Share News

మహిషాసురమర్దనిగా కోటదుర్గమ్మ

ABN , Publish Date - Oct 11 , 2024 | 11:11 PM

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటదుర్గమ్మ శుక్రవారం మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చింది. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.

మహిషాసురమర్దనిగా కోటదుర్గమ్మ
మమహిషాసురమర్దనిగా దర్శనమిస్తున్న అమ్మవారు

పాలకొండ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటదుర్గమ్మ శుక్రవారం మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చింది. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. జైజై దుర్గమ్మా అంటూ భక్తజనం కోటదుర్గమ్మను దర్శించి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరోవైపు ఆలయ ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీప్రసాదశర్మ మహిళలతో కుంకుమపూజలు నిర్వహించారు. ఈవో వీవీ సూర్యనారాయణ, అర్చకులు వేమకోటి మణిశర్మ, ప్రసాదశర్మ, దేవాలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఎం.రాంబాబు, సీఐ చంద్రమౌళి, ఎస్‌ఐ ప్రయోగమూర్తి ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.

తిరువీధి ఉత్సవాలకు ఏర్పాట్లు : డీఎస్పీ

కోటదుర్గమ్మ తిరువీధి ఉత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేసినట్టు పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు తెలిపారు. శు క్రవారం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ.. శనివారం నిర్వహించే అమ్మవారి తిరువీధి ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలిరానున్నారని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటిష్ఠ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పార్వతీపురం మీదుగా వచ్చే భారీ వాహనాలు రాజాం-చిలకపాలెం మీదుగా, శ్రీకాకుళం నుంచి వచ్చే వాటిని భామిని మీదుగా మళ్లించనున్నట్లు వెల్లడించారు. అమ్మవారి తిరువీధి దారిలో వాహనాలను అనుమతించబోమన్నారు. ఆయన వెంట సీఐ చంద్రమౌళి, ఎస్‌ఐ ప్రయోగమూర్తి తదితరులున్నారు.

Updated Date - Oct 11 , 2024 | 11:11 PM