Share News

కొయ్యానపేట వీఆర్వో సస్పెన్షన్‌

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:29 PM

మక్కువ మండలం కొయ్యానపేట గ్రామ రెవెన్యూ అధికారి ఎస్‌.రూపవతిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

 కొయ్యానపేట వీఆర్వో సస్పెన్షన్‌

- మక్కువ తహసీల్దార్‌, ఆర్‌ఐలకు షోకాజ్‌ నోటీసులు

-ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్‌

పార్వతీపురం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మక్కువ మండలం కొయ్యానపేట గ్రామ రెవెన్యూ అధికారి ఎస్‌.రూపవతిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే, తహసీల్దార్‌ షేక్‌ ఇబ్రహీం, ఆర్‌ఐ కె.స్వాతికి షాకాజ్‌ నోటీసులు ఇచ్చారు. కొయ్యానపేట రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌-45 ఐదో భాగంలో తనకు 50 సెంట్ల భూమి ఉందని, ఈ భూమిని బురిడీ చిన్నారావు ఆక్రమించుకున్నాడని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అనే వ్యక్తి ఈ నెల 15న రెవెన్యూశాఖ మంత్రి సత్య ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. భూ రికార్డులు చిన్నారావు పేరుపై ఉన్నాయని, తనకు న్యాయం చేయాలంటూ రవీంద్రనాథ్‌ కోరాడు. దీనిపై మంత్రి స్పందిస్తూ వెంటనే విచారణ జరపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌ ఉన్నతాధికారులను విచారణకు ఆదేశించారు. గతంలో కూడా ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించినా గ్రామ వీఆర్వో రూపవతి స్పందించలేదు. దీంతో ఆమెను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా తహసీల్దార్‌, ఆర్‌ఐకు షాకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి కేశవనాయుడు ధ్రువీకరించారు.

Updated Date - Oct 25 , 2024 | 11:29 PM