రేపటి నుంచి కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర
ABN , Publish Date - Mar 16 , 2024 | 12:20 AM
చీపురుపల్లి ప్రజల ఇలవేల్పు శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి 26వ జాతర మహోత్సవా లు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
చీపురుపల్లి: చీపురుపల్లి ప్రజల ఇలవేల్పు శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి 26వ జాతర మహోత్సవా లు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ కమిటీ జాతర ఏర్పాట్లు చేస్తోంది. తొలి రోజైన ఆదివారం వేకువజామున రెండు గంటలకు మొదటి పూజ జరుగుతుంది. ఉదయాన్నే సంప్రదాయం ప్రకారం నేత్రోత్సవం జరిపిస్తారు. ఏడు గంటల నుంచి పాలధారోత్సవం, మధ్యాహ్నం మూడు గంటల నుంచి అమ్మవారి ఘటాలు, ప్రభలతో ఊరేగింపు నిర్వహిస్తారు. రెండో రోజైన సోమవారం తొలేళ్ల ఉత్సవం, సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. మూడో రోజైన మంగళవారం ఘటోత్సవంతో పాటు పట్టణంలో ఉన్న కోటదుర్గమ్మ, అసిరితల్లి, భగీరథమ్మ, సిర్లి ఎల్లమాంబ, సంతానలక్ష్మి అమ్మవార్లకు భక్తులు పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. మూడు రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.