Share News

తాగునీటికి కటకట

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:09 AM

వీరఘట్టం మండలంలో జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనులు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ప్ర‘జల’కు కష్టాలు తప్పడం లేదు.

తాగునీటికి కటకట
నాగావళి నది నుంచి నీరు తెచ్చుకుంటున్న గడగమ్మ మహిళలు

వీరఘట్టం మండల వాసులకు తప్పని కష్టాలు

వీరఘట్టం: వీరఘట్టం మండలంలో జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనులు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ప్ర‘జల’కు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో రోజురోజుకూ తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. మరోవైపు జల్‌జీవన్‌ మిషన్‌ పనులు కూడా తుది దశకు చేరుకోకపోవడంతో గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా జేజేఎం పథకం కింద మండలంలో సుమారు 18 వేల గృహాలకు కొళాయిల తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పైప్‌లైన్లు, రక్షిత పథకం ట్యాంకుల ఏర్పాటు తదితర 121 పనులకు గాను సుమారు 22.59 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఆ నిధులతో చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొళాయిలు దిష్టిబొమ్మల్లా దర్శమనిస్తున్నాయి. వాటి నుంచి చుక్క నీరు కూడా రాకపోవడంతో ఆయా ప్రాంతవాసులు బిందెడు నీటి కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. బూరుగ తదితర గ్రామాల్లో బావుల్లోని నీరు అడుగంటింది. దీంతో వాటి అడుగున ఉన్న బురదనీటినే వారు తాగాల్సి వస్తోంది. గడగమ్మ గ్రామానికి చెందిన మహిళలు రోజూ నాగావళి నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. మండలంలోని ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొన్నా.. సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంపై పల్లెవాసులు పెదవి విరుస్తున్నారు. వేసవి నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడంపై మండి పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని గ్రామాల్లో జేజేఎం పనులను త్వరితగతిన పూర్తి చేసి తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారిని ప్రవల్లికను వివరణ కోరగా పైపులైన్‌, వాటర్‌ ట్యాంక్‌లు పనులు సమాంతరంగా జరగాల్సి ఉందన్నారు. ఈ పనులు కొంచెం ఆలస్యమవు తుండగా.. త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 12:09 AM