వారింతే!

వారింతే!

జిల్లాలో ఓటెయ్యని వారి సంఖ్య 3.01 లక్షలు

పార్వతీపురం జిల్లాలో 1.78 లక్షలు

తీరుమారని కొందరు ఓటర్లు

రాజాం రూరల్‌, మే 15: ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గురించి ఎవరు ఎంతలా మొత్తుకుంటున్నా ఇంకా అనేక మందిలో మార్పు రావడం లేదు. వందలు కాదు.. వేలు కాదు.. లక్షల మంది ఈ ఎన్నికల్లో ఓటుకు దూరంగా ఉండిపోయారు. మనకెందుకులే అనే ధోరణితో వ్యవహరించారు. ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 3,01393 మంది ఓటర్లు ఓటేయలేదు. పార్వతీపురం జిల్లాలో 1,78769 మంది ఓటర్లు ఓటు వేయలేదు. వెరసి రెండు జిల్లాల్లో 479769 మంది ఓటర్లు తమ అమూల్యమైన ఓటుహక్కుకు దూరమయ్యారు. అవగాహన లేకనా... లేక ఓటింగ్‌పై ఆసక్తి లేకా.. అనే విషయం వారికే ఎరుక. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేందుకు దేశవిదేశాల నుంచి వందలాది మంది స్వగ్రామాలకు రావడం చూశాం. కూర్చొనేందుకు కూడా శరీరం సహకరించని వృద్ధులు ఓటేసిన దృశ్యాలు కనిపించాయి. అయినా కొందరిలో చలనం రావడం లేదు. ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఓవైపు ఎన్నికల కమిషన్‌, మరోవైపు అధికార యంత్రాంగం, మీడియా, సోషల్‌ మీడియా ప్రచారం చేస్తున్నా ఆశించిన ఫలితం కనిపించకపోవడంపై అధికార యంత్రాంగం ఆశ్చర్యపడుతోంది.

- జిల్లాలో విజయనగరం, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్‌.కోట నియోజకవర్గాలున్నాయి. తాజాగా ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్‌ దూరంగా ఉన్న ఓటర్ల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. విజయనగరం అసెంబ్లీ స్థానంలో 72,419 మంది, రాజాంలో 54,597 మంది, బొబ్బిలిలో 45457 మంది, చీపురుపల్లిలో 33951 మంది, గజపతినగరంలో 30497 మంది, నెల్లిమర్లలో 32101 మంది, ఎస్‌.కోటలో 32371 మంది ఓటర్లు ఓటేయలేదు. ఫలితంగా చట్టసభల్లోకి అడుగుపెట్టాల్సిన అర్హులైన అభ్యర్థులు ఇంటికే పరిమితమయ్యే ప్రమాదంతో పాటు స్వప్రయోజనాల కోసం ఎన్నికల బరిలో ఉన్న వ్యక్తులు చట్టసభల్లోకి అడుగుపెట్టే అపాయమూ పొంచి ఉంది.

- పార్వతీపురంమన్యం జిల్లాలో పార్వతీపురంతో పాటు పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 178376 మంది ఓటర్లు ఈసారి ఓటుకు దూరమయ్యారు. కారణాలేమైనా గణాంకాల ప్రకారం.. పార్వతీపురం నియోజకవర్గంలో 40315 మంది, పాలకొండలో 48239 మంది, కురుపాంలో 41664 మంది, సాలూరులో 48158 మంది ఓటేయలేదు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో..

..................................................................................................................................

నియోజకవర్గం ఓటర్లు పోలైన ఓట్లు వేయనివారు

......................................................................................................................................

విజయనగరం 257206 184787 72419

రాజాం 227503 172906 54597

బొబ్బిలి 231232 185775 45457

చీపురుపల్లి 205484 171533 33951

గజపతినగరం 205471 174974 30497

నెల్లిమర్ల 213551 181450 32101

ఎస్‌.కోట 222475 190104 32371

------------------------------------------------------------------------------

పార్వతీపురం 188817 148502 40315

పాలకొండ 195020 146781 48239

కురుపాం 194114 152450 41664

సాలూరు 204489 156331 48158

........................................................................................................

Updated Date - May 15 , 2024 | 11:22 PM