Share News

మెరకముడిదాం మొనగాళ్లు!

ABN , Publish Date - May 03 , 2024 | 11:56 PM

- 13 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు అక్కడి వారే - చీపురుపల్లి నాయకులకు రెండుసార్లే ఛాన్స్‌ (చీపురుపల్లి)

మెరకముడిదాం మొనగాళ్లు!

- 13 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు అక్కడి వారే

- చీపురుపల్లి నాయకులకు రెండుసార్లే ఛాన్స్‌

(చీపురుపల్లి)

చీపురుపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో ఎక్కువ కాలం స్థానికేతరులే చక్రం తిప్పారు. రాజకీయ చైతన్యం ఉన్న ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వారిలో ముఖ్యంగా మెరకముడిదాం నాయకులు మొదటి స్థానంలో నిలవగా... శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాయకులు రెండో స్థానంలో నిలిచారు. ఇప్పటి వరకూ ఎన్నికైన 13 మంది సభ్యుల్లో ఐదుగురు మెరకముడిదాం మండలానికి చెందిన వారు. ముగ్గురు శ్రీకాకుళం జిల్లా వాసులకు అవకాశం దక్కింది. ఒకరు విజయనగరం నుంచి వచ్చి గెలవగా... కేవలం ఇద్దరు మాత్రమే చీపురుపల్లిలో స్థిర నివాసం ఏర్పరచుకొని...ఇక్కడి సీటును కైవసం చేసుకోగలిగారు.

అలా మొదలైంది

1952లో చీపురుపల్లి నియోజకవర్గం ఏర్పాటయ్యే నాటికి చీపురుపల్లి, మెరకముడిదాం, జి.సిగడాం, పొందూరు మండలాలు ఈ నియోజకవర్గంలో విలీనమై ఉండేవి. ఆ సమయంలో ఈ అసెంబ్లీ సీటుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం మెరకముడిదాం మండలానికి చెందిన నాయకులకే దక్కింది. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మెరకముడిదాం మండలం గర్భాం గ్రామానికి చెందిన తాడ్డె చిన అచ్చిన్నాయుడు గెలుపొంది... చీపురుపల్లి రాజకీయాల్లో స్థానికేతరుల హవాకు పునాదులు వేశారు. అనంతరం 1955లో జరిగిన ఎన్నికల్లో మెరకముడిదాం గ్రామానికి చెందిన ముదుండి సత్యనారాయణరాజు, 1962లో అదే మండలంలో చినబంటుపల్లికి చెందిన కోట్ల సన్యాసప్పలనాయుడు, 1967లో గర్భాంకు చెందిన తాడ్డె రామారావు, 1972లో ఇప్పలవలసకు చెందిన రౌతు పైడపునాయుడులు వరుసగా విజయం సాధించారు. రెండు దశాబ్దాల పాటు మెరకముడిదాం హవాకు ఎదురు లేదనిపించారు. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో మెరకముడిదాం మండలం తెర్లాం నియోజకవర్గంలో విలీనమైంది. కొత్తగా శ్రీకాకుళం జిల్లాలోని జి. సిగడాం, పొందూరు మండలాలు చీపురుపల్లిలో చేరాయి. అక్కడి నుంచి శ్రీకాకుళం నాయకుల హవా ప్రారంభమైంది.

వీరు ఇలా...

1978లో జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళానికి చెందిన చిగిలిపల్లి శ్యామలరావు, 1983లో త్రిపురాన వెంకటరత్నం, 1989లో జి.సిగడాం మండలం టంకాల దుగ్గివలస గ్రామానికి చెందిన టంకాల సరస్వతమ్మలు గెలుపొందారు. 2004, 09 సంవత్సరాల్లో విజయనగరానికి చెందిన బొత్స సత్యనారాయణ గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలానికి చెందిన కిమిడి మృణాళిని విజయం సాధించారు. ఇక్కడే నివాసం ఉంటూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వారిలో కెంబూరి రామ్మోహనరావు, గద్దే బాబూరావులు మాత్రమే ఉన్నారు. వీరిలో కెంబూరి రామ్మోహనరావు సొంత గ్రామం పుర్లి అయినప్పటికీ... తాత, తండ్రుల కాలం నుంచి చీపురుపల్లిలో స్థిరపడిపోవడంతో ఇక్కడి నాయకుడిగానే గుర్తింపు పొందారు. అదే విధంగా గద్దే బాబూరావు సుమారు నాలుగు దశాబ్దాల కిందట కృష్ణా జిల్లా నుంచి వలస వచ్చినప్పటికీ... పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఉండిపోవడంతో స్థానికుడయ్యారు.

Updated Date - May 03 , 2024 | 11:56 PM