Share News

గెడ్డ అని తెలిసి.. పునాది వేసి..

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:08 AM

ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు తమ రాజకీయ మనుగడకు భూ కబ్జాను వాడుకుంటున్నారు. ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్న వారిని నిలువరించకుండా తోడ్పాటు అందిస్తున్నారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తే పట్టాలు కూడా ఇస్తామని నమ్మబలుకుతున్నారు.

గెడ్డ అని తెలిసి.. పునాది వేసి..
పూల్‌బాగ్‌ ప్రాంతంలో ఊటగెడ్డ చెంత వెలసిన పునాదులు

గెడ్డ అని తెలిసి.. పునాది వేసి..

50 వరకు కట్టడాలు నిర్మించేందుకు ప్రయత్నాలు

మళ్లీ మనమొస్తే పట్టాలంటూ మభ్యపెడుతున్న నేతలు

ఓ ప్రజాప్రతినిధి అండదండలు.. తేల్చని రెవెన్యూ అధికారులు

ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు తమ రాజకీయ మనుగడకు భూ కబ్జాను వాడుకుంటున్నారు. ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్న వారిని నిలువరించకుండా తోడ్పాటు అందిస్తున్నారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తే పట్టాలు కూడా ఇస్తామని నమ్మబలుకుతున్నారు. విజయనగరంలోని పూల్‌బాగ్‌ ప్రాంతంలో ఊటగెడ్డ పరివాహక ప్రాంతంలో జరుగుతున్న భూ వ్యవహారమిది. కొందరు వ్యక్తులు ఏకంగా కట్టడాలకు దిగారు. కొద్దినెలల కిందటే పునాదులు వేసేశారు. పట్టాలు లేకపోవడంతో అక్కడితో ఆగారు. నాయకులను సంప్రదించగా రాజకీయాలతో ముడిపెట్టారు. మళ్లీ గెలిస్తే పట్టాలు ఇచ్చేస్తామని, ఎన్నికల్లో సహకారం అందించాలని కోరుతున్నారు. ఈ ఆక్రమణలను రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

విజయనగరాన్ని ఆనుకుని ఉన్న చెరువులు ఇప్పటికే దురాక్రమణకు గురవుతున్నాయి. నాయక గణం వాటిపై పడి సొంతం చేసుకుంటున్నారు. వారి అడ్డదారి సంపాదనకు గెడ్డలూ మినహాయింపు కాదు. పూల్‌బాగ్‌ ప్రాంతంలోని ఊటగెడ్డపై ఇటీవల కొందరి కన్ను పడింది. పరివాహక ప్రాంత స్థలాన్ని ఆక్రమించి ఏకంగా 50 పునాదులు వేసేశారు. రెండో కంటికి తెలియకుండా కొద్దినెలల కిందట ఈ వ్యవహారం సాగింది. ఇందులో వైసీపీ నాయకులు, వారి అనుచరులు, వ్యాపార భాగస్వాములున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి 90 గజాలు చొప్పున పంపకాలు చేశారు. నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు స్థలాలు దక్కినట్లు సమాచారం. వీరంతా ఆఘమేఘాలమీద పునాదులు కూడా వేసేశారు. అయితే ఓ ప్రజాప్రతినిధి వ్యాపార భాగస్వామి ఆక్రమణదారులకు ఒక షరతు విధించాడట. లబ్ధిపొందిన వారంతా ఎన్నికల్లో వైసీపీ నాయకుడికి వెన్ను దన్నుగా నిలవాలని కోరాడట. మళ్లీ మనమే వస్తే పట్టాలు కూడా ఇస్తామన్నాడని తెలిసింది. కాగా గెడ్డ పొంగి ప్రవహిస్తే పునాదులు కొట్టుకు పోతాయని తెలిసినా ఆక్రమణలకు తెగించారు. ప్రజాప్రతినిధి అండదండలున్న కారణంగా రెవెన్యూ యంత్రాంగం కూడా చూసీచూడనట్లు పోతోంది. ఈ గెడ్డ పోరంబోకు ప్రాంతంలో పునాదులు వేయడంపై టీడీపీ నాయకులు స్పందనలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ నాగలక్ష్మీ ఆ ఫిర్యాదును తహసీల్దారు కార్యాలయానికి పంపించారు. అప్పటి తహసీల్దారు కోరాడ శ్రీనివాసరావు పరిశీలనకు వీఆర్‌వోను పంపించారు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధి రంగంలోకి దిగి రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో గెడ్డ పక్కనున్న ఆ స్థలం జిరాయితీ కిందకు వస్తుందని తహసీల్దారు లిఖిత పూర్వకంగా కాకుండా నోటిమాటగా ప్రకటించారు. పూర్తిస్థాయి రికార్డులు పరిశీలించి సంబంధిత స్థలం గెడ్డ పోరంబోకు కిందకు వస్తుందా లేదా అన్నది తేల్చాల్సి ఉంది. రికార్డు పరంగా కాకుండా నోటి మాటగా చెప్పి సమస్యను దులిపేసుకునేలా రెవెన్యూ యంత్రాంగం చూస్తోంది. ఒక వేళ జిరాయితీ భూమి అయినట్లయితే ఎవరి పేరున జిరాయితీగా ఉంది అన్నది తేల్చాలి. ఇప్పటికైనా ఫిర్యాదీదార్లను పిలిపించి వారి సమక్షంలో రికార్డు పరంగా ఆ భూమి సంగతి తేల్చాల్సి ఉంది. ఈ స్థలం అయ్యప్పనగర్‌ లోని సర్వే నెంబరు 136లో ఉంది. నిబంధనల ప్రకారం గెడ్డకు 30 మీటర్లు దూరం వరకూ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. గెడ్డకు ఆనుకుని ఉన్న ఈ స్థలం గెడ్డ పోరంబోకు కిందకే వస్తుందని ప్రతిపక్ష టీడీపీ నాయకులు చెబుతున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:08 AM