Share News

సాగునీరు రావట్లే!

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:01 AM

తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు.

సాగునీరు రావట్లే!
మరుపెంటలో నారుమడులు వేసిన దృశ్యం

- తోటపల్లి పాత రెగ్యులేటర్‌ నుంచి నిలిచిన నీటి సరఫరా

- రబీపై రైతుల్లో ఆందోళన

- ఇప్పటికే నారు మడులు సిద్ధం

గరుగుబిల్లి, జనవరి 29: తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు. పాత రెగ్యులేటర్‌ పరిధిలోని ఎడమ ప్రధాన కాలువ, కుడి కాలువ నుంచి రబీకి అధికారులు సాగునీరు విడుదల చేస్తారన్న ఆశతో రైతులు సాగుకు ఉపక్రమించారు. ఇప్పటికే వరి నారు వేశారు. గత కొన్ని రోజుల క్రితం వరకూ రెండు కాలువల నుంచి కొంతమేర లీకులతో పాటు సుమారు 50 క్యూసెక్కుల నీరు విడుదలయ్యేది. అయితే అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా పూర్తిస్థాయిలో సాగునీటిని ఆదివారం నిలుపుదల చేశారు. సోమవారం కాలువల నుంచి పూర్తిగా నీరు రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నా ఎందుకు విడుదల చేయడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా రెండు కాలువల ఆధునికీ కరణ నెపంతో సాగునీటి సరఫరాలో ఆటంకం కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల నిర్వహణపై మాత్రం ప్రభుత్వం అంతగా శ్రద్ధ చూపడం లేదని వాపోతున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేసేం దుకు వారు ముందుకురావడం లేదన్నారు. ఖరీఫ్‌ సమ యంలో రెండు కాలువల పరిధిలో అధికంగా గండ్లు పడటం తో సాగునీరు పూర్తిస్థాయిలో అందక పంటలు దెబ్బతిని నష్టాలబారిన పడ్డామన్నారు. ఈ నష్టాలను గట్టెక్కిం చేందుకు రబీపై ఆశలు పెట్టుకున్నామని, తీరా అధికారులు నీటి విడుదల్లో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సాగునీరు విడుదల చేయాలని కోరుతున్నారు.

నీరు విడుదల చేయాలి

తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని ఎడమ కాలువ నుంచి రబీ సాగుకు సాగునీరు విడుదల చేయాలని అరకు నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు కోట భరత్‌కు మార్‌ కోరారు. ఈ మేరకు సోమవారం స్పందనలో రైతులతో కలిసి కలెక్టర్‌, రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు. తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని కుడి ప్రధాన కాలువ నుంచి ఇప్పటికే సాగునీరు సరఫరా చేస్తున్నారని, అయితే పాత రెగ్యులేటర్‌ పరిధిలోని ఎడమ ప్రధాన కాలువకు సరఫరా చేయడం లేదని వివరించారు. రబీకి సంబంధించి రైతులు ఇప్పటికే ఆరుతడి పంటలకు సన్నద్ధమయ్యారని, కానీ నీరు విడుదల్లో తీవ్ర జాప్యం నెలకొందన్నారు. దీనిపై స్పందించిన అధికారులు సంబంధిత నీటి పారుదలశాఖ సిబ్బందితో చర్చించారు. ఈ మేరకు ఫిబ్రవరి మొదటి వారంలో సరఫరా చేసేందుకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

Updated Date - Jan 30 , 2024 | 12:01 AM